- సంక్షోభంలో సేద్యం.. : సీఎం
- లాభదాయక రంగం కాకపోవడమే కారణం
- అగ్రికల్చర్‌పై యువత విముఖత
- రాష్ట్రంలో వర్షాధార వ్యవసాయమే ఎక్కువ
- గిట్టుబాటు కాక ఊర్లకు ఊర్లే ఖాళీ
- 50 శాతం గ్రామీణులు వలస
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : వ్యవసాయంపై రాను రాను రైతులకు మొహం మెత్తుతోందని, లాభదాయకం కాకపోవడమే దీనికి కారణమని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. ఎవరో పాత తరం వారు తప్ప యువత వ్యవసాయం పట్ల పూర్తి విముఖతతో ఉందని తెలిపారు. ఇది అపాయకరమైన పరిణామమని, వ్యవసాయాన్ని ఆకర్షణీయమైన రంగంగా తీర్చి దిద్దడానికి అవసరమైన సహాయ సహకారాలు అందించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. విధాన సౌధలోని బాంక్వెట్ హాలులో బుధవారం ఆయన పలువురు రైతులకు వ్యవసాయ పురస్కారాలను ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా ప్రసంగిస్తూ, రైతులు గౌరవప్రదమైన జీవితాన్ని గడిపే వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నాలు జరిగాయని, అవన్నీ సాఫల్యం కావాల్సి ఉందని అన్నారు. రాష్ట్రంలో వర్షాధార వ్యవసాయం ఎక్కువని, దీనిని దృష్టిలో ఉంచుకునే వాన నీటి సంరక్షణ చర్యలకు రూ.500 కోట్లను కేటాయించామని వివరించారు. గతంలో వర్షాలు బాగా పడడంతో పాటు పంటలూ బాగా పండేవని గుర్తు చేసుకున్నారు. రైతులు నెమ్మదిగా, సంతోషంగా ఉండేవారని చెప్పారు. ప్రస్తుతం వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడంతో ఊర్లకు ఊర్లే ఖాళీ అవుతున్నాయని తెలిపారు.
తమ ఊర్లోనే 50 శాతం మంది వలస పోయారని వాపోయారు. కొందరు విద్యావంతులై ఊరు వదలగా, మరి కొందరు వ్యవసాయంపై ఆధారపడి బతకలేమని వెళ్లిపోయారని తెలిపారు. కుటీర పరిశ్రమలు నాశనమై పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణులు వలసలు పోతున్నందున, పట్టణాలపై ఒత్తిడి పెరుగుతోందని తెలిపారు.
ఈ వలసలను నివారించడానికి వ్యవసాయాన్ని లాభదాయకంతో పాటు ఆకర్షణీయంగా మలచాల్సిన అనివార్యత ఏర్పడిందని చెప్పారు. వ్యవసాయ శాఖ కేవలం ఎరువులు, విత్తనాలు పంపిణీ చేయడం కోసమే కాకుండా రైతులకు అన్ని విధాలా సాయపడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రులు రామలింగా రెడ్డి, రమానాథ్ రై, కృష్ణ బైరేగౌడ ప్రభృతులు పాల్గొన్నారు.