SRH Vs RR: సన్‌రైజర్స్‌ వర్సెస్‌ రాజస్థాన్‌ రాయల్స్‌.. ఎవరిది పైచేయి..? | IPL 2025: Sunrisers Hyderabad VS Rajasthan Royals Match Today, Check Playing XI And Head To Head Records | Sakshi
Sakshi News home page

IPL 2025 SRH Vs RR: సన్‌రైజర్స్‌ వర్సెస్‌ రాజస్థాన్‌ రాయల్స్‌.. ఎవరిది పైచేయి..?

Published Sun, Mar 23 2025 1:27 PM | Last Updated on Sun, Mar 23 2025 3:51 PM

IPL 2025: SRH VS RR Head To Head Records

Photo Courtesy: BCCI

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో భాగంగా ఇవాళ (మార్చి 23) మధ్యాహ్నం జరుగబోయే మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు ఎస్‌ఆర్‌హెచ్‌ హోం గ్రౌండ్‌ ఉప్పల్‌ స్టేడియం (హైదరాబాద్‌) వేదిక కానుంది. గత సీజన్‌ ఫైనల్లో కేకేఆర్‌ చేతిలో ఓడి తృటిలో టైటిల్‌ చేజార్చుకున్న ఆరెంజ్‌ ఆర్మీ.. తొలి మ్యాచ్‌లో గెలిచి సీజన్‌ను ఘనంగా ప్రారంభించాలని భావిస్తుంది. గతేడాది మూడో స్థానంతో సరిపెట్టుకున్న రాయల్స్‌ సైతం గెలుపుతో సీజన్‌ను ప్రారంభించాలని పట్టుదలగా ఉంది.

ఇరు జట్ల మధ్య హెడ్‌ టు హెడ్‌ రికార్డులు పరిశీలిస్తే.. రాయల్స్‌పై సన్‌రైజర్స్‌ కాస్త పైచేయి కలిగి ఉంది. ఇరు జట్లు ఇప్పటివరకు 20 మ్యాచ్‌ల్లో తలపడగా.. సన్‌రైజర్స్‌ 11, రాయల్స్‌ 9 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. ఇరు జట్లు మధ్య జరిగిన గత మూడు మ్యాచ్‌ల్లో సన్‌రైజర్సే విజయం సాధించింది. హైదరాబాద్‌లో ఇరు జట్లు తలపడిన చివరిసారి (2023) మాత్రం రాయల్స్‌నే విజయం వరించింది. ఇరు జట్లు హైదరాబాద్‌లో నాలుగుసార్లు తలపడగా రాయల్స్‌ ఆ ఒక్కసారి మాత్రమే గెలుపొందింది.

జట్లను పరిశీలిస్తే.. బ్యాటింగ్‌ విభాగంలో ఇరు జట్లు సమవుజ్జీలుగా కనిపిస్తున్నా.. బౌలింగ్‌లో మాత్రం సన్‌రైజర్స్‌దే పైచేయిగా తెలుస్తుంది. సన్‌రైజర్స్‌లో సమర్దవంతమైన పేసర్లతో (కమిన్స్‌, షమీ, హర్షల్‌ పటేల్‌, జయదేవ్‌ ఉనద్కత్‌) పాటు నాణ్యమైన స్పిన్నర్లు (రాహుల్‌ చాహర్‌, ఆడమ్‌ జంపా, కమిందు మెండిస్‌, అభిషేక్‌ శర్మ, ట్రవిస్‌ హెడ్‌) ఉన్నారు. రాయల్స్‌లో అది లోపించింది. పేసర్లలో సందీప్‌ శర్మ, జోప్రా ఆర్చర్‌.. స్పిన్నర్లలో హసరంగ, తీక్షణ మాత్రమే ఆ జట్టు తరఫున అనుభవజ్ఞులుగా ఉన్నారు. 

బ్యాటింగ్‌ విషయానికొస్తే.. ఇరు జట్లలో విధ్వంసకర వీరులు ఉన్నారు. సన్‌రైజర్స్‌లో హెడ్‌, అభిషేక్‌, క్లాసెన్‌, ఇషాన్‌ కిషన్‌ ఉండగా.. రాయల్స్‌లో సంజూ శాంసన్‌, యశస్వి జైస్వాల్‌, షిమ్రోన్‌ హెట్‌మైర్‌, రియాన్‌ పరాగ్‌ లాంటి మెరుపు వీరులు ఉన్నారు. ఇరు జట్ల బ్యాటర్లు సీజన్‌ ప్రారంభానికి ముందు ఆడిన ఇంట్రా స్క్వాడ్‌ మ్యాచ్‌ల్లో బీభత్సమైన ఫామ్‌ కనబర్చారు. దీన్ని బట్టి చూస్తే నేటి మ్యాచ్‌లో పరుగుల వరద పారడం ఖాయమనిపిస్తుంది. గత సీజన్‌లో సన్‌రైజర్స్‌ ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక స్కోర్‌ (ఆర్సీబీపై 287) నమోదు చేయడంతో పాటు మూడు సార్లు 250 ప్లస్‌ స్కోర్లు నమోదు చేసిన విషయం తెలిసిందే.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌..
పాట్‌ కమిన్స్‌ (కెప్టెన్‌), అథర్వ్‌ తైడే, అభినవ్‌ మనోహర్‌, అనికేత్‌ వర్మ, సచిన్‌ బేబి, ట్రవిస్‌ హెడ్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, కమిందు మెండిస్‌, వియాన్‌ ముల్దర్‌, అభిషేక్‌ శర్మ, హెన్రిచ్‌ క్లాసెన్‌, ఇషాన్‌ కిషన్‌, జీషన్‌ అన్సారీ, మహ్మద్‌ షమీ, హర్షల్‌ పటేల్‌, రాహుల్‌ చాహర్‌, సిమర్‌జీత్‌ సింగ్‌, ఎషాన్‌ మలింగ, ఆడమ్‌ జంపా, జయదేవ్‌ ఉనద్కత్‌

రాజస్థాన్‌ రాయల్స్‌..
సంజూ శాంసన్‌ (కెప్టెన్‌), వైభవ్‌ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్‌, నితీశ్‌ రాణా, శుభమ్‌ దూబే, షిమ్రోన్‌ హెట్‌మైర్‌, రియాన్‌ పరాగ్‌, యుద్ద్‌వీర్‌ సింగ్‌ చరక్‌, వనిందు హసరంగ, దృవ్‌ జురెల్‌, కునాల్‌ సింగ్‌ రాథోడ్‌, సందీప్‌ శర్మ, తుషార్‌ దేశ్‌పాండే, కుమార్‌ కార్తీకేయ, ఆకాశ్‌ మధ్వాల్‌, క్వేనా మపాకా, మహీశ్‌ తీక్షణ, ఫజల్‌ హక్‌ ఫారూకీ, అశోక్‌ శర్మ, జోఫ్రా ఆర్చర్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement