'కొంప ముంచిన ఆఖరి ఓవర్'
కోల్ కతా: ఈడెన్ గార్డెన్స్ లో బుధవారం జరిగిన మ్యాచ్ లో కోల్ కతా చేతిలో ఓటమిపై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాడు అక్షర్ పటేల్ స్పందించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ.. తమ ఇన్నింగ్స్ చివరి ఓవర్ కొంపముంచిందని అక్షర్ పటేల్ పేర్కొన్నాడు. 19వ ఓవర్ ముగిసేవరకూ విజయం తమదేనని ధీమాగా ఉన్నట్లు చెప్పాడు. మాక్స్ వెల్ అద్భుత ఇన్నింగ్స్(42 బంతుల్లో 68) తోడవడంతో సులువుగా గెలుస్తామని భావించామని, చివరి ఓవర్లో మూడు వికెట్లు కోల్పోవడంతో కోల్ కతా విజయం సాధించిందని అభిప్రాయపడ్డాడు. తర్వాతి మ్యాచ్ కు తమ జట్టు 100 శాతం ప్రదర్శన చేస్తుందని ఆశాభావం వ్యక్తంచేశాడు.
ఓవరాల్ గా నాలుగు వికెట్లు తీసిన రస్సెల్ ముగ్గుర్ని డకౌట్ గా వెనక్కి పంపడం గమనార్హం. అక్షర్ పటేల్ (21; 7 బంతుల్లో, 1 ఫోర్, 2 సిక్సర్లు) చివర్లో మెరుపులు మెరిపించినా రనౌట్ కావడంతో వారి పతనం మళ్లీ మొదలైంది. చివరి ఓవర్ రెండో బంతికి అక్షర్ పటేల్ రనౌట్ కాగా, మూడో బంతికి గురుకీరత్ రనౌట్ అయ్యాడు. రస్సెల్ వేసిన అదే ఓవర్లో ఐదో బంతికి స్వప్నిల్ సింగ్ ఎల్బీడబ్లూ రూపంలో వెనుదిరిగాడు. దీంతో చివరి ఓవర్లో పంజాబ్ విజయానికి 12 పరుగులు అవసరం కాగా, 4 పరుగులే చేసి 3 వికెట్లు కోల్పోవడంతో 7 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యామని అక్షర్ వివరించాడు.