Mahesh jagade
-
నోటికి తాళం వేసేద్దాం..!
సాక్షి, ముంబై: బహిరంగ ప్రదేశాల్లో పొగతాగడం మాత్రమే నిషేధం అమల్లో ఉన్న మన రాష్ట్రంలో ఇకపై పొగాకు నమిలి ఎక్కడ పడితే అక్కడ ఉమ్మివేయడంపై కూడా నిషేధం విధించనున్నారు. బహిరంగ ప్రదేశాల్లో పొగాకు నమిలి ఉమ్మివేసేవారిపట్ల కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ భావిస్తోంది. నిషేధానికి సంబంధించి మరో పక్షం రోజుల్లో ఆదేశాలు జారీ చేయనున్నట్లు ఆరోగ్యశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఒక వేళ ఇది అమలయితే బహిరంగ ప్రాంతాల్లో పొగాకు ఉత్పత్తులను ఉమ్మివేయకుండా నిషేధించిన మొట్టమొదటి రాష్ట్రంగా మహారాష్ట్ర అవతరించనుంది. రాష్ట్రం ‘టొబాకో ఫ్రీ స్టేట్’గా మారనుంది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితంగా రాష్ట్రంలో పొగాకు వినియోగం బాగా తగ్గిందని, పొగాకు నమలడాన్ని కూడా నిషేధిస్తే మరింత మెరుగైన ఫలితముంటుందని భావించే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆరోగ్యశాఖ కార్యదర్శి సుజాతా సౌనిక్ తెలిపారు. ఈ నిషేధం అమల్లోకి వస్తే ఎయిర్పోర్ట్, బస్టాండ్, సినిమా థియేటర్ల వద్ద పొగాకు నమిలి ఉమ్మివేసిన వారిపై జరిమానా కూడా విధించనున్నట్లు చెప్పారు. ఈ నియమాన్ని ఉల్లంఘించిన వారిపై కేసులు కూడా నమోదు చేయనున్నట్లు రాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ మహేష్ జగాడే తెలిపారు. పొగ తాగకపోయినా దానిబారిన పడుతున్న వారిని ఈ నిషేధం ద్వారా నియంత్రించవచ్చని ప్రముఖ వైద్యులు అభిప్రాయడుతున్నారు. మహారాష్ట్ర హెల్త్ కాస్ట్ స్టడీ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. 15 ఏళ్ల వయసు పైబడినవారిలో 31 శాతం మంది పొగాకును రకరకాల రూపాల్లో వినియోగిస్తున్నట్లు తేలింది. ఇందులో 6.6 శాతం మంది పొగ తాగగా, 25 శాతం మంది గుట్కా తదితర రూపాల్లో వాడుతున్నారు. అయితే బహిరంగ ప్రదేశాల్లో పొగాకు నమిలి ఉమ్మివేయడాన్ని నిషేధించడం ఒక్కటే ప్రస్తుత మార్గమని చెబుతున్నారు. పొగాకు ఉత్పత్తులపై పన్ను ఎక్కువగా విధించడం ద్వారా వీరి సంఖ్యను కొంత మేర తగ్గించ వచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనిద్వారా ప్రభుత్వ ఆదాయం కూడా రెట్టింపు అవుతుందంటున్నారు. ఇప్పటికే చాలా రాష్ట్రాలు పొగాకు ఉత్పత్తులపై పన్ను ఎక్కువగా విధిస్తున్నా రాష్ట్రం ఇప్పటికీ దీనిపై దృష్టి పెట్టడడంలేదని పరేల్‌లోని టాటా మెమోరియల్ ఆస్పత్రి వైద్యుడు ప్రొఫెసర్ పంకజ్ చతుర్వేదీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీహార్, గుజరాత్, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాలలో పొగాకు ఉత్పత్తులపై పన్ను అధిక మొత్తంలో విధించడంతో ఆయా రాష్ట్రాల ఆదాయం 100 శాతం పెరిగిందని సమాచార హక్కు చట్టం ద్వారా తాను గుర్తించానన్నారు. ద్రవ్యోల్బణం ఉన్నప్పటికీ పొగాకు ఉత్పత్తులు చాలా చౌకగా లభిస్తున్నాయని పంకజ్ తెలిపారు. -
ఇకపై స్పష్టంగా ‘ప్రిస్క్రిప్షన్’!
సాక్షి, ముంబై: డాక్టర్లు రాసిన ప్రిస్క్రిప్షన్లు అర్థం కాక రోగులకు ఒక్కోసారి మందుల దుకాణదారులు వేరే మందులు ఇస్తుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఇబ్బందులను అధిగమించేందుకు ఫుండ్ అండ్ డ్రగిస్టు (ఎఫ్డీ) పరిపాలనా విభాగం చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు మోడల్ మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ పెర్ఫెక్ట్ పాలసీని ఎఫ్డీ కమిషనర్ మహేష్ జగడే జారీ చేశారు. దీనిమేరకు ఇకపై రోగులకు డాక్టర్లు తాము రాసిచ్చే మందుల పేర్లను స్పష్టంగా రాయాలి. మందులు సాధారణ తెల్లకాగితంపై కాకుండా వారి లెటర్ హెడ్‌పైనే రాసివ్వాల్సి ఉంటుంది. దానిపై రిజిస్ట్రేషన్ సంఖ్య, డాక్టర్ పూర్తిపేరు, చిరునామా కచ్చితంగా ఉండాలి. మందుల పేర్లు, వాటిని వాడే విధానం (డోస్) ఆంగ్లంలో పెద్ద అక్షరాల్లో స్పష్టం గా రాయాలి. కొన్ని సందర్భాల్లో డాక్టర్ రాసిన రాత అర్థంకాక ఇంట్లో మిగిలిపోయిన మందులే మళ్లీ కొనాల్సి వస్తుంది. ఇంటికి వచ్చాక పరిశీలిస్తే అంత కు ముందు వాడిన మందులే ఉంటాయి. అదే అక్షరాలు స్పష్టంగా రాస్తే ఫలానా మందు, మాత్రలు తమ వద్ద ఉన్నాయని తెలుసుకుని కొనుగోలు చేయడం మానేస్తారు. దీంతో రోగుల డబ్బు వృథా కాకుండా అరికట్టవచ్చని జగడే అభిప్రాయపడ్డారు. ఇక నుంచి ప్రిస్క్రిప్షన్పై స్పష్టంగా రాయని డాక్టర్లపై చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. మందుల చీటిపై డాక్టర్ లేదా క్లినిక్, నర్సింగ్ హోం రిజిస్ట్రేషన్ నంబరు, పూర్తి పేరు, చిరునామ ముద్రించడంవల్ల నకిలీ డాక్టర్లకు కళ్లెం వేయడానికి మార్గం సుగమమైంతుందని జగడే పేర్కొన్నారు. తెల్ల కాగి తంపై మందులు రాసివ్వడంవల్ల ఇది అసలు డాక్టర్ రాసిచ్చారా..? లేక నకిలీ డాక్టర్ రాసిచ్చాడా...? అనేది తేల్చుకోవడం కష్టం కానుంది. దీంతో ఈ మోడల్ మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ ఫర్ఫెక్ట్ పాలసీని జారీచేసినట్లు ఆయన స్పష్టం చేశారు. -
ఔషధ దుకాణాల్లో అర్హత లేని సిబ్బంది
సాక్షి, ముంబై: ఔషధ దుకాణ యజమానులు మందులు విక్రయించడానికి అర్హత కలిగిన సిబ్బందిని నియమించడం లేదు. తక్కువ జీతం ఇచ్చి అంతగా అర్హత లేని వారిని నియమిస్తున్నారనే విషయం స్టేట్ రెగ్యులేటరీ అథారిటీ చేసిన తనిఖీల్లో వెల్లడైంది. ఇప్పటివరకు 30 శాతం ఔషధ దుకాణ యజమానులు మందులు విక్రయించేందుకు డీ ఫార్మసీ, బీ ఫార్మసీ చేసిన వారిని నియమించకుండా ఇతరులకు ప్రాధాన్యత ఇస్తున్నారనే విషయం స్పష్టమైంది. కాగా, నగరంలో 5,083 మందుల దుకాణాలను తనిఖీ చేస్తే 1,566 దుకాణాలలో ఫార్మసిస్టులు (ఔషధ విక్రేతలు)కాకుండా ఇతర సిబ్బంది మందులు విక్రయిస్తున్నారని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) నివేదిక ఆధారంగా తేలింది. నగరంలోని మెడికల్ షాప్‌లలో 30 శాతం వరకు ఔషధ విక్రేతలు ఫార్మసీ చదువుకున్న వారు కాదని తేలింది. ఈ విషయమై రాష్ట్ర ఎఫ్‌డీఏ కమిషనర్ మహేష్ జగాడే మాట్లాడుతూ దేశంలో పది శాతం మంది రోగులు విక్రేతలు ఇచ్చిన తప్పుడు మందుల వల్ల తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని తెలిపారు. చాలా మంది నిర్వాహకులు ఎంతమేర మందులను విక్రయించారనే రికార్డులను నిర్వహించడం లేదన్నారు. నిబంధనలు పాటించని రాష్ట్ర వ్యాప్తంగా 7,675 దుకాణదారులపై కేసు నమోదు చేశామన్నారు. వీరిలో కేవలం నలుగురిని మాత్రమే విచారించారని తెలిపారు. 6,500 మంది రాష్ట్ర మంత్రి సతేజ్ పాటిల్ నుంచి స్టే ఆర్డర్ పొందడానికి చూస్తున్నారన్నారు. వీరిలో 650 మంది ముంబైకి చెందిన వారేనన్నారు. ఈ దుకాణదారులు కిరాణా షాపుల మాదిరిగా పనిచేస్తున్నారని జగాడే అభిప్రాయపడ్డారు. ప్రతి 2,000 మందికి ఒక మందుల దుకాణం ఉందన్నారు. మందుల దుకాణాల విషయంలో కఠిన నిబంధనలు పాటిస్తున్న ఇతర దేశాలలో ప్రతి 16,000 మందికి ఒక మెడిషన్ షాప్ ఉందని తెలిపారు. తమ తనిఖీలు ఇంకా కొనసాగుతాయని చెప్పారు. 11వ తేదీన బంద్ ఎఫ్‌డీఏ అధికారుల తనిఖీలను నిరసిస్తూ నగరంలో దాదాపు 6.500 ఔషధ దుకాణాల రిటైలర్స్, హోల్‌సేలర్లు తమ దుకాణాలను ఈ నెల 11వ తేదీ ఉదయం ఏడు నుంచి రాత్రి 11 గంటల వరకు మూసివేయనున్నారు.