
5 టీ20లు, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న పాక్ క్రికెట్ జట్టుకు మరో పరాభవం ఎదురైంది. టీ20 సిరీస్‌లో భాగంగా ఇవాళ (మార్చి 18) జరిగిన రెండో మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు పాక్‌ను 5 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. వర్షం కారణంగా 15 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 9 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది.
46 పరుగులు చేసిన కెప్టెన్ సల్మాన్ అఘా టాప్ స్కోరర్‌గా నిలువగా.. షాదాబ్ ఖాన్ (26), షాహీన్ అఫ్రిది (22 నాటౌట్), మహ్మద్ హరీస్ (11), ఇర్ఫాన్ ఖాన్ (11), అబ్దుల్ సమద్ (11) రెండంకెల స్కోర్లు చేశారు. పాక్ ఇన్నింగ్స్‌లో హసన్ నవాజ్ (0), ఖుష్దిల్ షా (2), జహన్‌దాద్ ఖాన్ (0), హరీస్ రౌఫ్ (1) దారుణంగా విఫలమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో జేకబ్ డఫీ, బెన్ సియర్స్, జిమ్మీ నీషమ్, ఐష్ సోధి తలో రెండు వికెట్లు తీసి పాక్‌ను దెబ్బకొట్టారు.
అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ ఆది నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్లు టిమ్ సీఫర్ట్ (22 బంతుల్లో 45), ఫిన్ అలెన్ (16 బంతుల్లో 32) చెలరేగిపోయారు. వీరిద్దరి ధాటికి న్యూజిలాండ్ 4 ఓవర్లలోనే 50 పరుగుల మార్కును తాకింది. పాక్ స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిది వేసిన ఇన్నింగ్స్ 3వ ఓవర్‌లో టిమ్ సీఫర్ట్ శివాలెత్తిపోయాడు. ఈ ఓవర్‌లో సీఫర్ట్ ఏకంగా నాలుగు సిక్సర్లు బాదాడు.
అంతకుముందు మొహమ్మద్ అలీ వేసిన రెండో ఓవర్‌లో ఫిన్ అలెన్ కూడా చెలరేగాడు. ఈ ఓవర్‌లో అలెన్ మూడు సిక్సర్లు కొట్టాడు. వీరిద్దరూ క్రీజ్‌లో ఉండగా మ్యాచ్ 10 ఓవర్లలోనే ముగిస్తుందని అంతా అనుకున్నారు. అయితే పాక్ బౌలర్లు ఒక్కసారిగా ఫామ్‌లోకి రావడంతో న్యూజిలాండ్ 31 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయింది.
మార్క్ చాప్‌మన్ (1), డారిల్ మిచెల్ (15), జిమ్మీ నీషమ్ (5) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. మిచెల్ హే (21 నాటౌట్), కెప్టెన్ బ్రేస్‌వెల్ (5 నాటౌట్) న్యూజిలాండ్‌ను విజయతీరాలకు చేర్చారు. న్యూజిలాండ్ 13.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్ 2, మొహమ్మద్ అలీ, ఖుష్దిల్ షా, జహన్‌దాద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు.
ఈ గెలుపుతో న్యూజిలాండ్ 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. అంతకుముందు తొలి మ్యాచ్‌లో కూడా న్యూజిలాండ్ పాక్‌ను చిత్తుగా ఓడించింది. మూడో టీ20 ఆక్లాండ్ వేదికగా మార్చి 21న జరుగనుంది. ఈ మ్యాచ్‌లో కూడా ఓడితే పాక్ సిరీస్‌ను కోల్పోతుంది.
Comments
Please login to add a commentAdd a comment