'డ్రాప్' అంటూనే దోచేస్తున్నారు
బెంగళూరు : ఉద్యాన నగరి నేర నగరికి మారిపోయింది. దారి దోపిడీలు, చైన్ స్నాచింగ్లు, బెదిరింపులు తదితర కేసులు అధికంగా నమోదవుతున్నాయి. మరీ రాత్రి వేళల్లో ప్రయాణం ప్రాణాంతకంగా మారుతోంది. దుర్మార్గులు ఏకంగా దోచుకోవడంతోపాటు హత్యలకు కూడా తెగబడుతున్నారు. హైదరాబాద్కు చెందిన ధృవ్ బెంగళూరులోని ఓ ఐటీ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. అయితే ఈనెల 17న కాడుబేసినహళ్లిలో ఉన్న ఇంటికి బయల్దేరాడు.
బస్సులు లేకపోవడంతో వేచి ఉన్న అతన్ని ఆటో డ్రైవర్ ఆరా తీశాడు. రాత్రి 12.00 గంటల సమయంలో ఆటో ఎక్కించుకున్నాడు. అప్పటికే అందులో మరో వ్యక్తి ఉన్నాడు. ఆటో బయల్దేరిన కొద్దిసేపటికి డ్రైవర్ దారి మళ్లించాడు. ఇదేంటని అడిగితే 'షార్ట్కట్ సార్ అందుకనే' అనే సమాధానం ఇచ్చాడు. ఆటో నిర్మానుష్య ప్రాంతానికి వెళుతోందన్న విషయాన్ని గమనించి ఆటోను ఆపమని కోరినా డ్రైవర్ వినిపించుకోలేదు.
ఉన్నఫళంగా సీట్లో ఉన్న మరో వ్యక్తి వెనకసీట్లోకి వచ్చి... ధృవ్ను కత్తితో బెదిరించాడు. ఫోన్తోపాటు విలువైన వస్తువులు, నగదు లాక్కున్నారు. అప్పటికీ ఆటో ఆపకపోవడంతో ధృవ్ కిందకు దూకేశాడు. ఇదే తరహాలో మరో టెక్కీ వరుణ్ని అడ్డగించిన కొంతమంది దుండగులు తాము పోలీసులమని చెప్పి అతని వద్ద నుంచి బలవంతంగా రూ. 60 వేలను దోచుకున్నారు. ఇలాంటి ఘటనలు నగరంలో ఇటీవల పెరిగిపోతున్నాయి.
వారాంతాల్లోనే అధికం....
ఈ తరహా దారి దోపిడీలు ఎక్కువగా వారాంతాల్లోనే నమోదవుతున్నాయి. వారాంతాల్లో పార్టీలకు హాజరై ఆలస్యంగా ఇంటికి చేరుకునే యువతను టార్గెట్ చేసుకొని ఈ ముఠాలు దారిదోపిడీలకు పాల్పడుతున్నాయి. పోలీసులమని చెప్పి బెదిరించి నగదు లాక్కోవడం, లిఫ్ట్ ఇస్తామంటూ బైక్లోనో, ట్యాక్సీలోనో తీసుకెళ్లి దోపిడీకి పాల్పడడంతో పాటు అర్థరాత్రి దాటాక ఆటో ఎక్కే ప్రయాణికులను సైతం కొంత మంది డ్రైవర్లు టార్గెట్గా చేసుకుంటున్నారు.
ఇక ఈ విషయంపై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్లోని ఓ ఉన్నత స్థాయి అధికారి మాట్లాడుతూ... ఇటీవల నగరంలో ఇలాంటి ఘటనలు అధికమవుతున్నాయని చెప్పారు. ఇలాంటి దోపిడీలకు పాల్పడే ముఠాలను అరెస్ట్ చేస్తున్నప్పటికీ వారు ఒకటి లేదా రెండు నెలల్లోనే బెయిల్పై బయటకు వచ్చేస్తున్నారు. మళ్లీ ఇదే రకమైన నేరాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా వారాంతాల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి అని చెప్పారు.