మహిళల ఐపీఎల్ (WPL) 2025 సీజన్ ప్రారంభానికి ముందు గుజరాత్ జెయింట్స్ (Gujarat Giants) ఫ్రాంచైజీ యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. పాత కెప్టెన్‌ను మార్చి కొత్త కెప్టెన్‌ను నియమించుకుంది. బెత్ మూనీ (Beth Mooney) (ఆస్ట్రేలియా) స్థానంలో ఆష్లే గార్డ్‌నర్‌ను (Ashleigh Gardner) (ఆస్ట్రేలియా) నూతన సారధిగా నియమిస్తున్నట్లు జెయింట్స్ యాజమాన్యం ఇవాళ (ఫిబ్రవరి 5) ప్రకటించింది.
గత రెండు సీజన్లలో పేలవ ప్రదర్శనల నేపథ్యంలో కెప్టెన్‌ను మారుస్తున్నట్లు మేనేజ్‌మెంట్ పేర్కొంది. జెయింట్స్ గత రెండు సీజన్లలో (2023, 2024) చిట్ట చివరి స్థానంలో నిలిచింది. 2023 సీజన్‌లో 8 మ్యాచ్‌ల్లో 2 మ్యాచ్‌లు గెలిచిన జెయింట్స్.. 2024 సీజన్‌లోనూ అదే ప్రదర్శనను పునరావృతం చేసింది.
గత రెండు సీజన్లలో జెయింట్స్ ప్రదర్శన బాగా లేనప్పటికీ.. గార్డ్‌నర్ మాత్రం వ్యక్తిగతంగా రాణించింది. గార్డ్‌నర్ డబ్ల్యూపీఎల్ మొత్తంలో 324 పరుగులు చేసి 17 వికెట్లు పడగొట్టింది. కెప్టెన్‌గా నియమించడం పట్ల గార్డ్‌నర్ సంతోషం వ్యక్తం చేసింది. జట్టును ముందుండి నడిపించడానికి ఉత్సాహంగా ఉన్నానని ప్రకటించింది. తమ జట్టులో భారతీయ ప్రతిభ పుష్కలంగా ఉందని పేర్కొంది.
జెయింట్స్ కెప్టెన్‌గా ఎంపిక కావడం తనకు దక్కిన గౌరవమని తెలిపింది. తదుపరి సీజన్‌లో జెయింట్స్‌కు నాయకత్వం వహించడానికి సిద్దంగా ఉన్నానని ప్రకటించింది. జట్టులో యువ మరియు అనుభవజ్ఞులైన క్రికెటర్లతో పాటు భారతీయ ప్రతిభ పుష్కలంగా ఉందని పేర్కొంది. ఈసారి తమ అభిమానులను గర్వపడేలా చేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తానని తెలిపింది.
జెయింట్స్ కెప్టెన్‌గా గార్డ్‌నర్ నియామకంపై ఆ ఫ్రాంచైజీ హెడ్ కోచ్ మైఖేల్ క్లింగర్ సంతృప్తి వ్యక్తం చేశాడు. గార్డ్‌నర్‌తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని అన్నాడు. గార్డ్‌నర్‌ను టఫ్ కాంపిటీటర్‌తో పోల్చాడు. గార్డ్‌నర్‌కు ఆటపై అవగాహన, వ్యూహాత్మక చతురత మరియు ప్లేయర్లను ప్రేరేపించే సామర్థ్యం ఉందని కొనియాడాడు. తదుపరి సీజన్‌లో గార్డ్‌నర్ జెయింట్స్‌ను విజయవంతంగా ముందుండి నడుపుతుందని విశ్వాసం వ్యక్తం చేశాడు.
తాజా మాజీ కెప్టెన్ మూనీ గురించి మాట్లాడుతూ.. ఆమె జట్టులో అంతర్గత నాయకురాలిగా కొనసాగుతుందని అన్నాడు. బ్యాటింగ్ విభాగంలో మూనీ ప్రధాన పాత్ర పోషించనుందని తెలిపాడు. కెప్టెన్‌గా మూనీ సేవలను కొనియాడాడు. ఇకపై మూనీ బ్యాటింగ్, వికెట్ కీపింగ్‌పై పూర్తిగా దృష్టి సారిస్తుందని పేర్కొన్నాడు.
కాగా, డిసెంబర్‌లో జరిగిన వేలంలో జెయింట్స్ భారత ఆల్ రౌండర్ సిమ్రాన్ షేక్‌తో సహా నలుగురు ఆటగాళ్లను కొనుగోలు చేసింది. విండీస్ ఆల్‌రౌండర్ డియాండ్రా డాటిన్ సేవలను నిలుపుకుంది.
Comments
Please login to add a commentAdd a comment