‘పవర్‌ఫుల్‌’ ఆపరేషన్‌.. | Continuous electricity for government hospitals | Sakshi
Sakshi News home page

‘పవర్‌ఫుల్‌’ ఆపరేషన్‌..

Published Thu, Dec 7 2017 3:29 AM | Last Updated on Tue, Mar 19 2019 9:23 PM

Continuous electricity for government hospitals - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అత్యవసర వైద్య సేవలకు విద్యుత్‌ సరఫరానే కీలకం. అత్యవసర చికిత్సలు, మందులు, ఔషధ పరికరాల నిల్వ మొదలైనవి పూర్తిగా విద్యుత్‌ సరఫరాపైనే ఆధారపడి ఉంటాయి. అకస్మాత్తుగా కరెంట్‌ పోతే అత్యవసర వైద్య సేవలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. అకస్మాత్తుగా విద్యుత్‌ కట్‌ అవ్వడంతో ఆక్సిజన్‌ సరఫరా ఆగిపోయిన సందర్భాలూ ఉంటున్నాయి. ఒక్కోసారి రోగి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతోంది. విద్యుత్‌ సరఫరాకు ప్రత్యామ్నాయంగా జనరేటర్లు ఉంటే.. అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో నిరంతరం మెరుగైన వైద్య సేవలు అందించే అవకాశం ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక వసతుల కల్పన సంస్థ(టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) ప్రస్తుతం ఈ దిశగా చర్యలు చేపట్టింది. అన్ని ప్రధాన ఆస్పత్రుల్లో భారీ సామర్థ్యం కలిగిన జనరేటర్లను ఏర్పాటు చేసింది. రూ.4.74 కోట్ల వ్యయంతో 34 జనరేటర్లను వివిధ ఆస్పత్రుల్లో ఇప్పటికే అమర్చే చర్యలు తీసుకుంది.

బోధనాసుపత్రులకే తొలి ప్రాధాన్యం..
ప్రధానంగా శస్త్రచికిత్సలు ఎక్కువగా జరిగే బోధనాసుపత్రులకు జనరేటర్ల ఏర్పాటులో ప్రాధాన్యత ఇచ్చారు. ప్రభుత్వ బోధనాసు పత్రులకు ఎక్కువ మంది రోగులు వస్తుం టారు. ప్రతి రోజు శస్త్రచికిత్సలు జరుగుతూ ఉంటాయి. అలాగే కీలకమైన మందులు, ఔషధాలను నిల్వ చేయాల్సి ఉంటుంది. రోగులు ఉండే వార్డుల్లో లైట్లు, ఫ్యాన్లు నిత్యం అవసరం ఉంటాయి. ఈ నేపథ్యంలో వైద్య సేవలకు అంతరాయం కలగకుండా ఉండేం దుకు గాంధీ, ఉస్మానియా, సుల్తాన్‌ బజార్‌ మెటర్నిటీ ఆస్పత్రులు.. గాంధీ, ఉస్మానియా కాలేజీల్లో కొత్త జనరేటర్లను అమర్చారు. రూ.2.59 కోట్లు ఖర్చు చేసి వైద్య విధాన పరిషత్‌(వీవీపీ) పరిధిలోని 26 ఆస్పత్రుల్లో ఒక్కొక్కటి చొప్పున కొత్త జనరేట్లను ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లా ఆస్పత్రితోపాటు 18 ఏరియా ఆస్పత్రులు, 7 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు(సీహెచ్‌సీ) వీటిలో ఉన్నాయి. అలాగే రోగులకు, రోగుల సహాయకులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు గాంధీ ఆస్పత్రిలో రూ.3.69 కోట్లతో కొత్తగా 11 లిఫ్ట్‌లను అమర్చారు. హైదరాబాద్‌లోని సరోజినిదేవీ కంటి ఆస్పత్రిలో, సుల్తాన్‌ బజార్‌ మెటర్నిటీ ఆస్పప్రతిలో ఒక్కొక్కటి చొప్పున కొత్త లిఫ్ట్‌లను ఏర్పాటు చేశారు.

జనరేటర్లు ఏర్పాటు చేసిన ఆస్పత్రులు..
ఏరియా ఆస్పత్రులు: గోల్కొండ, మలక్‌ పేట, వనస్థలిపురం, కొండాపూర్, జహీరా బాద్, గద్వాల, నాగర్‌కర్నూలు, మిర్యాల గూడ, భువనగిరి, నాగార్జునసాగర్, మంచిర్యాల, బాన్సువాడ, బోధన్, కామా రెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, కొత్తగూడెం, భద్రాచలం.
సీహెచ్‌సీలు: నారాయణఖేడ్, నర్సాపూర్, దేవరకొండ, రామన్నపేట, చౌటుప్పల్, పెనుబల్లి, సత్తుపల్లి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement