గుర్తు తెలియని వస్తువు రాలిపడి..
వేలూరు : పైనుంచి గుర్తు తెలియని వస్తువు రాలిపడి పేలుడు సంభవించడంతో తీవ్రంగా గాయపడిన మహిళ శుక్రవారం మృతి చెందారు. వేలూరు జిల్లా వానియంబాడి సమీపంలోని తురింజికుప్పంకు చెందిన భువనేశ్వరి(38) మార్చి 24న రాత్రి నిద్రిస్తుండగా ఆమె ఇంటిపై అంతుచిక్కని వస్తువు పడి పెద్ద శబ్దంతో పేలింది. పేలుడు తీవ్రతకు ఇంటి పైకప్పు పూర్తిగా ధ్వంసం కావడంతో పాటు ఇంట్లో వస్తువులు చెల్లా చెదురుగా పడిపోయాయి.
ఇంట్లో నిద్రిస్తున్న భువనేశ్వరి, ఆమె కుమార్తె తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. వారిని చికిత్స నిమిత్తం వానియంబాడి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. భువనేశ్వరి పరిస్థితి విషమించడంతో అక్కడినుంచి వేలూరు ప్రభుత్వ ఆసుపత్రి, తరువాత చెన్నై కీల్పాక్కం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్సలు ఫలించక భువనేశ్వరి శుక్రవారం ఉదయం 3గంటలకు మృతి చెందారు. దీనిపై ఆలంగాయం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే పేలుడు జరిగిన వస్తువు గురించి ఎలాంటి వివరణ ఇవ్వలేదు.
కావలూర్ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త అన్బుయగన్ బృందం ఇంటిపై పడిన వస్తువు గురించి పరిశోధనలు చేశారు. వారు ఆకాశం నుంచి తోక చుక్క రాలిపడి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. అయితే పోలీసులు ఇది ప్రమాదంగా కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా ఆరు నెలల కిందట నాట్రంబలి్లలోని ప్రయివేటు ఇంజినీరింగ్ కళాశాలపై ఇదే తరహాలో పేలుడు సంభవించడంతో బస్సు డ్రైవర్ మృతి చెందాడు. వానియంబాడిలోని వ్యవసాయ పంటలపై ఇదే తరహాలో పేలుడు సంభవించింది. దీనిపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు.