చర్చించాలి.. ఓడించాలి: అశోక్‌బాబు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లులోని ప్రతి క్లాజుపై అసెంబ్లీలో చర్చ జరగాలని, విభజనకు వ్యతిరేకంగా ఉన్న ప్రజాప్రతినిధులు తమ అభిప్రాయాల్ని నిష్కర్షగా తెలియజేయాలని కోరుతున్నట్లు ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు చెప్పారు. ఆయన గురువారం ఏపీఎన్జీవో భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చ ప్రారంభమవడం శుభపరిణామమన్నారు. అసెంబ్లీ నిబంధనల మేరకు బిల్లుకు వ్యతిరేకంగా అభిప్రాయం చెప్పాలని లేదా తీర్మానాన్ని ఓడించడం చేయాలని ప్రజాప్రతినిధులను కోరుతున్నామన్నారు. మూడోవిడత అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ వైఖరినిబట్టి తమ ఉద్యమ కార్యాచరణ ఉంటుందని చెప్పారు.
ఒకవేళ బిల్లు పార్లమెంట్‌కు వెళ్లినట్లైతే ఎలాంటి పంథా అనుసరించాలనేదానిపై శుక్రవారం జరగనున్న ఉద్యోగ సంఘాల జేఏసీ భేటీలో నిర్ణయిస్తామన్నారు. ఉద్యోగుల హెల్త్‌కార్డుల సమస్య, కాంట్రాక్టు కార్మికుల క్రమబద్ధీకరణ అంశాలపై చర్చించేందుకు శనివారం సీఎంను కలవనున్నట్లు చెప్పారు. రాష్ట్ర విభజనకు సంబంధించి పార్టీల అభిప్రాయాలతో సంబంధం లేకుండా ప్రజల ఆకాంక్షల మేరకు ప్రజాప్రతినిధులు నడవాలని సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి కోరారు. విభజన బిల్లును వ్యతిరేకించని ఎమ్మెల్యేల ఇళ్లముందు ఉద్యోగసంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేయనున్నట్లు తెలిపారు. మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో సీమాంధ్రుల భద్రతకు సంబంధించి బిల్లులో ఎటువంటి హామీలు లేవన్న సత్యాన్ని ఆ ప్రాంతవాసులు గుర్తించాలన్నారు.
హరీశ్‌రావు దిష్టిబొమ్మ దగ్ధం..
పోలీసు అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావును తక్షణమే అరెస్టు చేయాలని సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ కన్వీనర్ ఆడారి కిశోర్‌కుమార్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ గురువారం ఏపీఎన్జీవోల కార్యాలయం ఎదుట హరీశ్‌రావు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. 24గంటల్లోగా హరీశ్‌రావును అరెస్టు చేయాలని, లేనిపక్షంలో టీఆర్‌ఎస్ భవన్ ఎదుట ఆందోళనకు దిగుతామని కిశోర్‌కుమార్ హెచ్చరించారు. కార్యక్రమంలో సమైక్యాంధ్ర దళిత జేఏసీ అధ్యక్షుడు ఎ.రాజేష్, విద్యార్థి జేఏసీ ప్రధాన కార్యదర్శి రాయపాటి జగదీష్, కోకన్వీనర్ ఆదిత్యసాయి, జాషువాలతోపాటు పెద్ద ఎత్తున విద్యార్థి జేఏసీ నాయకులు పాల్గొన్నారు.