rajiv gandhi murder
-
పస్తులుంటున్న మురుగన్
వేలూరు: రాజీవ్ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న మురుగన్ ఆహారం తీసుకోకుండా జైలు గదిలోనే ధ్యానం చేస్తున్నాడని అతని తరపు న్యాయవాది పుహలేంది శనివారం మీడియాకు వెల్లడించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో మురుగన్, పేరరివాలన్, శాంతన్ వేలూరు సెంట్రల్ జైలులో, మురుగన్ భార్య నళిని వేలూరు మహిళా జైలులో జీవిత శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. తాను 26 సంవత్సరాలుగా జైలు జీవితం అనుభవిస్తున్నానని, జైలులోనే జీవ సమాధి అయ్యేందుకు అనుమతి ఇవ్వాలని జైలు అధికారులను ఇటీవల లేఖ ద్వారా కోరాడు. అయితే ఇందుకు జైలు అధికారులు అనుమతించలేదు. ఈ క్రమంలో ఈనెల 18వ తేదీ నుంచి ఆహారం తీసుకోకుండా పస్తులుంటున్నాడు. శనివారం ఉదయం మురుగన్, నళినిల న్యాయవాది పుహలేంది జైలులో వారిని కలిసి మాట్లాడారు. అనంతరం ఆయన బయటకు వచ్చి మీడియాకు వివరాలు వెల్లడించారు. మురుగన్ జీవితంపై విరక్తితో జీవ సమాధి అయ్యేందుకు నిర్ణయించుకున్నాడన్నారు. ఆమేరకు ముఖ్యమంత్రికి, జైలు అధికారులకు లేఖ రాశాడన్నారు. అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో మురుగన్ రెండో రోజు శనివారం కూడా ఆహారం తీసుకోకుండా ధ్యానంలోనే ఉన్నాడన్నారు. జైలులోనే తన భార్య నళినిని కలిసి మాట్లాడేందుకు కూడా ఇష్టపడలేదనా్నరు. కాగా,కుమార్తె వివాహం కోసం పెరోల్ కోరుతూ నళిని వేసిన పిటిషన్ ఈనెల 18వ తేదీ విచారణకు వచ్చిందని, 22వ తేదీకి వాయిదా వేసినట్లు న్యాయవాది తెలిపారు. -
నిషేధం’ ఎత్తి వేస్తారా!
♦ ఎల్టీటీఈ మద్దతుగా గళం ♦ వైగో, రామన్నల ఒత్తిడి ♦ రంగంలోకి తమిళాభిమానులు ఎల్‌టీటీఈలపై నిషేధం ఎత్తివేత నినాదం మళ్లీ తెరమీదకు వచ్చింది. ఐరోపా యూనియన్‌లో నిషేధం ఎత్తివేతను పరిగణనలోకి తీసుకుని భారత్‌లోనూ నిషేధం ఎత్తివేత నినాదంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడికి ఎండీఎంకే, పీఎంకేలు సిద్ధం అయ్యాయి. ఈలం మద్దతు, తమిళాభిమాన సంఘాలు రంగంలోకి దిగాయి. సాక్షి, చెన్నై: ఐరోపాను ఆదర్శంగా చేసుకుని ఎల్‌టీటీఈలపై నిషేధం ఎత్తివేయాలనే డిమాండ్‌తో ప్రభుత్వాలపై ఒత్తిడికి ఈలం మద్దతు సంఘాలు సిద్ధమయ్యాయి. ఈలం తమిళుల సంక్షేమం లక్ష్యంగా శ్రీలంక కేంద్రంగా ఎల్టీటీఈ కార్యకలపాలు ఏళ్ల తరబడి సాగుతూ వచ్చిన విషయం తెలిసిందే. 1991లో దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యలో ఎల్‌టీటీఈల హస్తం వెలుగులోకి రావడంతో, వారిని ఉక్కుపాదంతో అణచి వేయడం లక్ష్యంగా కేంద్రం చర్యలు చేపట్టింది. శ్రీలంకతో కలిసి ఎల్‌టీటీఈలను టార్గెట్ చేసింది. భారత్‌లో ఆ సంస్థకు నిషేధం విధించారు. అలాగే, భారత్ ఒత్తిడి మేరకు ఐరోపా యూనియన్‌తో పాటుగా ఇంగ్లాండ్ తదితర దేశాలు సైతం ఎల్‌టీటీఈలకు నిషేధం విధించాయి. ఈ నిషేధాన్ని ప్రపంచంలోని తమిళులు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ప్రధానంగా రాష్ట్రంలోని ఎల్టీటీఈ మద్దతు దారులు, పార్టీలు, సంఘాలు పోరాటాలు సైతం సాగిస్తున్నాయి. ఎండీఎంకే నేత వైగో అయితే, ఈ నిషేధం ఎత్తివేతకు పట్టబడుతూ ఏళ్ల తరబడి ట్రిబ్యునల్ ముందుకు తన వాదన వినిపిస్తూ వస్తున్నారు. స్వతహాగా న్యాయవాది అయిన వైగో స్వయంగా కోర్టుకు హాజరై మరి వాదిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో 2009లో శ్రీలంకలో సాగిన మారణహోమం తమిళనాట ఆగ్రహ జ్వాలను రగిల్చింది. ఎల్‌టీటీఈలను సర్వనాశనం చేయడం లక్ష్యంగా సాగిన ఈ యుద్ధం ప్రపంచ దేశాల్లోని తమిళుల్ని కంటతడి పెట్టించింది. తమ సోదరులు మారణ హోమంలో హతం కావడం, ఎల్‌టీటీఈలు ఆ యుద్ధం తదుపరి నామరూపాలు లేకుండా పోయారు. ఎల్టీటీఈ నేత ప్రభాకరన్‌ను సింహళీయ సైన్యం హతమార్చడం ఆ శకం ముగిసింది. ప్రస్తుతం ఎల్టీటీఈ కార్యకలాపాలు పూర్తిగా కనుమరుగు కావడంతో నిషేధం ఎత్తి వేయాలన్న నినాదంతో వైగో కోర్టులో సమరం చేస్తూనే ఉన్నారు. నిషేధం ఎత్తి వేస్తారా? ఎల్‌టీటీఈలపై విధించిన నిషేధాన్ని రద్దు చేస్తూ ఐరోపా కోర్టు ఇచ్చిన తీర్పు తమిళుల్లో ఆనందాన్ని నింపాయి. ఆ యూనియన్‌లోని 26 దేశాల్లో ఎల్‌టీటీఈలకు ఉన్న నిషేధం తొలగడంతో, ఆ సానుభూతి పరులు, మద్దతు తమిళులు ఇక, స్వేచ్ఛగా ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి. ఈ తీర్పును ఆసరాగా చేసుకుని, భారత్‌లోనూ నిషేధం ఎత్తివేతకు చర్యలు తీసుకోవాలన్న నినాదం తెరమీదకు వచ్చింది. ఐరోపాను ఆదర్శంగా చేసుకుని నిషేధం ఎత్తివేయాలన్న నినాదంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడికి ఈలం మద్దతు పార్టీలు, సంఘాలు సిద్ధం అయ్యాయి. ఈ విషయంగా వైగో మీడియాతో మాట్లాడుతూ, యుద్ధం పేరుతో తమిళుల్ని మారణహోమంలో శ్రీలంక అతి దారుణంగా హతమార్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రస్తుతం ఎల్‌టీటీఈలు లేరన్న విషయాన్ని ఆ దేశమే ప్రకటించి ఉన్నదని, అయితే, భారత్‌లో మాత్రం నేటికీ ఇంకా నిషేధం కొనసాగడం శోచనీయమని మండిపడ్డారు. ఈ నిషేధం ఎత్తి వేతకు పట్టుబడుతూ తమిళాభిమానులు, ఈలం మద్దతు సంఘాలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. పీఎంకే అధినేత రాందాసు పేర్కొంటూ, భారత్‌లోనూ నిషేధం ఎత్తి వేయాల్సిన అవసరం ఉందన్నారు. తమిళులకు వ్యతిరేకంగా కుట్రలు, కుతంత్రాలు సాగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. నిషేధం ఎత్తివేత నినాదంతో అందరూ ఏకం కావాలని, తమిళులకు మద్దతుగా, ఈలం తమిళులకు అండగా నిలబడుదామని పిలుపునిచ్చారు. -
రాజీవ్ హత్య నేపథ్యంలో...
మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యోదంతాన్ని ప్రజలు ఇప్పటికీ మరిచిపోలేక పోతున్నారు. మానవ బాంబులనేవి ఉంటా యని చాలామందికి తెలిసింది అప్పుడే. ఈ నేపథ్యంలో మలయాళంలో ‘మెషీన్ 90 డేస్’ చిత్రం రూపొందింది. సూపర్‌స్టార్ మమ్ముట్టి సిట్ అధికారిగా నటించారు. మేజర్ రవి దర్శకత్వం వహించారు. ఇప్పుడీ చిత్రం తెలుగులో ‘శ్రీ పెరంబదూర్’ పేరుతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తేలప్రోలు వీరయ్య చౌదరి సమర్పణలో శ్రీ తిరుమల హోం ట్రేడర్స్ పతాకంపై షేక్ మహమ్మద్ హుస్సేన్ ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువదించారు. ఈ నెల 27న విడుదల కానున్న ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ -‘‘కథా కథనాలు సంచలనాత్మకంగా ఉంటాయి. అప్పటి సంఘటనలు కళ్లకు కట్టినట్టుగా చిత్రీకరించారు’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: అద్దంకి రాము, మాటలు: భారతీబాబు. -
రాజీవ్ హత్య వెనుక రాజకీయం!
చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య వెనుక రాజకీయం ఉందని ఈ కేసుకు సంబంధించి వేలూరు జైలులో ఉన్న పెరరివాళన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. హత్య వెనుక రాజకీయం ఉన్నందునే కేసు విచారణ ముగింపులో జాప్యం జరుగుతోందని చెన్నైలోని టాడా కోర్టులో గురువారం వేసిన పిటిషన్లో ఆరోపించాడు. 14 ఏళ్లుగా సాగుతున్న సీబీఐ విచారణలో పురోగతి లేదని, హత్య వెనుక రాజకీయ నేతల ప్రమేయం ఉన్నందునే విచారణలో జాప్యం జరుగుతోందన్నాడు. కోర్టు పర్యవేక్షణలో ఈ విచారణ సాగేలా చూడాలని పిటిషన్లో అభ్యర్థించాడు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు సీబీఐ ఇంతవరకు రూ.100 కోట్లు ఖర్చు చేసిందని అతని తరపు న్యాయవాది ఎన్ చంద్రశేఖర్ చెప్పారు. పిటిషన్ లో పేరరివాళన్ పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్టీటీఈ ఇంటెలిజెన్ విభాగం అధినేత బొట్టు అమ్మన్ తో పాటు మరి కొందరు నిందితులు ఇంతవరకు పట్టుబడలేదన్నారు. రాజీవ్ హత్యకేసు విచారణ ముగిసిన తర్వాత సీబీఐ అధికారులతో కూడిన ప్రత్యేక విచారణ బృందాన్ని 1999 జూన్ 17న కేంద్ర ప్రభుత్వం నియమించిందని తెలిపారు. రాజీవ్ హత్యకేసు విచారణలో పురోగతిని వివరిస్తూ టాడా కోర్టుకు వీరు ప్రతినెలా ఒక రహస్య నివేదికను అందజేస్తారని చెప్పారు. అయితే 14 ఏళ్లుగా సాగుతున్న సీబీఐ విచారణలో ఎటువంటి పురోగతి లేనందున బాధితునిగా మిగిలానని పేరరివాళన్ కోర్టుకు విన్నవించారు. విచారణ సక్రమంగా సాగితే రాజీవ్ హత్య వెనుకనున్న నిజాలు బయటపడతాయని చెప్పారు. హత్యలో కొందరు రాజకీయ నాయకులు, అధికారుల ప్రమేయం ఉన్నందునే విచారణలో జాప్యం జరుగుతోందని ఆరోపించారు. ఇంతవరకు విచారించిన వారినే మరోసారి విచారించేలా ప్రత్యేక బృందాన్ని నియమించాలని, ఈ బృందం న్యాయస్థాన పర్యవేక్షణలో సాగేదిగా ఉండాలని ఆయన కోరారు. నిజాలను నిక్కచ్చిగా వెలికితీసేలా వారికి స్పష్టమైన ఆదేశాలు సైతం ఇవ్వాలని కోరారు. పేరరివాళన్ దాఖలు చేసిన ఈ పిటిషన్ పై గురువారం టాడాకోర్టు విచారణ జరిపింది. సీబీఐ తరపున రంగనాధన్, పేరరివాళన్ తరపున ఎన్ చంద్రశేఖర్ వాదించారు. తీర్పును వచ్చేనెల 10వ తేదీకి వాయిదా వేశారు.