
చూపులన్ని ‘చిన్నస్వామి’ వైపే
- నేడు కోల్‌కత్తా నైట్ రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల ఫైనల్
సాక్షి, బెంగళూరు : దేశంలోని క్రికెట్ అభిమానుల కళ్లన్నీ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వైపే చూస్తున్నాయి. మరి కొన్ని గంటల్లో ప్రారంభం కాబోయే ఐపీఎల్-7 సిరీస్ తుది పోరును ఆస్వాదించడానికి చిన్నాపెద్ద తేడా లేకుండా ఎదురు చూస్తున్నారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కోల్‌కత్తా నైట్ రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు ఫైనల్ నేడు (ఆదివారం) మ్యాచ్ మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభం కానుంది.
స్థానిక ఆటగాడు, ఈ సిరీస్‌లో భీకర ఫామ్‌లో ఉన్న రాబిన్ ఊతప్ప కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్టులో ఉండటంతో ఈ మ్యాచ్‌ను చూడటానికి కర్ణాటక క్రికెట్ క్రీడాభిమానులు ఉత్సాహం చూపుతున్నారు. ఇంతేకాకుండా గత మ్యాచ్‌తో తన మునుపటి సత్తా చూపిన వీరేంద్రసెహ్వాగ్ బ్యాటింగ్‌ను చూడటాలని నగర వాసులు ఆశతో ఎదురు చూస్తున్నారు.
దాదాపు 43 వేల సీటింగ్ కెపాసిటీ గల చిన్నస్వామి స్టేడియంలో టికెట్లన్నీ ఇప్పటికే హాట్‌కేకుల్లా అమ్ముడు పోయాయి. ఐపీఎల్-7లో నేడు జరగబోయేది తుది పోరుకాబట్టి మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడటానికి కన్నడ, తెలుగు, హిందీ సినీరంగాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా స్టేడియంకు రానున్నారు. దీంతో అటు క్రికెట్ స్టార్‌లను, ఇటు సినీస్టార్‌లను ప్రత్యక్షంగా చూసే అవకాశం వీక్షకులకు కలగనుంది.
ఇక మ్యాచ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటానికి పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా, నిఘా వ్యవస్థను పెంచారు. స్టేడియం చుట్టూ మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యామ్యాయ ఏర్పాట్లను కూడా పోలీసులు ఏర్పాటు చేశారు.