State Regulatory Authority
-
అన్నిటికీ సవరణలు.. ఓటింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లులోని అన్ని క్లాజులకూ సవరణలు ప్రతిపాదించాలని, వాటిపై ఓటింగ్ కోరాలని కాంగ్రెస్ సీమాంధ్ర ఎమ్మెల్యేలు నిర్ణయించారు. అంతా చర్చలో పాల్గొని బిల్లును వ్యతిరేకి స్తూ గట్టిగా తవు అభిప్రాయం చెప్పాలని నిర్ణయించుకున్నారు. బిల్లుపై శాసనసభ, మండలిలో అనుసరించాల్సిన వ్యూహంపై గురువారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్ర ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయుణ, మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, ఎన్.రఘువీరారెడ్డి, పితాని సత్యనారాయుణ, శైలజానాధ్, వట్టి వసంతకుమార్, మహీధర్‌రెడ్డి, గంటా శ్రీనివాసరావు, ఎరాసు ప్రతాప్‌రెడ్డి, టీజీ వెంకటేశ్, మాజీ మంత్రులు గాదె వెంకటరెడ్డి, పాలడుగు వెంకటరావు, ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. గురువారం సభలో చోటుచేసుకున్న పరిణామాలపై సమీక్ష చేశారు. బిల్లుపై సవరణల ప్రతిపాదనకు స్పీకర్ శుక్రవారం వరకు గడువు విధించినందున దానిపైనా సమాలోచన చేశారు. సీఎం మాట్లాడుతూ న్యాయనిపుణులతో చర్చించి సవరణల ప్రతిపాదనలు రూపొందిస్తామని తెలిపారు. పార్టీల వారీగా స్పీకర్ సమయం కేటాయించనున్నందున ఆ మేరకు ఎంతవుందికి అవకాశం వస్తుందో అంతమందినే ఎంపిక చేస్తే సరిపోతుందని కొందరు మంత్రులు సూచించారు. అయితే రాష్ట్ర విభజనకు సంబంధించిన కీలక బిల్లు అయినందున ప్రతి ఒక్క సభ్యుడు తన అభిప్రాయం చెప్పాల్సిన అవసరముందని గాదె, పాలడుగు తదితరులు అభిప్రాయపడ్డారు. అయితే సీమాంధ్ర కాంగ్రెస్ తరఫున సమగ్ర అభిప్రాయాలు వినిపించేందుకు కొందరి పేర్లను ప్రత్యేకంగా ఎంపికచేశారు. సభలో అభిప్రాయం చెప్పి వ్యతిరేకత వ్యక్తపరిస్తే చాలని, రాష్ట్ర విభజన బిల్లుకు అడ్డుకట్ట పడుతుందని సీఎం అభిప్రాయపడ్డారని సమాచారం. తన అభిప్రాయం ఏమిటో చర్చలో పాల్గొన్నప్పుడు స్పష్టంగా చెబుతాన న్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రమే బిల్లుపై వ్యతిరేకత వ్యక్తం చేస్తే మెజారిటీ రాదని, ఆ ప్రాంతంలోని టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్‌ల సహకారం కూడా అవసరమని గంటా శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. దాదాపు గంటన్నర పాటు సాగిన సమావేశానంతరం సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సవరణల ప్రతిపాదనలపై అడ్వొకేట్ జనరల్‌తో, మరికొందరు న్యాయనిపుణులతో భేటీ అయ్యారు. -
చర్చించాలి.. ఓడించాలి: అశోక్‌బాబు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లులోని ప్రతి క్లాజుపై అసెంబ్లీలో చర్చ జరగాలని, విభజనకు వ్యతిరేకంగా ఉన్న ప్రజాప్రతినిధులు తమ అభిప్రాయాల్ని నిష్కర్షగా తెలియజేయాలని కోరుతున్నట్లు ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు చెప్పారు. ఆయన గురువారం ఏపీఎన్జీవో భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చ ప్రారంభమవడం శుభపరిణామమన్నారు. అసెంబ్లీ నిబంధనల మేరకు బిల్లుకు వ్యతిరేకంగా అభిప్రాయం చెప్పాలని లేదా తీర్మానాన్ని ఓడించడం చేయాలని ప్రజాప్రతినిధులను కోరుతున్నామన్నారు. మూడోవిడత అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ వైఖరినిబట్టి తమ ఉద్యమ కార్యాచరణ ఉంటుందని చెప్పారు. ఒకవేళ బిల్లు పార్లమెంట్‌కు వెళ్లినట్లైతే ఎలాంటి పంథా అనుసరించాలనేదానిపై శుక్రవారం జరగనున్న ఉద్యోగ సంఘాల జేఏసీ భేటీలో నిర్ణయిస్తామన్నారు. ఉద్యోగుల హెల్త్‌కార్డుల సమస్య, కాంట్రాక్టు కార్మికుల క్రమబద్ధీకరణ అంశాలపై చర్చించేందుకు శనివారం సీఎంను కలవనున్నట్లు చెప్పారు. రాష్ట్ర విభజనకు సంబంధించి పార్టీల అభిప్రాయాలతో సంబంధం లేకుండా ప్రజల ఆకాంక్షల మేరకు ప్రజాప్రతినిధులు నడవాలని సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి కోరారు. విభజన బిల్లును వ్యతిరేకించని ఎమ్మెల్యేల ఇళ్లముందు ఉద్యోగసంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేయనున్నట్లు తెలిపారు. మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో సీమాంధ్రుల భద్రతకు సంబంధించి బిల్లులో ఎటువంటి హామీలు లేవన్న సత్యాన్ని ఆ ప్రాంతవాసులు గుర్తించాలన్నారు. హరీశ్‌రావు దిష్టిబొమ్మ దగ్ధం.. పోలీసు అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావును తక్షణమే అరెస్టు చేయాలని సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ కన్వీనర్ ఆడారి కిశోర్‌కుమార్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ గురువారం ఏపీఎన్జీవోల కార్యాలయం ఎదుట హరీశ్‌రావు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. 24గంటల్లోగా హరీశ్‌రావును అరెస్టు చేయాలని, లేనిపక్షంలో టీఆర్ఎస్ భవన్ ఎదుట ఆందోళనకు దిగుతామని కిశోర్‌కుమార్ హెచ్చరించారు. కార్యక్రమంలో సమైక్యాంధ్ర దళిత జేఏసీ అధ్యక్షుడు ఎ.రాజేష్, విద్యార్థి జేఏసీ ప్రధాన కార్యదర్శి రాయపాటి జగదీష్, కోకన్వీనర్ ఆదిత్యసాయి, జాషువాలతోపాటు పెద్ద ఎత్తున విద్యార్థి జేఏసీ నాయకులు పాల్గొన్నారు. -
ఔషధ దుకాణాల్లో అర్హత లేని సిబ్బంది
సాక్షి, ముంబై: ఔషధ దుకాణ యజమానులు మందులు విక్రయించడానికి అర్హత కలిగిన సిబ్బందిని నియమించడం లేదు. తక్కువ జీతం ఇచ్చి అంతగా అర్హత లేని వారిని నియమిస్తున్నారనే విషయం స్టేట్ రెగ్యులేటరీ అథారిటీ చేసిన తనిఖీల్లో వెల్లడైంది. ఇప్పటివరకు 30 శాతం ఔషధ దుకాణ యజమానులు మందులు విక్రయించేందుకు డీ ఫార్మసీ, బీ ఫార్మసీ చేసిన వారిని నియమించకుండా ఇతరులకు ప్రాధాన్యత ఇస్తున్నారనే విషయం స్పష్టమైంది. కాగా, నగరంలో 5,083 మందుల దుకాణాలను తనిఖీ చేస్తే 1,566 దుకాణాలలో ఫార్మసిస్టులు (ఔషధ విక్రేతలు)కాకుండా ఇతర సిబ్బంది మందులు విక్రయిస్తున్నారని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) నివేదిక ఆధారంగా తేలింది. నగరంలోని మెడికల్ షాప్‌లలో 30 శాతం వరకు ఔషధ విక్రేతలు ఫార్మసీ చదువుకున్న వారు కాదని తేలింది. ఈ విషయమై రాష్ట్ర ఎఫ్‌డీఏ కమిషనర్ మహేష్ జగాడే మాట్లాడుతూ దేశంలో పది శాతం మంది రోగులు విక్రేతలు ఇచ్చిన తప్పుడు మందుల వల్ల తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని తెలిపారు. చాలా మంది నిర్వాహకులు ఎంతమేర మందులను విక్రయించారనే రికార్డులను నిర్వహించడం లేదన్నారు. నిబంధనలు పాటించని రాష్ట్ర వ్యాప్తంగా 7,675 దుకాణదారులపై కేసు నమోదు చేశామన్నారు. వీరిలో కేవలం నలుగురిని మాత్రమే విచారించారని తెలిపారు. 6,500 మంది రాష్ట్ర మంత్రి సతేజ్ పాటిల్ నుంచి స్టే ఆర్డర్ పొందడానికి చూస్తున్నారన్నారు. వీరిలో 650 మంది ముంబైకి చెందిన వారేనన్నారు. ఈ దుకాణదారులు కిరాణా షాపుల మాదిరిగా పనిచేస్తున్నారని జగాడే అభిప్రాయపడ్డారు. ప్రతి 2,000 మందికి ఒక మందుల దుకాణం ఉందన్నారు. మందుల దుకాణాల విషయంలో కఠిన నిబంధనలు పాటిస్తున్న ఇతర దేశాలలో ప్రతి 16,000 మందికి ఒక మెడిషన్ షాప్ ఉందని తెలిపారు. తమ తనిఖీలు ఇంకా కొనసాగుతాయని చెప్పారు. 11వ తేదీన బంద్ ఎఫ్‌డీఏ అధికారుల తనిఖీలను నిరసిస్తూ నగరంలో దాదాపు 6.500 ఔషధ దుకాణాల రిటైలర్స్, హోల్‌సేలర్లు తమ దుకాణాలను ఈ నెల 11వ తేదీ ఉదయం ఏడు నుంచి రాత్రి 11 గంటల వరకు మూసివేయనున్నారు.