సమీకరణాలు | The state is currently present By-elections | Sakshi
Sakshi News home page

సమీకరణాలు

Published Sat, Aug 17 2013 3:36 AM | Last Updated on Tue, Aug 14 2018 2:50 PM

The state is currently present By-elections

సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో ప్రస్తుతం ఉప ఎన్నికలు జరుగుతున్న తరుణంలో రాజకీయ సమీకరణలు జోరుగా మారుతున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష జేడీఎస్ నుంచి నిష్ర్కమణలు ప్రారంభమయ్యాయి. బెంగళూరు గ్రామీణ, మండ్య లోక్‌సభ స్థానాలతో పాటు మైసూరు, ధార్వాడ, చిత్రదుర్గ శాసన మండలి స్థానాలకు ఈ నెల 21, 22 తేదీల్లో ఉప ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్‌లు అవగాహనకు వచ్చాయి. దీనిపై జేడీఎస్‌లోని సీనియర్ నాయకులు గుర్రుగా ఉన్నారు. పార్టీ అధ్యక్షుడు దేవెగౌడ వ్యవహార శైలిపై అనేక మంది నాయకులకు ఆగ్రహం ఉన్నప్పటికీ, సందర్భం కోసం ఎదురు చూస్తున్న వారంతా పార్టీని ఫిరాయించడానికి ఇదే సరైన తరుణమని భావిస్తున్నారు.

మాజీ స్పీకర్ కృష్ణ, మాజీ ఎంపీ నారాయణస్వామి కాంగ్రెస్‌లో చేరడం పార్టీ శ్రేణులను దిగ్భ్రాంతికి గురి చేసింది. పార్టీలో సీనియర్లయిన వీరద్దరినీ దళాధిపతి ఏనాడో పక్కన పెట్టేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పార్టీ టికెట్ల కోసం ప్రయత్నించి విఫలమైనప్పటి నుంచీ వీరిద్దరూ అధినేతపై గుర్రుగా ఉన్నారు. ఇక బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. శాసన సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరిన మాజీ డీజీపీ శంకర బిదరి సమాజ్ వాదిలో చేరడమే కాకుండా ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.

అయితే ఆ పార్టీ తరఫున ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే సీపీ. యోగీశ్వర్‌ను కాంగ్రెస్‌కు మద్దతునివ్వాల్సిందిగా ఆ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఆదేశించారు. బెంగళూరు గ్రామీణ నియోజక వర్గంలోని చన్నపట్టణ అసెంబ్లీ స్థానానికి యోగీశ్వర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సతీమణి అనిత స్థానం నుంచి జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గత వారంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య యోగీశ్వర్‌ను తన క్యాంప్ కార్యాలయానికి పిలిపించి కాంగ్రెస్‌కు మద్దతునివ్వాలని కోరారు. అయితే తనకు మంత్రి పదవినిస్తే మద్దతునిస్తానని యోగీశ్వర్ షరతు విధించారు.

 ప్రచార శైలిపై నివేదిక
 రెండు లోక్‌సభ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచారానికి సంబంధించి నివేదికను సమర్పించాల్సిందిగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ పార్టీ రాష్ట్ర నాయకులను కోరారు. వచ్చే ఏడాది జరుగనున్న లోక్‌సభ ఎన్నికలకు ఈ ఉప ఎన్నికలను సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్న కాంగ్రెస్ ఆరు నూరైనా రెండు స్థానాల్లోనూ గెలిచి తీరాలని గట్టి పట్టుదలతో ఉంది. కేంద్రంలో రెండు సార్లు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణమైన ఆంధ్రప్రదేశ్‌లో ఆ పార్టీకి ఈసారి ఘోర పరాజయం తప్పదని తాజా సర్వేలు సైతం స్పష్టం చేస్తుండడంతో అధిష్టానం కర్ణాటకపై చాలా నమ్మకాలు పెట్టుకుంది. ఆంధ్రప్రదేశ్ నష్టాన్ని ఇక్కడ పూడ్చలేక పోయినా, అధికారంలో ఉన్నందున గౌరవప్రదమైన స్థానాలను గెలుచుకోవాలన్నది పార్టీ సంకల్పం. జేడీఎస్ ప్రాబల్యమున్న ఈ రెండు నియోజక వర్గాల్లో పైచేయి సాధిస్తే శ్రేణుల్లో ఉత్సాహం ద్విగుణీకృతమవుతుందనే అంచనాతో విజయం కోసం ఉవ్విళ్లూరుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement