సాక్షి, ముంబై: ఫార్మాసిస్టులు లేని మెడికల్ షాపుల లెసైన్స్ రద్దు చేసే పనిలో ఫుడ్, డ్రగ్స్ (ఎఫ్‌డీ) పరిపాలన విభాగం నిమగ్నమైంది. దీన్ని నిరసిస్తూ మెడికల్ షాపు యజమానులు ఈ నెల 16 నుంచి మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా షాపులన్నీ మూసి ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్ర స్టేట్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్నాథ్ షిండే నేతృత్వంలో కార్యవర్గ సభ్యులతో మంగళవారం సమావేశం జరిగింది. ఎఫ్‌డీ అధికారుల చర్యలను ఉపేక్షించరాదని, వారి దూకుడుకు నిరసనగా బంద్ పాటించాలని ఈ భేటీలో నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా వేలాది మెడికల్ దుకాణాలున్నాయి. నియమాల ప్రకారం అందులో ఒక ఫార్మాసిస్టు పనిచేయాలి. కానీ 80 శాతం మెడికల్ షాపు యజమానులు తక్కువ వేతనానికి లభించే యువకులను పనిలో పెట్టుకుంటున్నారు. కొంత ఆంగ్ల భాష జ్ఞానం ఉంటే చాలు డాక్టర్ రాసిచ్చిన ప్రిస్కిప్షన్ చూసి మందులిచ్చే బాధ్యతలు వారికి అప్పగిస్తున్నారు. ఒకవేళ తప్పుడు మందులు, ఇంజెక్షన్లు, మాత్రల వల్ల రోగి చనిపోతే అందుకు బాధ్యులెవరు...? అనే ప్రశ్న తెరమీదకు వచ్చింది. దీంతో ఎఫ్‌డీ అధికారులు దాడులు చేస్తున్నారు. కానీ ఫార్మాసిస్టును నియమించుకోవడం తమకు గిట్టుబాటు కాదని మందుల షాపు యజమానులు వాదిస్తున్నారు. మరోవైపు ఫార్మాసిస్టులు లేని మెడికల్ షాపుల లెసైన్స్‌లు ఎఫ్‌డీ అధికారులు రద్దు చేస్తున్నారు. దీంతో తమ వ్యాపారం దెబ్బతింటోందని మందులు విక్రయించే వ్యాపారులు ఆందోళనలో పడిపోయారు. ఎఫ్‌డీ వైఖరిని వ్యతిరేకిస్తూ మూడు రోజులపాటు బంద్ పాటించాలని నిర్ణయం తీసుకున్నారు.
16 నుంచి మెడికల్ షాప్‌ల బంద్
Published Thu, Dec 5 2013 6:08 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement
Advertisement