సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ఐపీఎల్ టోర్నీలో భాగంగా స్థానిక ఆర్‌సీబీ జట్టు శుక్రవారం ఇక్కడ కింగ్స్ లెవన్ పంజాబ్‌తో ఢీ కొనబోతోంది. టోర్నీ ప్రారంభం నుంచి అనూహ్యమైన ఆట తీరును కనబరుస్తున్న పంజాబ్, స్థానిక జట్టుపై విజయం సాధించడం ద్వారా పాయింట్ల పట్టికలో ఆధిపత్యాన్ని కొనసాగించాలనుకుంటోంది.
విధ్వంసకరమైన బ్యాట్స్‌మెన్‌గా పేరు గడించిన పంజాబ్‌కు చెందిన గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఆర్‌సీబీకి చెందిన క్రిస్ గేల్‌ల మధ్య ఈ మ్యాచ్ మహా సమరంగా మారుతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ పూర్తి శక్తి సామర్థ్యాలను ప్రదర్శించాల్సి ఉంది. 14 మ్యాచ్‌లు ఆడాల్సిన ఆర్‌సీబీ ఇప్పటికే సగం వాటిల్లో ఆడేసినా కేవలం ఆరు పాయింట్లతోనే ఉంది. అన్ని మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ 12 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉంది. పాయింట్లలోనే కాకుండా నిలకడలోనూ పంజాబ్‌తో ఆర్‌సీబీ పోటీ పడలేక పోతోంది.
వర్షం ముప్పు
నగరంలో గత రెండు రోజులుగా అడపా దడపా పడుతున్న వర్షంతో మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడవ చ్చనే ఆందోళన అభిమానుల్లో వ్యక్తమవుతోంది. మ్యాచ్‌ను రద్దు చేయాల్సినంతగా ప్రస్తుతం వర్షం పడకపోయినప్పటికీ, మరో రెండు రోజుల పాటు వానలు పడవచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. రాష్ట్రంలో ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. శుక్రవారం భారీ వర్షం పడితే మ్యాచ్ గతి ఏం కావాలని కొందరు అభిమానుల్లో చింత మొదలైంది. ఇప్పటికే టికెట్లన్నీ అమ్ముడు పోయాయి. వారాంతం కనుక ఐటీ, బీటీ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో స్టేడియానికి తరలి రావడం ఖాయం.
ప్రత్యేక బస్సులు
మ్యాచ్‌కు అభిమానులు తరలి రావడానికి బీఎంటీసీ అదనపు బస్సులను నడుపుతోంది. కాడుగోడి బస్టాండు, సర్జాపుర, ఎలక్ట్రానిక్ సిటీ, బన్నేరుఘట్ట నేషనల్ పార్కు, కగ్గలిపుర, కెంగేరి కేహెచ్‌బీ క్వార్టర్స్, జనప్రియ టౌన్‌షిప్, నెలమంగల, యలహంక శాటిలైట్ టౌన్, ఆర్‌కే. హెగ్డే నగర, బాగలూరు, హొసకోటె, కాడుగోడి బస్టాండు, అత్తిబెలె, బన్నేరుఘట్టల నుంచి సాయంత్రం అయిదు గంటలకు ఈ అదనపు బస్సులను నడుపుతారు. మ్యాచ్ ముగియగానే రాత్రి 11 గంటలకు బస్సులన్నీ తిరిగి గమ్య స్థానాలకు బయలుదేరుతాయి.
నేడు కింగ్స్‌తో ఆర్‌సీబీ ఢీ
Published Fri, May 9 2014 12:56 AM | Last Updated on Sat, Sep 2 2017 7:05 AM
Advertisement