సాక్షి, ముంబై: ఔషధ దుకాణ యజమానులు మందులు విక్రయించడానికి అర్హత కలిగిన సిబ్బందిని నియమించడం లేదు. తక్కువ జీతం ఇచ్చి అంతగా అర్హత లేని వారిని నియమిస్తున్నారనే విషయం స్టేట్ రెగ్యులేటరీ అథారిటీ చేసిన తనిఖీల్లో వెల్లడైంది. ఇప్పటివరకు 30 శాతం ఔషధ దుకాణ యజమానులు మందులు విక్రయించేందుకు డీ ఫార్మసీ, బీ ఫార్మసీ చేసిన వారిని నియమించకుండా ఇతరులకు ప్రాధాన్యత ఇస్తున్నారనే విషయం స్పష్టమైంది. కాగా, నగరంలో 5,083 మందుల దుకాణాలను తనిఖీ చేస్తే 1,566 దుకాణాలలో ఫార్మసిస్టులు (ఔషధ విక్రేతలు)కాకుండా ఇతర సిబ్బంది మందులు విక్రయిస్తున్నారని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) నివేదిక ఆధారంగా తేలింది. నగరంలోని మెడికల్ షాప్‌లలో 30 శాతం వరకు ఔషధ విక్రేతలు ఫార్మసీ చదువుకున్న వారు కాదని తేలింది.
ఈ విషయమై రాష్ట్ర ఎఫ్‌డీఏ కమిషనర్ మహేష్ జగాడే మాట్లాడుతూ దేశంలో పది శాతం మంది రోగులు విక్రేతలు ఇచ్చిన తప్పుడు మందుల వల్ల తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని తెలిపారు. చాలా మంది నిర్వాహకులు ఎంతమేర మందులను విక్రయించారనే రికార్డులను నిర్వహించడం లేదన్నారు. నిబంధనలు పాటించని రాష్ట్ర వ్యాప్తంగా 7,675 దుకాణదారులపై కేసు నమోదు చేశామన్నారు. వీరిలో కేవలం నలుగురిని మాత్రమే విచారించారని తెలిపారు. 6,500 మంది రాష్ట్ర మంత్రి సతేజ్ పాటిల్ నుంచి స్టే ఆర్డర్ పొందడానికి చూస్తున్నారన్నారు. వీరిలో 650 మంది ముంబైకి చెందిన వారేనన్నారు. ఈ దుకాణదారులు కిరాణా షాపుల మాదిరిగా పనిచేస్తున్నారని జగాడే అభిప్రాయపడ్డారు. ప్రతి 2,000 మందికి ఒక మందుల దుకాణం ఉందన్నారు. మందుల దుకాణాల విషయంలో కఠిన నిబంధనలు పాటిస్తున్న ఇతర దేశాలలో ప్రతి 16,000 మందికి ఒక మెడిషన్ షాప్ ఉందని తెలిపారు. తమ తనిఖీలు ఇంకా కొనసాగుతాయని చెప్పారు.
11వ తేదీన బంద్
ఎఫ్‌డీఏ అధికారుల తనిఖీలను నిరసిస్తూ నగరంలో దాదాపు 6.500 ఔషధ దుకాణాల రిటైలర్స్, హోల్‌సేలర్లు తమ దుకాణాలను ఈ నెల 11వ తేదీ ఉదయం ఏడు నుంచి రాత్రి 11 గంటల వరకు మూసివేయనున్నారు.