
వాట్సాప్ ఐడియా !
ఇంటి వద్దకే పూల సరఫరా
రైతు వినూత్న ఆలోచన
బొమ్మనహళ్లి : రైతు తాను పండించిన పంటలకు తానే మార్కెట్‌ను సృష్టించుకోవడం వల్ల మంచి లాభా లను పొందవచ్చు అన్నదానికి నిదర్శనం ఈ యువ రైతు. తాను పండించిన బంతిపూలకు మార్కెట్‌లో సరైన లాభాలు లేక పోవడంతో నిస్సహాయ పడకుండ తన తెలివితో వాట్సాప్ ద్వారా ఆ పూలను అమ్ముతూ మంచి లాభాలను పొందుతున్నాడు రైతు రోషన్. ఇప్పటికే సరాసరి ఒక టన్ను బంతి పూలను కొనుగోలు చేసుకోవడానికి బుక్ చేసుకున్నారు.
భాగలకోటకు చెందిన యువ రైతు రోషన్ వైజాపుర తన తెలివి తేటలతో బంతిపూలను వా ట్సాప్ ద్వారా పూలను అవసరమున్నవారికి ఇంటి వద్దకే రవాణా చేస్తున్నాడు. పూల తోటలో సాగు చేసిన పూలను వాట్సాప్ ద్వారా ఫొటోలు తీసి బు కింగ్ ఓపెన్ అని పెట్టి మెసేజ్ పంపిస్తున్నాడు.
కేవలం గంట వ్యవధిలోనే 900 కిలోల బంతిపూల కొనుగోలుకు పలువురు ముందుకు వచ్చారు. వినియోగదారులు ఇచ్చిన చిరునామా ఆధారంగా పూలను సకాలంలో అందజేస్తూ వారిచేత శభాష్ అనిపించుకుంటున్నాడు. రోషన్ మాట్లాడుతూ... పండుగ రోజుల్లో కిలో బంతిపూలు రూ. 100పైనే ధర ఉంటుందని, కొన్ని రోజుల క్రితం కిలోకు రూ. 15లు పలికేదని, సాగుచేసినా లాభాలు వచ్చేవి కావని రోషన్ తెలిపాడు. వాట్సాప్ ద్వారా పూలను ఎటువంటి అనవసర వ్యయం లేకుండా ఆర్డర్ ఇచ్చిన వారి ఇంటికే వెళ్లి అందజేస్తున్నట్లు చెప్పాడు.
వాట్సాప్ ఐడియా తనకు లాభాలను తెచ్చిపెడుతోందని రోషన్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.