► రెండు మూడు రోజుల్లో పనుల ముగింపు
► తెట్టు తొలగింపు పరిశీలనలో పన్నీరు
► ఢిల్లీ నుంచి అధికారులు
సముద్రంలో క్రూడాయిల్ తెట్టు తొలగింపు పనుల వేగం మరింతగా పెరిగింది. అదనంగా ఐదు వేల మందిని రంగంలోకి దించారు.
సాక్షి, చెన్నై : రెండు మూడు రోజుల్లో తెట్టును పూర్తిగా తొలగించడం లక్ష్యంగా చర్యలకు సీఎం పన్నీరు సెల్వం ఆదేశించారు. ఎర్నావూర్ – తిరువొత్తియూరు పరిసరాల్లో ఆదివారం పన్నీరు సెల్వం పర్యటించారు. రెండు నౌకల ఢీతో చెన్నై సముద్ర తీరంలో చోటు చేసుకున్న పరిణామాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దెబ్బతిన్న నౌక నుంచి క్రూడాయిల్ లీకేజీ సముద్రపు రంగునే మార్చేసింది. నలుపు రంగులో సముద్ర తీరం దర్శనం ఇస్తుండడంతో ఆగమేఘాలపై అధికారులు చర్యల్ని వేగవంతం చేశారు. క్రూడాయిల్ తెట్టును తొలగించేందుకు ఆదివారం కూడా తీవ్రంగానే శ్రమించారు. 25 బృందాలు రంగంలో ఉండగా, అదనంగా మరో ఐదు వేల మందితో తెట్టు తొలగింపు వేగవంతం చేశారు.
మరో రెండు మూడు రోజుల్లో తెట్టును పూర్తిగా తొలగించడం లక్ష్యంగా ప్రత్యేక కార్యచరణతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో చర్యల్ని అధికార వర్గాలు మరింత వేగాన్ని పెంచాయి. కేంద్ర నౌకాయాన శాఖ డైరెక్టర్ మాలిని వి. శంకర్ చెన్నైకు చేరుకుని, హార్బర్ వర్గాలతో సమాలోచించారు. ప్రమాద కారణాలు, తదుపరి ఏర్పడ్డ తెట్టు తీవ్రత, నష్టం తదితర అంశాలపై పరిశీలన సాగించి ఉన్నారు. సీఎం పన్నీరు సెల్వం ఉదయాన్నే ఎర్నావూర్ నుంచి తిరువొత్తియూరు వరకు మత్స్య శాఖ మంత్రి జయకుమార్‌తో కలిసి పర్యటించారు. అధికారులతో మాట్లాడారు.
అక్కడ సాగుతున్న పనుల్ని పరిశీలించి మరింత వేగవంతానికి తగ్గ చర్యలకు ఆదేశించారు. తదుపరి సచివాలయం చేరుకున్న పన్నీరుసెల్వం తెట్టు తొలగింపులో రాష్ట్ర ప్రభుత్వ చర్యలపై సమీక్షించారు. రెండు మూడు రోజుల్లో తెట్టును పూర్తిగా తొలగించడం లక్ష్యంగా ఆదేశాలు ఇచ్చారు. ఇదే సీఎంగా పన్నీరుకు చివరి సమీక్ష కావడం గమనార్హం. తదుపరి అన్నాడీఎంకే కార్యాలయానికి చేరుకుని ఇక, సీఎం పగ్గాలు చిన్నమ్మ శశికళకు అప్పగించే విధంగా పన్నీరు తీర్మానం తీసుకురావడంతో ఇక, సీఎం బాధ్యతల నుంచి తప్పుకున్నారని చెప్పవచ్చు.