నిషేధం’ ఎత్తి వేస్తారా! | The lifting slogan of the ban on the LTTE came on again | Sakshi
Sakshi News home page

నిషేధం’ ఎత్తి వేస్తారా!

Published Fri, Jul 28 2017 4:37 AM | Last Updated on Tue, Sep 5 2017 5:01 PM

నిషేధం’ ఎత్తి వేస్తారా!

నిషేధం’ ఎత్తి వేస్తారా!

ఎల్‌టీటీఈ మద్దతుగా గళం
వైగో, రామన్నల ఒత్తిడి
రంగంలోకి తమిళాభిమానులు

ఎల్‌టీటీఈలపై నిషేధం ఎత్తివేత నినాదం మళ్లీ తెరమీదకు వచ్చింది. ఐరోపా యూనియన్‌లో నిషేధం ఎత్తివేతను పరిగణనలోకి తీసుకుని భారత్‌లోనూ నిషేధం ఎత్తివేత నినాదంతో కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాలపై ఒత్తిడికి ఎండీఎంకే, పీఎంకేలు సిద్ధం అయ్యాయి. ఈలం మద్దతు, తమిళాభిమాన సంఘాలు రంగంలోకి దిగాయి.

సాక్షి, చెన్నై:  ఐరోపాను ఆదర్శంగా చేసుకుని ఎల్‌టీటీఈలపై నిషేధం ఎత్తివేయాలనే డిమాండ్‌తో ప్రభుత్వాలపై ఒత్తిడికి ఈలం మద్దతు  సంఘాలు సిద్ధమయ్యాయి. ఈలం తమిళుల సంక్షేమం  లక్ష్యంగా శ్రీలంక కేంద్రంగా ఎల్‌టీటీఈ కార్యకలపాలు ఏళ్ల తరబడి సాగుతూ వచ్చిన విషయం తెలిసిందే.  1991లో దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్యలో ఎల్‌టీటీఈల హస్తం వెలుగులోకి రావడంతో, వారిని ఉక్కుపాదంతో అణచి వేయడం లక్ష్యంగా కేంద్రం చర్యలు చేపట్టింది.

శ్రీలంకతో కలిసి ఎల్‌టీటీఈలను టార్గెట్‌ చేసింది. భారత్‌లో ఆ సంస్థకు నిషేధం విధించారు. అలాగే, భారత్‌ ఒత్తిడి మేరకు  ఐరోపా యూనియన్‌తో పాటుగా ఇంగ్లాండ్‌ తదితర దేశాలు సైతం ఎల్‌టీటీఈలకు నిషేధం విధించాయి.  ఈ నిషేధాన్ని ప్రపంచంలోని తమిళులు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ప్రధానంగా రాష్ట్రంలోని ఎల్‌టీటీఈ మద్దతు దారులు, పార్టీలు, సంఘాలు పోరాటాలు సైతం సాగిస్తున్నాయి. ఎండీఎంకే నేత వైగో అయితే, ఈ నిషేధం ఎత్తివేతకు పట్టబడుతూ ఏళ్ల తరబడి ట్రిబ్యునల్‌ ముందుకు తన వాదన వినిపిస్తూ వస్తున్నారు. స్వతహాగా న్యాయవాది అయిన వైగో స్వయంగా కోర్టుకు హాజరై మరి వాదిస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో 2009లో శ్రీలంకలో సాగిన మారణహోమం తమిళనాట ఆగ్రహ జ్వాలను రగిల్చింది. ఎల్‌టీటీఈలను సర్వనాశనం చేయడం లక్ష్యంగా సాగిన ఈ యుద్ధం ప్రపంచ దేశాల్లోని తమిళుల్ని కంటతడి పెట్టించింది. తమ సోదరులు మారణ హోమంలో హతం కావడం, ఎల్‌టీటీఈలు ఆ యుద్ధం తదుపరి నామరూపాలు లేకుండా పోయారు. ఎల్‌టీటీఈ నేత ప్రభాకరన్‌ను సింహళీయ సైన్యం హతమార్చడం ఆ శకం ముగిసింది. ప్రస్తుతం ఎల్‌టీటీఈ కార్యకలాపాలు పూర్తిగా కనుమరుగు కావడంతో నిషేధం ఎత్తి వేయాలన్న నినాదంతో వైగో కోర్టులో సమరం చేస్తూనే ఉన్నారు.

నిషేధం ఎత్తి వేస్తారా?
ఎల్‌టీటీఈలపై విధించిన నిషేధాన్ని రద్దు చేస్తూ ఐరోపా కోర్టు ఇచ్చిన తీర్పు తమిళుల్లో ఆనందాన్ని నింపాయి. ఆ యూనియన్‌లోని 26 దేశాల్లో ఎల్‌టీటీఈలకు ఉన్న నిషేధం తొలగడంతో, ఆ సానుభూతి పరులు, మద్దతు తమిళులు ఇక, స్వేచ్ఛగా ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి. ఈ తీర్పును ఆసరాగా చేసుకుని, భారత్‌లోనూ నిషేధం ఎత్తివేతకు చర్యలు తీసుకోవాలన్న నినాదం తెరమీదకు వచ్చింది. ఐరోపాను ఆదర్శంగా చేసుకుని నిషేధం ఎత్తివేయాలన్న నినాదంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడికి ఈలం మద్దతు పార్టీలు, సంఘాలు సిద్ధం అయ్యాయి.

ఈ విషయంగా వైగో మీడియాతో మాట్లాడుతూ, యుద్ధం పేరుతో తమిళుల్ని మారణహోమంలో శ్రీలంక అతి దారుణంగా హతమార్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రస్తుతం ఎల్‌టీటీఈలు లేరన్న విషయాన్ని ఆ దేశమే ప్రకటించి ఉన్నదని, అయితే, భారత్‌లో మాత్రం నేటికీ ఇంకా నిషేధం కొనసాగడం శోచనీయమని మండిపడ్డారు. ఈ నిషేధం ఎత్తి వేతకు పట్టుబడుతూ తమిళాభిమానులు, ఈలం మద్దతు సంఘాలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. పీఎంకే అధినేత రాందాసు పేర్కొంటూ, భారత్‌లోనూ నిషేధం ఎత్తి వేయాల్సిన అవసరం ఉందన్నారు. తమిళులకు వ్యతిరేకంగా కుట్రలు, కుతంత్రాలు సాగుతున్నాయని  ఆందోళన వ్యక్తంచేశారు. నిషేధం ఎత్తివేత నినాదంతో అందరూ ఏకం కావాలని, తమిళులకు మద్దతుగా, ఈలం తమిళులకు అండగా నిలబడుదామని పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement