రాణించిన ఉతప్ప, గంభీర్..
కోల్ కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9 లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో జరుగుతున్న మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ ఓపెనర్లు చెలరేగారు. వీరిద్దరూ రాణించడంతో పంజాబ్ ముందు 165 పరుగుల టార్గెట్ నిలిపారు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కోల్ కతా కెప్టెన్ గౌతమ్ గంభీర్ (54; 45 బంతుల్లో, 6 ఫోర్లు, 1 సిక్సర్) మరో ఓపెనర్ రాబిన్ ఉతప్ప(70; 49 బంతుల్లో, 6 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 3 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. ఈ జోడీ తొలి వికెట్ కు 101 పరుగల భారీ భాగస్వామ్యాన్ని జతచేసింది. ఆ స్కోరు వద్ద గంభీర్ రనౌటయ్యాడు. ఆ తర్వాత షాట్లతో విజృంభించిన ఉతప్ప కూడా మాక్స్ వెల్ చురుకైన ఫీల్డింగ్ తో రనౌట్ అయ్యి రెండో వికెట్ రూపంలో నిష్క్రమించాడు.
ఆ తర్వాత యూసఫ్ పఠాన్(19 నాటౌట్), ఆండ్రీ రస్సెల్(16; 10 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) చివరి బంతికి లేని పరుగుకు ప్రయత్నించి రనౌటయ్యాడు. కోల్ కతా భారీ స్కోరు చేసేలా కనిపించినా చివరి ఓవర్లలో బౌలర్లు చాలా పొదుపుగా బౌలింగ్ చేయడంతో 170 కూడా చేయలేకపోయింది. పంజాబ్ బౌలర్లలో గత మ్యాచ్ హ్యాట్రిక్ హీరో అక్షర్ పటేల్ కాస్త పొదుపుగా బౌలింగ్ వేశాడు. కానీ వికెట్ తీయలేకపోయాడు. కోల్ కతా మూడు వికెట్లు కోల్పోగా ఆ మూడు రనౌట్లే కావడం విశేషం.