లింగ మార్పిడి కేంద్రంలో ప్రేమ..
ముంబై: యుక్త వయసు నుంచి తన తోటి వారిని(మగ అయితే అబ్బాయిలను లేదా ఆడ అయితే అమ్మాయిలను) చూస్తే ఏదో తెలియని కోరిక.. శరీరంలో తెలియని వింత మార్పులు వారిని తీవ్రంగా కలవరపరిచేవి. అమ్మానాన్నలతో తమకు ఇలా అనిపిస్తోందని చెప్పుకుందామనుకున్నా వారు ఎలా తీసుకుంటారోనన్న భయం. క్షణక్షణం మానసిక క్షోభ... ఆత్మహత్యకు పురిగొల్పే ఆలోచనలతో సతమతాల మధ్య వారు పెరిగి పెద్దయ్యారు.
తమకంటూ స్వతంత్రత సంపాదించుకున్నారు. మనసులోని కలను సకారం చేసుకునేందుకు ముంబై పయనమయ్యారు(ఒకరికి మరొకరు తెలియదు). వారు ఆరవ్ అప్పుకుట్టన్(46), సుకన్యే కృష్ణ(21). జెండర్ ఐడెంటిటీ డిజార్డర్(జీఐడీ) అనే వ్యాధితో చిన్ననాటి నుంచి బాధపడుతున్నారు. ముంబైలోని లింగ మార్పిడి కేంద్రంలో ఒకరికి మరొకరు పరిచయం అయ్యారు.
ఇద్దరి ఆలోచనలు ఒక్కటే. అలా ఇద్దరి మధ్య స్నేహానికి బీజం పడింది. ఆపరేషన్ చేయించుకున్న అనంతరం అరవ్ అప్పుకుట్టన్ అమ్మాయిగా మారితే.. సుకన్యే కృష్ణ అబ్బాయిగా రూపాంతరం చెందారు. కొన్నాళ్ల వీరి స్నేహం.. ప్రేమగా మారింది. ఒకరికొకరు తమ గుండెల్లో దాగిన మాటలను చెప్పుకుని ఒక్కటయ్యారు. పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఆనందంగా జీవనం సాగిస్తున్నారు.
సాయం చేద్దామనే ఆలోచన..
ఆరవ్, సుకన్యేలకు ఓ ఆలోచన వచ్చింది. అది కూడా అలాంటి ఇలాంటి ఆలోచన కాదు. మహోన్నతమైనది. తమలా జీఐడీతో బాధపడుతున్న వ్యక్తులకు సాయం చేసి.. వారి జీవితాల్లో వెలుగు నింపాలనే దేదిప్యమానమైన ఆలోచన. దాన్ని ఆచరణలో పెట్టేందుకు సోషల్‌మీడియాను మార్గంగా ఎంచుకున్నారు. ఫేస్‌బుక్‌లో ఓ గ్రూప్‌ను క్రియేట్ చేశారు. జీఐడీతో బాధపడుతున్న వ్యక్తులు ఈ గ్రూపులో తమ సమస్యలు చెప్పుకొవచ్చు. గ్రూపులో డాక్టర్లు కూడా ఉన్నారు. బాధితులకు వారు సలహాలు అందిస్తారు.