లైంగిక దాడికి పాల్పడి హత్య చేశారని మృతురాలి పిన్నమ్మ ఫిర్యాదు
దొడ్డబళ్లాపురం, న్యూస్‌లైన్ : తాలూకాలోని గుండప్పనాయకనహళ్లికి చెందిన మైనర్ బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వంటిపై దుస్తులు లేకపోవడం, మంటల్లో కాలిపోవడం వంటి ఆనవాళ్లను బట్టి ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడి, ఆపై హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రత్యక్ష సాక్షి, మృతురాలి తమ్ముడు సిద్దేశ్, కుటుంబ సభ్యుల కథనం మేరకు... గ్రామ శివార్లలో నివాసం ఉంటున్న గోపాలయ్యకు కుమార్తె నిర్మల(14), సిద్దేశ్ అనే బాలుడు ఉన్నారు. శనివారం గోపాలయ్య పొలానికి వెళ్లిన సమయంలో నిర్మల ఇంటిలో ఒక్కతే ఉంది. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన శివకుమార్, నరసింహమూర్తి ఇంట్లోకి చొరబడి నిర్మలపై లైంగిక దాడికి యత్నించారు. ప్రతిఘటించేందుకు నిర్మల యత్నించింది.
అప్పుడే ఇంటికి వచ్చిన సిద్దేశ్ తలుపులు కొట్టినా తీయకపోవడంతో ఇంటి వెనుక ఉన్న కిటీకీ నుంచి లోపలకు చూడగా నిందితులు నిర్మలపై లైంగిక దాడికి యత్నించడాన్ని గమనించాడు. విషయాన్ని తండ్రికి తెలిపేందుకు పొలానికి వెళ్లాడు. గోపాలయ్య ఇంటికి చేరే సరికి నిర్మల అర్ధనగ్నంగా, ఒళ్లంతా కాలిపోయి విగతజీవిగా కనిపించింది. ఆదివారం ఉదయం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఇదిలా ఉండగా నరసింహ మూర్తి, శివకుమార్ నిర్మలను తరచూ వేధిస్తూ గ్రామస్తుల చేత చీవాట్లు కూడా తిన్నారని మృతురాలి పిన్ని లక్ష్మి తెలిపింది. నిందితులు నిర్మలపై లైంగిక దాడికి పాల్పడి, హత్య చేశారని హొసహళ్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాతనే నిందితులను అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి సాక్ష్యం చెప్పేందుకు ముందుకు వచ్చిన గ్రామస్తులను, సిద్దేశ్‌ను పోలీసులు బెదిరించారని మృతురాలి పిన్నమ్మ ఆరోపిస్తోంది.
మైనర్ బాలిక అనుమానాస్పద మృతి
Published Mon, Mar 17 2014 3:25 AM | Last Updated on Sat, Sep 2 2017 4:47 AM
Advertisement
Advertisement