
గుజరాత్ జెయింట్స్‌ను గెలిపించిన కెప్టెన్
రాణించిన డియాండ్ర, ప్రియ
యూపీ వారియర్స్ ఓటమి
వడోదర: ఈ సీజన్ డబ్ల్యూపీఎల్ ఆరంభ మ్యాచ్‌లో 200 పైచిలుకు స్కోరు చేసినా గెలువలేకపోయిన గుజరాత్ జెయింట్స్... కెప్టెన్ ఆష్లీ గార్డ్‌నర్, డియాండ్ర డాటిన్‌ల ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రెండో మ్యాచ్‌లో బోణీ కొట్టింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన యూపీ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 143 పరుగులు చేసింది. కెప్టెన్ దీప్తి శర్మ (27 బంతుల్లో 39; 6 ఫోర్లు) మెరుగ్గా ఆడింది. స్పిన్నర్ ప్రియా మిశ్రా 3 వికెట్లు తీయగా... ఆష్లీ గార్డ్‌నర్, పేసర్ డియాండ్ర 2 వికెట్ల చొప్పున పడగొట్టారు.
అనంతరం గుజరాత్ 18 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 144 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఆష్లీ గార్డ్‌నర్ (32 బంతుల్లో 52; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), డియాండ్ర డాటిన్ (18 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) దంచేశారు. సోఫీ ఎకిల్‌స్టోన్ (4–0– 16–2) చక్కని స్పెల్ వృథా అయ్యింది. నేడు జరిగే మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తలపడుతుంది.
దీప్తి ఒక్కరే మెరుగ్గా...
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన యూపీ ఇన్నింగ్స్ రెండో ఓవర్ నుంచే కష్టాల్లో కూరుకుపోయింది. జట్టు స్కోరు 22 వద్ద ఓపెనర్లు కిరణ్ నవ్‌గిరే (15), వృందా (6) పెవిలియన్ చేరారు. ఈ దశలో ఉమా ఛెత్రి (27 బంతుల్లో 24; 4 ఫోర్లు), దీప్తి శర్మ మూడో వికెట్‌కు 51 పరుగులు జోడించారు.
ఇన్నింగ్స్ కుదుట పడుతున్న సమయంలో 73 పరుగుల వద్ద ఉమా, పరుగు వ్యవధిలో ప్రియా స్పిన్ మ్యాజిక్‌కు తాలియా (0), గ్రేస్ (4) అవుటవ్వడంతో 78 పరుగులకే 5 వికెట్లను కోల్పోయింది. ఈ దశలో ధాటిగా ఆడిన దీప్తి జట్టు స్కోరును 100 పరుగులు దాటించింది. కానీ తర్వాత 16 పరుగుల వ్యవధిలో మళ్లీ 3 వికెట్లు కూలడంతో యూపీ ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది.
దూకుడుగా ఆడి...
కష్టమైన లక్ష్యం కాకపోయినా... ఓపెనర్ బెత్ మూనీ (0), వన్‌డౌన్ బ్యాటర్ హేమలత (0) డకౌట్లతో 2 పరుగులకే 2 వికెట్లను కోల్పోయిన గుజరాత్ ఆరంభంలోనే కష్టాల్లో పడింది. 4 ఓవర్లలో జట్టు స్కోరు 15/2. పవర్‌ప్లేలో మిగిలినవి రెండే ఓవర్లు. సైమా ఠాకూర్ వేసిన ఐదో ఓవర్లో ఆష్లీ గార్డ్‌నర్ 2 సిక్స్‌లు, వొల్‌వార్ట్ మరో సిక్స్ బాదడంతో 20 పరుగులు వచ్చాయి.
ఇక్కడి నుంచి మ్యాచ్ స్వరూపం మారింది. వోల్‌వార్ట్ (22; 2 ఫోర్లు, 1 సిక్స్) అవుటైనా... ధనాధన్ షోతో గార్డ్‌నర్ 28 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తిచేసుకుంది. జట్టు స్కోరు 86 వద్ద ఆమె నిష్క్రమించినా... హర్లీన్ డియోల్ (30 బంతుల్లో 34 నాటౌట్; 4 ఫోర్లు), డియాండ్ర జోడీ ఐదో వికెట్‌కు అజేయంగా 58 పరుగులు జోడించి మ్యాచ్‌ను 18 ఓవర్లలోనే ముగించింది.
స్కోరు వివరాలు
యూపీ వారియర్స్ ఇన్నింగ్స్: నవ్‌గిరే (ఎల్బీడబ్ల్యూ) (బి) డాటిన్ 15; వృందా (బి) గార్డ్‌నర్ 6; ఉమా (సి) ప్రియా (బి) డాటిన్ 24; దీప్తి (సి) గార్డ్‌నర్ (బి) ప్రియా 39; తాలియా (ఎల్బీడబ్ల్యూ) (బి) ప్రియా 0; గ్రేస్ (బి) ప్రియా 4; శ్వేత (బి) గార్డ్‌నర్ 16; అలానా కింగ్ (నాటౌట్) 19; సోఫీ (బి) కశ్వీ 2; సైమా (రనౌట్) 15; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 143. వికెట్ల పతనం: 1–22, 2–22, 3–73, 4–74, 5–78, 6–101, 7–111, 8–117, 9–143. బౌలింగ్: సయాలీ 2–0–20–0, డియాండ్రా 4–0– 34–2, ఆష్లీ గార్డ్‌నర్ 4–0–39–2, కశ్వీ 4–0– 15–1, తనూజ 2–0–10–0, ప్రియా 4–0– 25–3.
గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్: వొల్‌వార్ట్ (బి) సోఫీ 22; బెత్ మూనీ (సి) తాలియా (బి) గ్రేస్ హారిస్ 0; హేమలత (బి) సోఫీ 0; ఆష్లీ గార్డ్‌నర్ (సి) నవ్‌గిరే (బి) తాలియా 52; హర్లీన్ (నాటౌట్) 34; డియాండ్ర (నాటౌట్) 33; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (18 ఓవర్లలో 4 వికెట్లకు) 144. వికెట్ల పతనం: 1–1, 2–2, 3–57, 4–86. బౌలింగ్: గ్రేస్ హారిస్ 1–0–1–1, సోఫీ 4–0– 16–2, క్రాంతి గౌడ్ 2–0– 15–0, సైమా 1–0– 20–0, దీప్తి శర్మ 4–0–32–0, అలానా కింగ్ 3–0–38–0, తాలియా 3–0–21–1.
Comments
Please login to add a commentAdd a comment