ఆదుకోని ‘హాస్పిటల్ ఆన్ వీల్స్’
- సీఎస్‌టీలో ప్రదర్శనకు ఉంచి లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రమాదస్థలికి తరలించకపోవడంపై ఆగ్రహం
- అది రైల్వేది కాదని, ఓ ఎన్జీవోదన్న సీఆర్ అధికారి
సాక్షి, ముంబై: ఇటీవల ప్రమాదానికి గురైన దివా-సావంత్‌వాడీ ప్యాసింజర్ రైలులోని క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించేందుకు అధికారులు నానా ఇబ్బందులు పడ్డారు. అదే సమయంలో ‘హాస్పిటల్ ఆన్ వీల్స్’ అనే లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రదర్శన కోసం సీఎస్టీలో ఉంచడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ప్రపంచంలోనే తొలిసారిగా ఏర్పాటుచేసిన హాస్పిటల్ ఆన్ వీల్స్ ట్రైన్‌ను ఏప్రిల్‌లో నగరానికి తీసుకువచ్చారు.
ఈ రైలును సందర్శించేందుకు తొమ్మిదో తేదీ నుంచి 12వ తేదీ వరకు ప్రదర్శకులకు అనుమతివ్వనున్నారు. హాస్పిటల్ ఆన్ వీల్స్‌లో పూర్తి స్థాయిలో ఆపరేషన్ థియేటర్, ఇతర పరికరాలను అందుబాటులో ఉంచారు.దీనిని సీఎస్టీలోని పదో నంబర్ ప్లాట్‌ఫాంపై ఉంచారు. దీనిని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ కూడా సందర్శించారు. అయితే ఇటీవల జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనాస్థలికి అన్ని వైద్య వసతులు కలిగిన హాస్పిటల్ ఆన్ వీల్స్ రైలును తరలించేందుకు వీలున్నా, నిరుపయోగంగా సీఎస్టీలో ఉంచడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.
సహాయక బృందాలు, స్థానిక గ్రామస్తులకు క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించేందుకు ఎన్నో గంటల పాటు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ కెస్.కె.సూద్ మాట్లాడుతూ.. ఈ లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్ ఎన్జీవోదని, ఇది రైల్వే ప్రమాదాల కోసం ఏర్పాటు చేసింది కాదని తెలిపారు. గ్రామీణ పేదలకు మాత్రమే శస్త్ర చికిత్సలు, ఆపరేషన్లు, ఇతర వైద్య సేవలను అందించేందుకు రూపొందించిందన్నారు. ఈ ఎక్స్‌ప్రెస్‌లో వైద్యులను నియమించలేదని తెలిపారు.
ఈ రైలు సీఈఓ రజినీష్ గౌర్హ్ మాట్లాడుతూ.. ఈ రైలు ఒక షెడ్యూల్‌ను కలిగి ఉందని, తర్వాత జార్ఖండ్‌కు బయలుదేరుతోందన్నారు. అయితే ఏదేని భారీ ప్రమాదం సంభవించినప్పుడు ప్రభుత్వం, రైల్వే సహాయం కోసం తమను సంప్రందించొచ్చన్నారు. అప్పుడు అత్యవసర వైద్య సేవలను పరిగణనలోకి తీసుకొని ఈ రైలులో వైద్య బృందాన్ని నియమిస్తామన్నారు.
ఇదిలావుండగా అత్యవసర సమయాలలో యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్స్, అంబులెన్సులు ఉన్నాయి. అయితే రిలీఫ్ ట్రైన్ ప్రమాదం సంభవించినప్పుడు కళ్యాణ్‌లో ఉంది. ప్రమాదం జరిగిన రెండు గంటల తర్వాత ఘటనాస్థలికి చేరుకుంది. కాగా, నిబంధన ప్రకారం ప్రతి 250 కి.మీ. దూరంలో యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్, మెడికల్ వ్యాన్‌ను అందుబాటులో ఉంచాలి. ఈ రిలీఫ్ ట్రైన్ క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందజేస్తుంది. తర్వాత ఆస్పత్రికి తరలిస్తుంది. 15 నిమిషాల వ్యవధిలో అన్ని ఏర్పాట్లుచేసుకొని ఈ రిలీఫ్ ట్రైన్ ఘటనాస్థలికి చేరుకోవాలని సూద్ పేర్కొన్నారు. మామూలుగా వైద్యులు ప్రమాదస్థలికి చేరుకొని వైద్యం అందించారని, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారన్నారు.