
శ్రమ ఫలించేనా?
రాష్ర్ట కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు తొలగించేందుకు నేటి నుంచి కసరత్తు
మూడు రోజుల పాటు బెంగళూరుకు పరిమితం కానున్న డిగ్గీ రాజా
బెంగళూరు : రాష్ర్ట కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలను తొలగించేందుకు శుక్రవారం నుంచి కసరత్తు మొదలు కానుంది. అయితే ఈ కార్యాచరణపై నీలి మేఘాలు కమ్ముకున్నాయి. నాయకుల మధ్య ఏర్పడిన పొరపొచ్ఛాలను కొలిక్కి తీసుకువచ్చేందుకు రాష్ర్ట కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ మూడు రోజుల పాటు బెంగళూరులో మకాం వేయనున్నారు. ఈ మూడు రోజుల పాటు రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై విస్తృతస్థాయి చర్చ జరగనుంది. ఇందులో భాగంగా సతీష్ జారకీహోళీ రాజీనామా విషయం ప్రధానంగా ప్రస్తావనకు రానుంది. మంత్రులకు ఇష్టం లేకపోయినా వారి పనితీరుపై అధికారులతో ముఖ్యమంత్రి నివేదికలు సిద్ధం చేయించి హైకమాండ్‌కు పంపడంపై కొందరు సిద్ధరామయ్యపై గుర్రుగా ఉన్నారు. వీరు కూడా రాజీనామా అస్త్రంతో సీఎంను దెబ్బతీసేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ నేపథ్యంలోనే మంత్రులు తమకు అందుబాటులో ఉండడం లేదంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే గగ్గోలు పెడుతున్న వైనం కూడా చర్చకు రానుంది. వీటితో పాటు కొందరు మంత్రులు కమీషన్ ఏజెంట్లుగా మారిన వైనంపై చర్చ జరగనుంది. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యే మధ్య ఏర్పడిన అఘాతం కాంగ్రెస్ పార్టీని రోజురోజుకూ బలహీనపరుస్తోంది. ఇలాంటి తరుణంలో సమస్యల పరిష్కారానికి తొలిరోజునే దిగ్విజయ్ సింగ్ ప్రాముఖ్యతనిచ్చినట్లు సమాచారం. ఆయన దౌత్యం ఎంత మేరకు ఫలితాన్ని చేకూరుస్తోందో వేచి చూడాలి.