
మౌంట్ మాంగనూయ్ వేదికగా పాకిస్తాన్‌తో ఇవాళ (మార్చి 23) జరుగుతున్న నాలుగో టీ20లో న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది. ఫిన్ అలెన్, టిమ్ సీఫర్ట్, బ్రేస్‌వెల్ మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. టాస్ ఓడి పాక్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు టిమ్ సీఫర్ట్, ఫిన్ అలెన్ సుడిగాలి ప్రారంభాన్ని అందించారు.
వీరిద్దరి ధాటికి న్యూజిలాండ్ తొలి నాలుగు ఓవర్లలో 54 పరుగులు చేసింది. 22 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 44 పరుగులు చేసిన అనంతరం సీఫర్ట్ హరీస్ రౌఫ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఖుష్దిల్ షా అద్భుతమైన క్యాచ్ పట్టి సీఫర్ట్‌ను పెవిలియన్‌కు పంపాడు.
అప్పటివరకు నివురుగప్పిన నిప్పులా ఉండిన అలెన్.. సీఫర్ట్ ఔట్ కాగానే జూలు విదిల్చాడు. హరీస్ రౌఫ్ మినహా ప్రతి పాక్ బౌలర్‌ను ఎడాపెడా వాయించాడు. షాదాబ్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్‌లో అలెన్ విధ్వంసం తారా స్థాయికి చేరింది. ఈ ఓవర్‌లో అతను వరుసగా 2 ఫోర్లు, 2 సిక్సర్లు బాది మొత్తంగా 23 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో అలెన్ కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. న్యూజిలాండ్ తరఫున టీ20ల్లో ఇది ఎనిమిదో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ.
అలెన్ (20 బంతుల్లో 50; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) ఔటయ్యాక న్యూజిలాండ్ స్కోర్ ఒక్కసారిగా మందగించింది. 11 నుంచి 16వ ఓవర్ వరకు పాక్ బౌలర్లు అద్భుతంగా బౌల్ చేశారు. 10వ ఓవర్ తర్వాత 134 పరుగులున్న న్యూజిలాండ్ స్కోర్ 16 ఓవర్ల తర్వాత 166 పరుగులుగా మాత్రమే ఉంది.
ఈ 6 ఓవర్లలో న్యూజిలాండ్ 3 వికెట్లు కోల్పోయి కేవలం 32 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆఖర్లో కెప్టెన్ బ్రేస్‌వెల్ మూగబోయిన న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌ను మేల్కొలిపాడు. బ్రేస్‌వెల్ వచ్చీ రాగానే పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 17వ ఓవర్‌లో షాహీన్ అఫ్రిది బౌలింగ్‌లో వరుసగా సిక్సర్, బౌండరీ బాదిన బ్రేస్‌వెల్ ఆతర్వాత మరో అఫ్రిది (అబ్బాస్) వేసిన ఓవర్‌లోనూ అదే సీన్‌ను రిపీట్ చేశాడు.
ఆ ఓవర్‌లో బ్రేస్‌వెల్‌తో పాటు డారిల్ మిచెల్ కూడా చెలరేగడంతో న్యూజిలాండ్‌కు 23 పరుగులు వచ్చాయి. 19వ ఓవర్‌లో డారిల్ మిచెల్ ఔట్ కావడంతో స్కోర్ మళ్లీ నెమ్మదించింది. ఆ ఓవర్‌లో కేవలం 5 పరుగులే వచ్చాయి. షాహీన్ అఫ్రిది వేసిన చివరి ఓవర్‌లో బ్రేస్‌వెల్ మరోసారి విరుచుకుపడటంతో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 220 పరుగుల వద్ద ముగిసింది.
26 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 46 పరుగులు చేసిన బ్రేస్‌వెల్ అజేయంగా నిలిచాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో చాప్‌మన్ 24, డారిల్ మిచెల్ 29, నీషమ్ 3, హే 3 పరుగులు చేసి ఔటయ్యారు. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్ పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా 3 వికెట్లు తీయగా.. అబ్రార్ అహ్మద్ 2, అబ్బాస్ అఫ్రిది ఓ వికెట్ పడగొట్టారు.
కాగా, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరుగుతున్న నాలుగో టీ20 ఇది. దీనికి ముందు జరిగిన మూడు మ్యాచ్‌ల్లో తొలి రెండు న్యూజిలాండ్ గెలువగా.. మూడో టీ20లో పాక్ విజయం సాధించింది. 5 టీ20లు, 3 వన్డేల సిరీస్‌ల కోసం పాకిస్తాన్ న్యూజిలాండ్‌లో పర్యటిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment