కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మండ్య పర్యటనలో తమకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని కాంగ్రెస్‌లోని ఓ వర్గంలో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతోంది.
సాక్షి, బెంగళూరు : కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మండ్య పర్యటనలో తమకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని కాంగ్రెస్‌లోని ఓ వర్గంలో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతోంది. రాష్ట్రంలో ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికలు, లోక్‌సభ, శాసనమండలి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు రాష్ర్ట ప్రజలకు కృతజ్ఞతలు తెలపడానికి కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నేడు (సోమవారం) మండ్యలో ‘కృతజ్ఞత సభ’ పేరిట బృహత్ సమావేశం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి సోనియాగాంధీ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు.
సోనియాగాంధీ పర్యటన సద్వినియోగం చేసుకుని సొంత పార్టీలోని రాజకీయ ప్రత్యర్థుల గురించి అన్ని విషయాలు చెప్పి కొంతమేర ప్రయోజనం పొందాలనుకున్న ఆ నాయకుల ఆశ నెరవేరేలా కల్పించడం లేదు. ఇందుకు మేడం వేదికపై ప్రసంగించడానికి మాత్రమే సమయం కేటాయించడం కారణమని ఆ పార్టీ నాయకులే పేర్కొంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఐదు నెలలు కావొస్తోంది. అయితే పూర్తి స్థాయి మంత్రి మండలి ఇంకా ఏర్పాటు కాలేదు. ఇందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వైఖరే కారణమన్న అపవాదు ఉంది.
మరోవైపు ప్రస్తుత మంత్రుల్లో కొంత మందిపై అవినీతి అరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా సమాచార శాఖ మంత్రి సంతోష్ లాడ్‌పై అక్రమగనుల తవ్వకాలకు పాల్పడ్డారని, ఆయన్ను మంత్రి మండలి నుంచి తప్పించాలనే ఒత్తిడి పార్టీపై ఎక్కువవుతోంది. ఈ విషయాలను పరిగణన లోకి తీసుకుని మంత్రి మండలిలో సీనియర్ నాయకులకు అవకాశం కల్పించాలని మేడంకు విన్నవించడానికి కొందరు కేపీసీసీ సీనియర్ నాయకులు సిద్ధమయ్యారు.
ఈ మేరకు ఫిర్యాదులు, కోరికలతో కూడిన సీల్డ్ కవ ర్లనూ వారు సిద్ధం చేసుకున్నారు. కవర్లను మేడంకు అందించి కొంత సేపు ప్రత్యేకంగా మాట్లాడాలనేది వారి వ్యూహం. మరోవైపు మండళ్ల అధ్యక్షుల ఎంపిక వంటి నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా ఐదు నెలల నుంచి పెండింగ్‌లో ఉండిపోయింది. ఈ పోస్టులపై కన్నేసిన గత ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ నాయకులు కూడా మేడంకు తమ మనసులో మాట చెప్పాలని ఉవ్విళ్లూరుతున్నారు.
అయితే లోక్‌సభ ఎన్నికలు మరికొన్ని నెలల్లోనే రానున్న నేపథ్యంలో మంత్రి మండలి విస్తరణ, మంత్రి మండలి నుంచి సభ్యులను తొలగించడం, నామినేటెడ్ పోస్టుల భర్తీ చేయడం విషయమై నాయకులతో మాట్లాడితే లేనిపోని రాద్దాతం అవుతుందని... అంతేకాకుండా కొన్ని వర్గాల ఓట్లను కోల్పోవస్తుందని సోనియాగాంధీకి అత్యంత ఆప్తులైన కేంద్రమంత్రులు తెలిపినట్లు సమచారం. దీంతో ఇక్కడి నాయకులతో వ్యక్తిగతంగా మాట్లాడకుండా కేవలం ప్రసంగించి వెళ్లిపోవాలని సోనియాగాంధీ నిర్ణయించారు.
దీంతో మేడంతో ముఖాముఖి మాట్లాడాలనుకొన్న చాలా మంది నాయకుల ఆశలపై నీళ్లు చల్లినట్లయిందని ఆ పార్టీ నాయకులే పేర్కొంటున్నారు. అయితే ఎలాగైనా మేడంతో వ్యక్తిగతంగా మాట్లాడాలని ఆ వర్గం నాయకులు తమకు తెలిసిన దారులన్నింటిలో ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.