సాక్షి, ముంబై: బహిరంగ ప్రదేశాల్లో పొగతాగడం మాత్రమే నిషేధం అమల్లో ఉన్న మన రాష్ట్రంలో ఇకపై పొగాకు నమిలి ఎక్కడ పడితే అక్కడ ఉమ్మివేయడంపై కూడా నిషేధం విధించనున్నారు. బహిరంగ ప్రదేశాల్లో పొగాకు నమిలి ఉమ్మివేసేవారిపట్ల కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ భావిస్తోంది. నిషేధానికి సంబంధించి మరో పక్షం రోజుల్లో ఆదేశాలు జారీ చేయనున్నట్లు ఆరోగ్యశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
ఒక వేళ ఇది అమలయితే బహిరంగ ప్రాంతాల్లో పొగాకు ఉత్పత్తులను ఉమ్మివేయకుండా నిషేధించిన మొట్టమొదటి రాష్ట్రంగా మహారాష్ట్ర అవతరించనుంది. రాష్ట్రం ‘టొబాకో ఫ్రీ స్టేట్’గా మారనుంది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితంగా రాష్ట్రంలో పొగాకు వినియోగం బాగా తగ్గిందని, పొగాకు నమలడాన్ని కూడా నిషేధిస్తే మరింత మెరుగైన ఫలితముంటుందని భావించే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆరోగ్యశాఖ కార్యదర్శి సుజాతా సౌనిక్ తెలిపారు. ఈ నిషేధం అమల్లోకి వస్తే ఎయిర్‌పోర్ట్, బస్టాండ్, సినిమా థియేటర్ల వద్ద పొగాకు నమిలి ఉమ్మివేసిన వారిపై జరిమానా కూడా విధించనున్నట్లు చెప్పారు.
ఈ నియమాన్ని ఉల్లంఘించిన వారిపై కేసులు కూడా నమోదు చేయనున్నట్లు రాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ మహేష్ జగాడే తెలిపారు. పొగ తాగకపోయినా దానిబారిన పడుతున్న వారిని ఈ నిషేధం ద్వారా నియంత్రించవచ్చని ప్రముఖ వైద్యులు అభిప్రాయడుతున్నారు. మహారాష్ట్ర హెల్త్ కాస్ట్ స్టడీ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. 15 ఏళ్ల వయసు పైబడినవారిలో 31 శాతం మంది పొగాకును రకరకాల రూపాల్లో వినియోగిస్తున్నట్లు తేలింది. ఇందులో 6.6 శాతం మంది పొగ తాగగా, 25 శాతం మంది గుట్కా తదితర రూపాల్లో వాడుతున్నారు. అయితే బహిరంగ ప్రదేశాల్లో పొగాకు నమిలి ఉమ్మివేయడాన్ని నిషేధించడం ఒక్కటే ప్రస్తుత మార్గమని చెబుతున్నారు.
పొగాకు ఉత్పత్తులపై పన్ను ఎక్కువగా విధించడం ద్వారా వీరి సంఖ్యను కొంత మేర తగ్గించ వచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనిద్వారా ప్రభుత్వ ఆదాయం కూడా రెట్టింపు అవుతుందంటున్నారు. ఇప్పటికే చాలా రాష్ట్రాలు పొగాకు ఉత్పత్తులపై పన్ను ఎక్కువగా విధిస్తున్నా రాష్ట్రం ఇప్పటికీ దీనిపై దృష్టి పెట్టడడంలేదని పరేల్‌లోని టాటా మెమోరియల్ ఆస్పత్రి వైద్యుడు ప్రొఫెసర్ పంకజ్ చతుర్వేదీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీహార్, గుజరాత్, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాలలో పొగాకు ఉత్పత్తులపై పన్ను అధిక మొత్తంలో విధించడంతో ఆయా రాష్ట్రాల ఆదాయం 100 శాతం పెరిగిందని సమాచార హక్కు చట్టం ద్వారా తాను గుర్తించానన్నారు. ద్రవ్యోల్బణం ఉన్నప్పటికీ పొగాకు ఉత్పత్తులు చాలా చౌకగా లభిస్తున్నాయని పంకజ్ తెలిపారు.
నోటికి తాళం వేసేద్దాం..!
Published Wed, Jul 2 2014 12:03 AM | Last Updated on Sat, Sep 2 2017 9:39 AM
Advertisement
Advertisement