ఏటీఎంలోకి చొరబడిన దుండగులు
యంత్రం ధ్వంసం చేసి నగదు లూటీకి విఫలయత్నం
సెక్యూరిటీ గార్డు అప్రమత్తతో ఉడాయించిన దొంగలు
బెంగళూరు : దుండగలు ఏటీఎంలోకి చొరబడి నగదు లూటీకి విఫలయత్నం చేసిన ఘటన సదాశివనగర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. సదాశివనగరలోని భాష్యం సర్కిల్‌లో కర్ణాటక బ్యాంకు ఉంది. అదే భవనంలోనే ఏటీఎం కేంద్రం ఏర్పాటు చేశారు. ఇక్కడ షంషుద్దీన్ అనే వ్యక్తి సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. బుధవారం వేకువ జామున 2.30 గంటల సమయంలో ఆటోలో వచ్చిన ముగ్గురు దుండగులు ఏటీఎంలోకి చొరబడ్డారు. సీసీ కెమెరాను స్థానభ్రంశం చేసి ఇనుప రాడ్‌తో యంత్రం ధ్వంసం చేశారు.
శబ్ధం కావడంతో లోపల గదిలో నిద్రిస్తున్న సెక్యూరిటీగార్డు అప్రమత్తమై మరో ప్రాంతంలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డుకు, పోలీసులకు సమాచారం అందజేశాడు. స్నేహితుడు రాగానే ఇద్దరూ కలిసి దుండగులను పట్టుకునేందుకు యత్నించారు. అయితే దుండగులు చాకచక్యంగా తప్పించుకొని ఆటోలో ఉడాయించారు. అనంతరం పోలీసులు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. సీసీ కెమెరాలలో నిందితుల భావచిత్రాలు రికార్డు అయ్యాయని, త్వరలో వారిని అరెస్టు చేస్తామని తెలిపారు.