రత్నగిరి జిల్లా చిప్లూన్‌లో వరద నీటిలో మునిగిన బస్సులు
సాక్షి ముంబై: మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఆకాశానికి చిల్లులు పడ్డాయన్నట్టుగా కుండపోతగా వర్షాలు కురిశాయి. దీంతో అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యా యి. ముంబైతోపాటు ముఖ్యంగా కొంకణ్, పశ్చిమ మహారాష్ట్రలో బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. కొంకణ్, పశ్చిమ మహారాష్ట్రలోని అనేక జిల్లాల్లో నదులు, వాగులు ఉప్పొంగుతున్నాయి. రత్నగిరి, రాయ్‌గఢ్ జిల్లాల్లో దాదాపు నదులన్నీ ఉగ్రరూపం దాల్చాయి. అనేక గ్రామాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. మరోవైపు ముంబై – పుణే, ముంబై – నాసిక్ మార్గాలపై రైళ్ల రాకపోకలు గురువారం స్తంభించాయి. ఇంకోవైపు జలాశయాలన్ని నిండిపోయాయి. దీంతో ముఖ్యంగా రత్నగిరి జిల్లాలోని చిప్లూన్ తాలూకాతోపాటు కొల్హాపూర్‌లో జిల్లాలో పంచగంగా, వైశిష్ట, శివ నదులలో వచ్చిన వరదల కారణంగా ఇళ్లల్లోని నీరు చొరబడింది.
మరోవైపు వరద నీటిలో వేలాది మంది చిక్కుకుపోయారు. ఒక్క చిప్లూన్‌లోనే అయిదు వేల మందికిపైగా వరదల్లో చిక్కుకున్నారు. వీరందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు స్థానిక యంత్రాంగంతోపాటు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు, సైన్యం, నేవీ రంగంలోకి దిగాయి. ఇప్పటికే అనేక మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినప్పటికీ ఇంకా అనేక మంది తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సహాయం కోసం వేచిచూస్తున్నారు. 2005 తర్వాత ఇంత భారీ ఎత్తున వరదలు మళ్లీ ఇప్పుడే వచ్చాయంటూ అనేక మంది స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు. చిప్లూన్ పట్టణం పూర్తిగా జలమయమైంది. పట్టణంలోని మార్కెట్‌తోపాటు అనేక ప్రాంతాల్లో మొదటి అంతస్తు వరకు నీళ్లు వచ్చేశాయి. ఇలా సుమారు 12 అడుగుల నీరు చేరింది. దీంతో అనేక మంది టెర్రస్‌పైకెక్కి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు కొల్హాపూర్‌లోని చిఖలీలో గతంలో మాదిరిగానే ఈసారి కూడా ముంపుకు గురైంది. దీంతో గ్రామంలోని వారందరిని సురక్షిత ప్రాంతాలకు తరలించే పనులు ఎన్‌డీఆర్‌ఎఫ్ టీమ్ చేపట్టింది.
థానే జిల్లాలో వరద చుట్టుముట్టడంతో ఎత్తైన ప్రాంతానికి చేరుకుని సాయం కోసం చూస్తున్న ప్రజలు
రత్నగిరి జిల్లాలోని పరశురాం ఘాట్ వద్ద కొండచరియలు విరిగిపడటంతో ఇద్దరు మృతి చెందారు. వార్దా జిల్లాలో రెండు వేర్వేరు ఘటనల్లో వరద నీటిలో కొట్టుకుపోయి ఇద్దరు చనిపోయారు. రత్నగిరి జిల్లాలో జాగ్‌బుడి, వశిష్టి, కొడావలి, శాస్త్రి, భావ్ నదులు ప్రమాదకర స్థాయిని దాటి ఉప్పొంగుతున్నాయి. చిప్లూన్, ఖేడ్, లాన్జా, రాజ్‌పూర్, సంగమేశ్వర్ పట్టణాలను వరద నీరు ముంచెత్తింది. ఎడతెరపిలేని వర్షాలతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అనిల్ పరబ్ తెలిపారు. గురువారం ముఖ్యమంతి ఉద్దవ్ ఠాక్రే పరిస్థితిని సమీక్షించారు. భారత వాతావరణ శాఖ తీర ప్రాంత జిల్లాల్లో మరో మూడురోజులు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించిందని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు.
రవాణా వ్యవస్థ అస్తవ్యస్తం...
ముంబై, కొంకణ్, పశ్చిమ మహారాష్ట్రతోపాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాలో బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల ప్రభావం రవాణ వ్యవస్థపై పడింది. రోడ్డు, రైలు సేవలకు అంతరాయం కలిగింది. ముఖ్యంగా ముంబైకి సమీపంలోని టీట్‌వాలా, వాంగణీతోపాటు బద్లాపూర్, అంబర్‌నాథ్‌లలో కురిసిన వర్షం కారణంగా గురువారం తెల్లవారుజామున వరద నీరు రైల్వేట్రాక్‌పై చేరింది. రైళ్ల రాకపోకలు స్తంభించాయి. మరోవైపు కసారాలో కొండచరియలు విరిగి రైల్వే ట్రాక్‌పై పడ్డాయి. దీంతో ముంబై – నాసిక్, ముంబై – పుణేల మధ్య నడిచే మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అనేక రైళ్లు ఎక్కడికక్కడే నిలిపివేయాల్సి వచ్చింది. ముంబై నుంచి షోలాపూర్ బయలుదేరిన సిద్దేశ్వర్ ఎక్స్‌ప్రెస్ రైలు బుధవారం అర్దరాత్రి నుంచి బద్లాపూర్ రైల్వేస్టేషన్‌లో నిలిపివేశారు. దీంతో ఈ రైల్లోని ప్రయాణికులు సుమారు 11 గంటలకుపైగా ఒకే రైల్వే స్టేషన్‌లో ఉండాల్సి వచ్చింది. అనంతరం సెంట్రల్ రైల్వే ఈ రైలును బద్లాపూర్‌లోనే రద్దు చేసింది. అనంతరం అదే రైలును తిరిగి వీటి వరకు నడిపింది.
మరోవైపు ఇగత్‌పురి రైల్వేస్టేషన్‌లో కూడా అనేక రైళ్లు రద్దు చేశారు. దీంతో ఇగత్‌పురి రైల్వేస్టేషన్ నుంచి ముంబైకి వచ్చే ప్రయాణికుల కోసం సెంట్రల్ రైల్వే ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసింది. ఇలా మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (ఎంఎస్‌ఆర్‌టిసి) బస్సుల ద్వారా ముంబైకి తరలించారు. ఆరువేల మందికి పైగా ప్రయాణికులు ఇలా పలుచోట్ల చిక్కుకుపోయారు. చాలా సమయంపాటు పిల్లలు, వృద్ద ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతోపాటు ముంబై నుంచి హైదరాబాద్‌తోపాటు దక్షిణాది రాష్ట్రాలకు వెళ్లే ౖఅనేక రైళ్లను ముఖ్యంగా ముంబై – పుణే రైల్వే మార్గంపై అనేక రైళ్లను రద్దు చేశారు. అదేవిధంగా ముంబై – నాసిక్ మార్గంతోపాటు కోంకణ్ మార్గంలో కూడా పలు రైళ్లను రద్దు చేశారు. దీంతోపాటు ముంబై గోవా మార్గంపై కూడా వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందుకు గురయ్యారు. అనేక వాహనాలు వరద నీటిలో మునిగిపోగా... మరికొన్ని కొట్టుకుపోయాయి.
ఉద్దవ్‌కు మోదీ ఫోన్
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం మహారాష్ట్రలోని వరద పరిస్థితిపై ఆరా తీశారు. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేకు ఫోన్ చేసి మాట్లాడిన ఆయన కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, వరదల గురించి అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా మహారాష్ట్రకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి వరదల్లో చిక్కుపోయిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో రాష్ట్ర అధికారులకు సహాయపడుతున్నాయి. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేతో మాట్లాడాను. వరద నష్టాన్ని తగ్గించేందుకు అవసరమైన అన్నిరకాల సహాయసహకారాలు కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని తెలిపాను’ అని మోదీ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment