మహిళలు అనారోగ్యానికి గురైనట్టు నటించి..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మహిళా దొంగలు హడలెత్తిస్తున్నారు. ముఖ్యంగా మెట్రో రైళ్లల్లో ప్రయాణించేవారిని లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ ఏడాదిలో కేంద్ర పారిశ్రామిక భద్రత సిబ్బంది (సీఐఎస్‌ఎఫ్) 532 మంది మహిళా దొంగలను అదుపులోకి తీసుకున్నారు. 10 నుంచి 12 వరకు మహిళా గ్యాంగులు దొంగతనాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు.
రద్దీగా ఉన్న మెట్రో రైళ్లల్లో మహిళా దొంగలు అకస్మాత్తుగా అస్వస్థతకు గురైనట్టు నటిస్తారు. ప్రయాణికులు సాయం చేసేందుకు వెళితే మహిళా దొంగలు వారి నుంచి డబ్బు, విలువైన వస్తువులను కాజేస్తారు. మెట్రో రైళ్లల్లో ప్రతి రోజూ ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయని, దొంగతనాలకు పాల్పడుతున్న వారిలో మహిళా దొంగలే ఎక్కువని అధికారులు తెలిపారు. ఈ ఏడాది 246 కేసులు నమోదయ్యాయని, అయితే చాలా సందర్భాల్లో బాధితులు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయరని చెప్పారు. ఆరు లేదా ఏడుగురు మహిళా దొంగలు రద్దీగా ఉన్న మెట్రో స్టేషన్లలో ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుంటున్నారని తెలిపారు. వీరు ఓ వ్యక్తి చుట్టూ చేరి ఒకరు అనారోగ్యానికి గురైనట్టు నటిస్తారని, సాయం చేయమని కొందరు అతన్ని కోరుతారని, ఈ క్రమంలో ఇతర మహిళలు డబ్బు, విలువైన వస్తులను దొంగిలిస్తారని చెప్పారు.