వచ్చేది బీజేపీ పాలనే : రాజ్‌నాథ్‌సింగ్
Published Tue, Sep 17 2013 10:59 PM | Last Updated on Fri, Sep 1 2017 10:48 PM
సాక్షి, న్యూఢిల్లీ: కమలదళం ఎన్నికల కదన రంగంలోకి అధికారికంగా అడుగుపెట్టింది. ఇప్పటికే పూర్తిస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేసుకున్న కమలనాథులు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార ప్రారంభంతో మిగిలిన వారికంటే ఒక అడుగు ముందున్నామన్న సందేశాన్ని పంపారు. తాల్‌కటోరా స్టేడియంలో మంగళవారం నిర్వహించిన భారీ ర్యాలీలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ‘ఢిల్లీలో బీజేపీ 14 ఏళ్ల వనవాసం ముగిసింది. నవంబర్‌లో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో, కేంద్రంలో బీజేపీ తప్పక అధికారంలోకి వస్తుంది’ అని రాజ్‌నాథ్‌సింగ్ ధీమా వ్యక్తంచేశారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కేంద్రంలో, ఢిల్లీలో చేపడతామన్నారు.
ఎన్నికల ప్రచారం కార్యక్రమ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ స్టేడియం వద్ద సాయంత్రం నాలుగు గంటల సమయంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఢిల్లీ ఎన్నికల ప్రచార కమిటీ ఇన్‌చార్జీ నితిన్ గడ్కరీ మాట్లాడుతూ కాంగ్రెస్ అవినీతి పాలనకు వ్యతిరేకంగా ప్రతి కార్యకర్తా పోరాడాలన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ అత్యధిక మెజారిటీతో గెలవడం ఖాయమన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఢిల్లీవాసులకు తక్కువ ధరకే విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. పదిహేనేళ్ల కాంగ్రెస్‌పాలనతో ఢిల్లీవాసులు పూర్తిగా విసిగిపోయి ఉన్నారని బీజేపీ ఢి ల్లీ ప్రదేశ్ అధ్యక్షుడు విజయ్‌గోయల్ అన్నారు. మురికివాడలు, జేజేక్లస్టర్లలు, అనధికారిక కాలనీల్లోని కోట్లాదిమంది పేదలు కాంగ్రెస్ ప్రజావ్యతిరేక విధానాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
‘ఢిల్లీని మరో ప్యారిస్‌గా మారుస్తామని ఎన్నికల ముందు వాగ్దానం చేసిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మురికివాడగా నగరాన్ని మార్చేసింది. ఆహార భద్రత అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. 15 ఏళ్లు అధికారంలో ఉండి పేదలను పట్టించుకోలేదు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడడంతో పేదలపై ఎనలేని ప్రేమ చూపుతున్నారు. మరోమారు మోసం చేసేందుకే ఈ ప్రయత్నాలు’ అని కాంగ్రెస్‌పార్టీపై గోయల్ ధ్వజమెత్తారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఢిల్లీవాసులకు ఆరోగ్య బీమా, జేజేకాలనీల్లోని ప్రతి ఒక్కరికీ ఇల్లు, మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు, ఢిల్లీ యూనివర్సిటీ కళాశాలల్లో ప్రవేశాల్లో విద్యార్థులకు నాలుగు శాతం మార్కుల మినహాయింపు కల్పిస్తామన్నారు.
పభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే చేపట్టే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతోపాటు, 15 ఏళ్ల కాంగ్రెస్‌పాలనలో జరిగిన అవినీతి, కుంభకోణాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీశ్రేణులకు ఆయన సూచించారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయనకు అంతా మంచి జరగాలంటూ పార్టీ కార్యాలయంలో హోమం నిర్వహించారు. సమావేశంలో ఢిల్లీ అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు విజయ్‌కుమార్ మల్హోత్రా, బీజేపీ సీనియర్ నాయకులు వెంకయ్యనాయుడు, రవిశంకర్‌ప్రసాద్, డాక్టర్ హర్షవర్ధన్,ఆర్తిమెహ్రా, విజయేంద్రగుప్తా తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement