![WPL 2025: Ashleigh Gardner Slams Blasting Fifty, GG Sets Huge Target To RCB](/styles/webp/s3/article_images/2025/02/14/as.jpg.webp?itok=NmgY-Knm)
మహిళల ఐపీఎల్ (WPL) మూడో సీజన్ ఇవాళ (ఫిబ్రవరి 14) ఘనంగా ప్రారంభమైంది. లీగ్ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గత రెండు సీజన్లుగా పేలవ ప్రదర్శన (టేబుల్ లాస్ట్) కనబర్చిన గుజరాజ్ జెయింట్స్ (GG) తలపడుతున్నాయి. వడోదరలోని కొటాంబి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోకపోవడం తప్పని ఆర్సీబీకి ఇన్నింగ్స్ మధ్యలో అర్థమైంది. మాజీ కెప్టెన్, ఓపెనర్ బెత్ మూనీ అర్ద సెంచరీతో రాణించి జెయింట్స్ ఇన్నింగ్స్‌కు మంచి పునాది వేసింది. మూనీ 42 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 56 పరుగులు చేసి ఔటైంది. మరో ఓపెనర్ లారా వోల్వార్డ్ 10 బంతుల్లో బౌండరీ సాయంతో కేవలం 6 పరుగులకే నిష్క్రమించి నిరాశపర్చింది.
వన్‌డౌన్‌లో వచ్చిన దయాలన్ హేమలత 9 బంతుల్లో 4 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ బాట పట్టింది. అనంతరం బరిలోకి దిగిన ఈ సీజన్ కొత్త కెప్టెన్ ఆష్లే గార్డ్‌నర్ ఆకాశమే హద్దుగా చెలరేగింది.
గార్డ్‌నర్ 37 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 79 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఫలితంగా గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోర్ చేసింది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో డియాండ్ర డొట్టిన్ కూడా సుడిగాల ఇన్నింగ్స్ ఆడింది. డొట్టిన్ 13 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్ సాయంతో 25 పరుగులు చేసింది.
ఆఖర్లో సిమ్రన్ షేక్, హర్లీన్ డియోల్ కూడా బ్యాట్ ఝులిపించారు. సిమ్రన్ బంతుల్లో బౌండరీ, సిక్సర్ సాయంతో 11 పరుగులు.. హర్లీన్ 4 బంతుల్లో 2 బౌండరీల సాయంతో 9 పరుగులు (నాటౌట్) చేశారు. ఇన్నింగ్స్ 18, 19 ఓవర్లలో గార్డ్‌నర్, సిమ్రన్ చెలరేగి పోయారు. ఈ రెండు ఓవర్లలో గార్డ్‌నర్ ఏకంగా నాలుగు సిక్సర్లు బాదింది. సిమ్రన్ బౌండరీ, సిక్సర్‌తో చెలరేగింది. ఫలితంగా 40 పరుగులు వచ్చాయి.
25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన గార్డ్‌నర్
ఈ మ్యాచ్‌లో గార్డ్‌నర్ కేవలం 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసింది. తద్వారా లీగ్ చరిత్రలో నాలుగో వేగవంతమైన హాఫ్ సెంచరీని నమోదు చేసింది. డబ్ల్యూపీఎల్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టి రికార్డు గుజరాత్‌కే చెందిన సోఫీ డంక్లీ పేరిట ఉంది. డంక్లీ 2023 సీజన్‌లో ఆర్సీబీపై 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసింది. లీగ్‌లో రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డు ఢిల్లీకి చెందిన షఫాలీ వర్మ పేరిట ఉంది. షఫాలీ 2023 సీజన్‌లో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసింది.
ఆతర్వాత 2023 సీజన్‌లో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ 22 బంతుల్లో అర్ద సెంచరీ చేసింది. ఈమె తర్వాత గ్రేస్ హ్యారిస్ (యూపీ), కిరణ్ నవ్‌గిరే (యూపీ), ఇవాళ గార్డ్‌నర్ 25 బంతుల్లో హాఫ్ సెంచరీలు పూర్తి చేశారు.
సిక్సర్ల సునామీ
ఈ మ్యాచ్‌లో గార్డ్‌నర్ సిక్సర్ల సునామీ సృష్టించింది. గార్డ్‌నర్ ఆ బౌలర్, ఈ బౌలర్ అన్న తేడా లేకుండా అందరిపై విరుచుకుపడింది. ఈ మ్యాచ్‌లో ఆమె ఏకంగా 8 సిక్సర్లు బాదింది. లీగ్ చరిత్రలో ఓ ఇన్నింగ్స్‌లో ఓ బ్యాటర్ కొట్టిన అత్యధిక సిక్సర్లు ఇవే. 2023 సీజన్‌లో సోఫీ డివైన్ కూడా గుజరాత్‌పై 8 సిక్సర్లు కొట్టింది.
Comments
Please login to add a commentAdd a comment