కేకేఆర్‌పై పంజాబ్‌ ప్రతాపం | Kings XI Punjab beat Kolkata Knight Riders by 8 wickets | Sakshi
Sakshi News home page

కేకేఆర్‌పై పంజాబ్‌ ప్రతాపం

Published Tue, Oct 27 2020 4:06 AM | Last Updated on Tue, Oct 27 2020 8:27 AM

Kings XI Punjab beat Kolkata Knight Riders by 8 wickets - Sakshi

పంజాబ్‌ తెలుసుగా... 220 పైచిలుకు పరుగులు చేసినా కూడా ఓడింది. సూపర్‌ ఓవర్‌లో రెండంటే రెండు పరుగులు చేసిన జట్టు. ఒక్కమాటలో చెప్పాలంటే ఐపీఎల్‌ తొలి సగం మ్యాచ్‌ల్లో వరుసబెట్టి నిరాశపరిచింది. కానీ ఈ కింగ్స్‌... చెన్నై కింగ్స్‌లా కాదు! మొదటన్నీ ఓడినా... తర్వాతన్నీ గెలుచుకుంటూ వస్తోంది. ఇప్పుడు ఆరో విజయంతో ‘ప్లే ఆఫ్స్‌’ దారిలో పడింది. 
 
షార్జా: ఈ సీజన్‌లో పంజాబ్‌ను చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం, అనుమానం  కలుగకమానదు. ఒకదశలో ఏడింట ‘ఆరు’ ఓడిపోయిన జట్టు... వరుసగా విజయబావుటా ఎగరేస్తున్న జట్టు ఇదేనా అని కచ్చితంగా అనిపిస్తుంది. కానీ కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ తన ప్రత్యర్థి జట్టపై పంజా విసురుతోంది. ఇది నిజం. అది కూడా వరుసగా! సోమవారం పంజాబ్‌ 8 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై గెలిచింది. మొదట కోల్‌కతా నైట్‌రైడర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 149 పరుగులు చేసింది.

శుబ్‌మన్‌ గిల్‌ (45 బంతుల్లో 57; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు),  కెప్టెన్‌ మోర్గాన్‌ (25 బంతుల్లో 40; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. షమీ 3 వికెట్లు పడగొట్టాడు. తర్వాత పంజాబ్‌ 18.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసి గెలిచింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ క్రిస్‌ గేల్‌ (29 బంతుల్లో 51; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరిపించగా...  మన్‌దీప్‌ (56 బంతుల్లో 66 నాటౌట్‌; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) గెలిపించాడు.   

షమీ తడఖా...
పంజాబ్‌ కెప్టెన్‌ రాహుల్‌ టాస్‌ నెగ్గగానే ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. కోల్‌కతా ఇన్నింగ్స్‌ మొదలైన రెండో బంతికే మ్యాక్స్‌వెల్‌... నితీశ్‌ రాణా (0)ను డకౌట్‌ చేశాడు. రెండో ఓవర్‌ వేసిన షమీ తన తడాఖా చూపాడు. నాలుగో బంతికి రాహుల్‌ త్రిపాటి (7)ని, ఆఖరి బంతికి దినేశ్‌ కార్తీక్‌ (0)ను డకౌట్‌ చేశాడు. ఒక్కసారిగా 10/3 స్కోరుతో కోల్‌కతా కష్టాల్లో పడింది. ఈ దశలో ఓపెనర్‌ గిల్, కెప్టెన్‌ మోర్గాన్‌ నిలకడగా ఆడి వికెట్ల పతనాన్ని కాసేపు నిలువరించారు.  

శుబ్‌మన్‌ ఫిఫ్టీ...
ఆత్మరక్షణలో పడిపోయిన నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌ను శుబ్‌మన్, మోర్గాన్‌లే నడిపించారు. ఈ జోడీ ఆడినంతవరకు పరుగులకు ఢోకా లేకుండా పోయింది. అయితే ఈ భాగస్వామ్యం ముగిశాక మళ్లీ తర్వాత వచ్చిన వారు కూడా ముందరి బ్యాట్స్‌మెన్‌నే అనుసరించారు.   

గేల్‌... మెరుపుల్‌!
కింగ్స్‌ లక్ష్యఛేదన ఫోర్‌తో మొదలైంది. కమిన్స్‌ తొలి బంతిని రాహుల్‌ బౌండరీకి తరలించాడు. జట్టు స్కోరు 47 పరుగుల వద్ద రాహుల్‌ (25 బంతుల్లో 28; 4 ఫోర్లు) ఔటయ్యాడు. దీంతో గేల్‌ క్రీజ్‌లోకి వచ్చాడు. వరుణ్‌ చక్రవర్తి, నరైన్‌ బౌలింగ్‌ల్లో భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. మరోవైపు ఓపెనర్‌ మన్‌దీప్‌ చూడచక్కని బౌండరీలతో నిలకడగా పరుగులు చేశాడు. 49 బంతుల్లో అర్ధసెంచరీ చేశాడు. జట్టు 13.4 ఓవర్లలో 100 పరుగులను అధిగమించింది. కాసేపటికే గేల్‌ ఫిఫ్టీ 25 బంతుల్లోనే  పూర్తయ్యింది. వీళ్లిద్దరు రెండో వికెట్‌కు సరిగ్గా 100 పరుగులు జత చేశాక గేల్‌ ఔటైనా... మిగతా లాంఛనాన్ని పూరన్‌ (2 నాటౌట్‌)తో కలిసి మన్‌దీప్‌ పూర్తి చేశాడు.

స్కోరు వివరాలు
కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: శుబ్‌మన్‌ గిల్‌ (సి) పూరన్‌ (బి) షమీ 57; నితీశ్‌ రాణా (సి) గేల్‌ (బి) మ్యాక్స్‌వెల్‌ 0; రాహుల్‌ త్రిపాఠి (సి) కేఎల్‌ రాహుల్‌ (బి) షమీ 7; దినేశ్‌ కార్తీక్‌ (సి) రాహుల్‌ (బి) షమీ 0; మోర్గాన్‌ (సి) అశ్విన్‌ (బి) రవి బిష్ణోయ్‌ 40; నరైన్‌ (బి) జోర్డాన్‌ 6; నాగర్‌కోటి (బి) అశ్విన్‌ 6; కమిన్స్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) రవి బిష్ణోయ్‌ 1; ఫెర్గూసన్‌ (నాటౌట్‌) 24; వరుణ్‌ చక్రవర్తి (బి) జోర్డాన్‌ 2; ప్రసిధ్‌ కృష్ణ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 149.  
వికెట్ల పతనం: 1–1, 2–10, 3–10, 4–91, 5–101, 6–113, 7–114, 8–136, 9–149.
బౌలింగ్‌: మ్యాక్స్‌వెల్‌ 2–0–21–1, షమీ 4–0–35–3, అర్‌‡్షదీప్‌ సింగ్‌ 2–0– 18–0, మురుగన్‌ అశ్విన్‌ 4–0–27–1, జోర్డాన్‌ 4–0–25–2, రవి బిష్ణోయ్‌ 4–1–20–2.  

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ఇన్నింగ్స్‌: కేఎల్‌ రాహుల్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) వరుణ్‌ 28; మన్‌దీప్‌ సింగ్‌ (నాటౌట్‌) 66; క్రిస్‌ గేల్‌ (సి) ప్రసిధ్‌ కృష్ణ (బి) ఫెర్గూసన్‌ 51; పూరన్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (18.5 ఓవర్లలో 2 వికెట్లకు) 150. 
వికెట్ల పతనం: 1–47, 2–147.
బౌలింగ్‌:
కమిన్స్‌ 4–0–31–0, ప్రసి«ధ్‌ కృష్ణ 3–0–24–0, వరుణ్‌ చక్రవర్తి 4–0–34–1, నరైన్‌ 4–0–27–0, ఫెర్గూసన్‌ 3.5–0–32–1.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement