పోలీసులా.. మజాకా!
► 74 ఏళ్ల వృద్ధుడిపై గంజాయి కేసు
► కోర్టు ప్రశ్నలతో పోలీసుల ఉక్కిరి బిక్కిరి
► సమగ్ర విచారణకు ఆదేశం
సాక్షి, చెన్నై: పోలీసులు తలుచుకుంటే తప్పు చేయని వాడి మీద కూడా కేసుల మోతతో ఊచలు లెక్కించేలా చేస్తారన్న నానుడికి అద్దంపట్టే రీతిలో ఇటీవల ఓ వృద్ధుడి మీద కేసు నమోదైంది. 74 ఏళ్ల వృద్ధుడిపై గంజాయి కేసు పెట్టడం కోర్టును సైతం విస్మయంలో పడేసినట్టుంది. కోర్టు ప్రశ్నలతో చెన్నై పోలీసులు ఉక్కిరి బిక్కిరి కావాల్సిన పరిస్థితి. సమగ్ర విచారణకు ఆదేశిస్తూ, ఆ వృద్ధుడికి నిబంధనలతో కూడిన బెయిల్ మంజూరు అయింది.
ఆర్కేనగర్ – మణలి రోడ్డులో ఉన్న ఎలిల్ నగర్‌కు చెందిన వేదక్కన్ నాడార్ (74)పై గత నెల పోలీసులు ఓ కేసు పెట్టారు. రెండు కేజీల వంద గ్రాములు గంజాయిని తన ఇంటి బీరువాలో దాచి ఉంచిన అభియోగంపై ఆర్కేనగర్ పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. ఆగమేఘాలపై కోర్టుకు హాజరు పరిచి కటకటాల్లోకి నెట్టారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని చెన్నై మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, నియంత్ర విభాగం ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఇది తప్పుడు కేసు అన్న ప్రశ్న తెర మీదకు వచ్చింది.
పిటిషన్:
వేదక్కన్ నాడార్‌పిటిషన్‌లో...తాను నివసించే ఎలిల్ నగర్‌లో 250 ఎకరాల స్థలం ఉన్నట్టు, 50 సంవత్సరాలుగా 40 వేల కుటుంబాలు నివాసం ఉన్నట్టు వివరించారు. ఇక్కడి సంక్షేమ సంఘానికి తాను అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ స్థలాన్ని కోర్టుకు వెళ్లి తాము సాధించుకున్నా, స్థానిక ఎమ్మెల్యే, ఆయన మద్దతు దారులు కబ్జా లక్ష్యంగా కుట్రలు చేస్తూ వచ్చారని ఆరోపించారు. వీరి బండారాన్ని మీడియా దృష్టికి తీసుకురావడంతో, ఎమ్మెల్యేకు పోలీసులు సహకారం అందించి, తనతో పాటు సంఘం నిర్వాహకులపై గంజాయి కేసు బనాయించారని పేర్కొన్నారు.
తనకు బెయిల్ ఇవ్వాలని వేదక్కన్ నాడార్ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను న్యాయమూర్తి అయ్యప్పన్ విచారించారు. అయితే, పోలీసులు బెయిల్‌ను వ్యతిరేకిస్తూ, మరింత సమయం కావాలని జాప్యం చేసే పనిలో పడ్డారు. ఈ కోర్టులో పిటిషన్ తిరస్కరణకు గురి కావడంతో వేదక్కన్ నాడార్ హైకోర్టును ఆశ్రయించారు. వెయ్యి కోట్ల స్థలాన్ని కబ్జా చేయడం లక్ష్యంగా గంజాయి కేసు పెట్టారని ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్ హైకోర్టు న్యాయమూర్తి రమేష్ నేతృత్వంలోని బెంచ్ ముందుకు శనివారం వచ్చింది.
కోర్టు ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి :
పిటిషనర్ తరఫున న్యాయవాది ఆర్ రాజన్ హాజరై వాదన వినిపించారు. రూ.1000 కోట్ల విలువచేసే 250 ఎకరాల స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నాలు సాగాయని, సాగుతున్నాయని, ఇందుకు అడ్డుగా ఉన్న వేదక్కన్ నాడార్‌ను గురిపెట్టి ఈ తప్పుడు కేసు బనాయించారని వాదించారు. పోలీసులు కాలయాపణ చేస్తూ రిట్ పిటిషన్ దాఖలు చేయడం లేదని బెంచ్ దృష్టికి తెచ్చారు. వాదనల అనంతరం న్యాయమూర్తి సంధించిన ప్రశ్నలకు పోలీసులు ఉక్కిరి బిక్కిరి కావాల్సిన పరిస్థితి.
74 వృద్ధుడి మీద ఈ కేసు నమోదు కావడం బట్టి చూస్తే, తప్పుడు కేసు బనాయించారా..? మరెదేని కారణాలు ఉన్నాయా, ఉంటే సమగ్ర విచారణకు సాగించాల్సి ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.ఈ కేసును ప్రత్యేక అధికారి ద్వారా విచారించేందుకు తగ్గ చర్యలు చేపట్టాలని చెన్నై పోలీసు కమిషనర్‌కు ఆదేశాలు ఇచ్చారు. అలాగే, వేదక్కన్ నాడార్‌కు నిబంధనలతో కూడిన బెయిల్ మంజూరు చేశారు.