నాసిక్: రాష్ట్ర ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించింది. నాసిక్ డివిజన్‌లోని ధులే సమీపంలో త్వరలో సేంద్రియ వ్యవసాయ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ధులే సమీపంలోని వదానేలో దీనిని ఏర్పాటు చేయనున్నారు. 2013 అక్టోబర్‌లో సేంద్రియ వ్యవసాయంపై కొత్త విధానాన్ని ప్రభుత్వం ప్రకటించిందని, దాని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు శిక్షణ ఇవ్వడం కోసం డివిజన్ల వారీగా శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని వ్యవసాయ శాఖ అధికారి ఒకరు తెలిపారు. సేంద్రియ వ్యవసాయంలో మంచి అనుభవం ఉన్న రైతుల వ్యవసాయ క్షేత్రాల్లోనే వీటిని నెలకొల్పనున్నారన్నారు.
‘ధులే సమీపంలో వదానేలోని దిలీప్ పాటిల్ అనే రైతు వ్యవసాయ క్షేత్రంలో డివిజన్‌లోని మొట్టమొదటి శిక్షణా కేంద్రం ఏర్పాటవనుంది. ఇందుకోసం రాగష్ట్రం రూ. ఐదు లక్షల నిధుల కేటాయింపునకు ఆమోదం తెలిపింది. ఇక్కడ ఒకేసారి 50 మంది రైతులకు శిక్షణ ఇచ్చే అవకాశం ఉంది. ఇక్కడ టీవీ, ఎల్సీడీ ప్రొజెక్టర్, ఇతర పరికరాలన్నీ అందుబాటులో ఉంటాయి. పాఠాలే కాకుండా ఈ క్షేత్రంలో వాస్తవికమైన జ్ఞానాన్ని పొందగలుగుతారు. ఈ కేంద్రంలో నాసిక్‌తోపాటు జల్‌గావ్, నందూర్బార్ జిల్లాకు చెందిన రైతులకు కూడా శిక్షణ ఇస్తారు’ అని అధికారి తెలిపారు.
ఆగస్టు చివరికల్లా ఈ శిక్షణా కేంద్రం సిద్ధమయ్యే అవకాశం ఉందని రైతు దిలీప్ పాటిల్ తెలిపారు. మూడు శిక్షణా కేంద్రాలకు ప్రభుత్వం అనుమతించిందని, అందులో ఒకటి నాసిక్ డివిజన్‌లో, మరో రెండు ఔరంగాబాద్‌లోనూ ఏర్పాటు చేయనున్నట్టు ఆయన తెలిపారు. రసాయన ఎరువుల వల్ల పంట దిగుబడితో పాటు నాణ్యత కూడా తగ్గుతోందని, అంతేకాక అనేక అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఆయన అన్నారు. సేంద్రియ వ్యవసాయం వల్ల పంట దిగుబడితోపాటు నాణ్యత కూడా పెరుగుతుందని పాటిల్ చెప్పారు. రసాయన ఎరువుల కలుగుతున్న దుష్ర్పయోజనాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం రాష్ట్రంలో సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ప్రారంభించింది. మొత్తం సాగులో పది శాతాన్ని సేంద్రియ వ్యవసాయంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది.
సేంద్రియ సాగుపై సర్కారు దృష్టి
Published Mon, May 19 2014 11:26 PM | Last Updated on Sat, Sep 2 2017 7:34 AM
Advertisement