కోల్‌కతా ‘టాప్’ క్లాస్
► పంజాబ్‌పై ఏడు పరుగులతో నైట్ రైడర్స్‌విజయం
► ఉతప్ప, గంభీర్ అర్ధసెంచరీలు
► బంతితో మెరిసిన రసెల్
అద్భుతమైన ఫామ్‌లో ఉన్న గంభీర్, ఉతప్పల క్లాసికల్ అర్ధసెంచరీలు... ఆండ్రీ రసెల్ సంచలన బౌలింగ్‌తో సొంతగడ్డపై కోల్‌కతా నైట్‌రైడర్స్ మరో విజయం సాధించింది. సీజన్‌లో తొలిసారి మ్యాక్స్‌వెల్ మెరిసినా పంజాబ్ రాత మారలేదు. ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో ఆరింటిలో గెలిచిన నైట్‌రైడర్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది.
కోల్‌కతా: ‘సూపర్ మ్యాన్’ ఆండ్రీ రసెల్ కోల్‌కతా నైట్‌రైడర్స్ ఖాతాలో మరో విజయాన్ని చేర్చాడు. ఈసారి అద్భుతమైన బౌలింగ్‌తో పాటు మైదానం అంతా పాదరసంలా క దిలి ఫీల్డింగ్‌తోనూ ఆకట్టుకున్నాడు. రసెల్ (4/ 20) సంచలన బౌలింగ్ ప్రదర్శనతో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఏడు పరుగులతో పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌పై విజయం సాధించింది. ఈడెన్ గార్డెన్స్‌లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకోగా... కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో మూడు వికెట్లకు 164 పరుగులు చేసింది. ఓపెనర్లు ఉతప్ప (49 బంతుల్లో 70; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), గంభీర్ (45 బంతుల్లో 54; 6 ఫోర్లు, 1 సిక్సర్) అర్ధ సెంచరీలు సాధించి... తొలి వికెట్‌కు 81 బంతుల్లో 101 పరుగులు జోడించారు. యూసుఫ్ పఠాన్ (16 బంతుల్లో 19 నాటౌట్; 1 సిక్సర్), రసెల్ (10 బంతుల్లో 16; 1 ఫోర్, 1 సిక్సర్) స్లాగ్ ఓవర్లలో ఆశించిన స్థాయిలో ఆడలేకపోయారు.
పంజాబ్ కింగ్స్ ఎలెవన్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 157 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. మ్యాక్స్‌వెల్ (42 బంతుల్లో 68; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), అక్షర్ పటేల్ (7 బంతుల్లో 21; 1 ఫోర్, 2 సిక్సర్లు) మినహా అందరూ విఫలమయ్యారు. తన నాలుగు ఓవర్లలో 15 డాట్ బాల్స్ వేసిన రసెల్ నాలుగు వికెట్లు తీయగా... పీయూష్ చావ్లా రెండు వికెట్లు పడగొట్టాడు.
ఓపెనర్ల జోరు
ఈ సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న కోల్‌కతా ఓపెనర్లు గంభీర్, ఉతప్ప మరోసారి రాణించారు. ఇద్దరూ తమ సహజశైలిలోనే ఆడటంతో అడపాదడపా బౌండరీలు వచ్చినా పవర్‌ప్లేలో 40 పరుగులు మాత్రమే వచ్చాయి. కుదురుకున్నాక ఇద్దరూ చెరో సిక్సర్ కొట్టినా ఎక్కువగా సింగిల్స్‌కే పరిమితమయ్యారు. పది ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 74 పరుగులతో కోల్‌కతా పటిష్ట స్థితికి చేరింది. 42 బంతుల్లో అర్ధసెంచరీ సాధించిన గంభీర్... ఆ తర్వాతి ఓవర్లోనే రనౌట్‌గా వెనుదిరిగాడు.
గత మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన యూసుఫ్ పఠాన్‌తో కలిసి ఉతప్ప ఇన్నింగ్స్‌లో వేగం పెంచే ప్రయత్నం చేశాడు. 38 బంతుల్లో అర్ధసెంచరీ చేసిన ఉతప్ప... జోరు పెంచి ఓ సిక్సర్, ఫోర్ కొట్టినా రనౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత రసెల్ క్రీజులోకి వచ్చినా... పఠాన్, రసెల్ జోడీని పంజాబ్ బౌలర్లు నియంత్రించారు. స్లాగ్ ఓవర్లలో సందీప్ శర్మ, మోహిత్ శర్మ అద్భుతంగా యార్కర్లు సంధించడంతో భారీగా పరుగులు రాలేదు. ఇన్నింగ్స్ చివరి బంతికి రసెల్ రనౌట్ అయ్యాడు.
మ్యాక్స్‌వెల్ పోరాడినా...
పంజాబ్ ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే స్టోయినిస్ అవుటయ్యాడు. వోహ్రా, కెప్టెన్ విజయ్ కూడా వరుస బంతుల్లో అవుట్ కావడంతో పంజాబ్ 13 పరుగులకే టాపార్డర్ మూడు వికెట్లు కోల్పోయింది. సాహా, మ్యాక్స్‌వెల్ చెరో రెండు ఫోర్లు కొట్టడంతో పవర్‌ప్లేలో పంజాబ్ 37 పరుగులు చేసింది. సాహా కూడా విఫలం కావడంతో పది ఓవర్లలో 4 వికెట్లకు 64 పరుగులు మాత్రమే చేసింది.ఈ దశలో మ్యాక్స్‌వెల్ బ్యాట్ ఝళిపించాడు. చావ్లా బౌలింగ్‌లో సిక్సర్, ఫోర్... హాగ్ బౌలింగ్‌లో సిక్సర్, రెండు ఫోర్లతో 29 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు.
అదే జోరులో మరో ఫోర్, సిక్సర్ కొట్టాక చావ్లా బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ ఆడబోయి ఎల్బీగా వెనుదిరిగాడు. అప్పటికి పంజాబ్ విజయానికి 26 బంతుల్లో 45 పరుగులు చేయాలి. ఫామ్‌లో లేని మిల్లర్ మరోసారి నిరాశపరిచినా... రసెల్ బౌలింగ్‌లో రెండు వరుస సిక్సర్లతో అక్షర్ పటేల్ పంజాబ్ ఆశలు సజీవంగా నిలిపాడు. చివరి రెండు ఓవర్లలో విజయానికి 22 పరుగులు అవసరం కాగా... మోర్కెల్ వేసిన 19వ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. ఆఖరి ఓవర్లో రసెల్... అక్షర్‌ను రనౌట్ చేయడంతో పాటు స్వప్నిల్ వికెట్ తీసి కేవలం నాలుగు పరుగులే ఇచ్చి కోల్‌కతా విజయాన్ని పూర్తి చేశాడు.
స్కోరు వివరాలు
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: ఉతప్ప రనౌట్ 70; గంభీర్ రనౌట్ 54; యూసుఫ్ పఠాన్ నాటౌట్ 19; రసెల్ రనౌట్ 16; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 164.
వికెట్ల పతనం: 1-101; 2-137; 3-164.
బౌలింగ్: సందీప్ శర్మ 4-0-25-0; మోహిత్ శర్మ 4-0-39-0; స్టోయినిస్ 3-0-26-0; అక్షర్ పటేల్ 4-0-24-0; స్వప్నిల్ సింగ్ 3-0-29-0; గురుకీరత్ 1-0-8-0; మ్యాక్స్‌వెల్ 1-0-11-0.
పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ఇన్నింగ్స్: మురళీ విజయ్ (సి) షకీబ్ (బి) మోర్కెల్ 6; స్టోయినిస్ (సి) చావ్లా (బి) రసెల్ 0; వోహ్రా (సి) షకీబ్ (బి) రసెల్ 0; సాహా (బి) చావ్లా 24; మ్యాక్స్‌వెల్ ఎల్బీడబ్ల్యు (బి) చావ్లా 68; మిల్లర్ (సి) సతీశ్ (సబ్) (బి) రసెల్ 13; గురుకీరత్ రనౌట్ 11; అక్షర్ పటేల్ రనౌట్ 21; స్వప్నిల్ సింగ్ ఎల్బీడబ్ల్యు (బి) రసెల్ 0; మోహిత్ శర్మ నాటౌట్ 1; సందీప్ శర్మ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 157.
వికెట్ల పతనం: 1-1; 2-13; 3-13; 4-53; 5-120; 6-130; 7-154; 8-155; 9-156.
బౌలింగ్: రసెల్ 4-0-20-4; మోర్నీ మోర్కెల్ 4-0-27-1; ఉమేశ్ యాదవ్ 3-0-26-0; షకీబ్ 3-0-21-0; పీయూష్ చావ్లా 4-0-27-2; హాగ్ 2-0-28-0.