ముంబై... జై జై | Mumbai Indians beat Kolkata Knight Riders by 8 wickets | Sakshi
Sakshi News home page

ముంబై... జై జై

Published Sat, Oct 17 2020 4:55 AM | Last Updated on Sat, Oct 17 2020 8:07 AM

Mumbai Indians beat Kolkata Knight Riders by 8 wickets - Sakshi

టోర్నీ జరిగేకొద్దీ ముంబై హోరెత్తిస్తోంది. ఆల్‌రౌండ్‌ సత్తా చాటుతోంది. బౌలింగ్‌తో కట్టేసి, మెరుపు బ్యాటింగ్‌తో లక్ష్యాన్ని చుట్టేస్తోంది. తొలుత రాహుల్‌ చహర్‌ స్పిన్‌ మాయాజాలం రోహిత్‌ సేనకు బలంకాగా... ఓపెనర్లు రోహిత్, డికాక్‌ దూకుడుతో లక్ష్యం కూడా సులువైంది. వరుసగా ఐదో విజయంతో, ఓవరాల్‌గా ఆరో విజయంతో, మెరుగైన రన్‌రేట్‌తో ముంబై పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది.

అబుదాబి: వరుసగా ఐదు పరాజయాల తర్వాత గత మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ గెలిచింది. దీనికి విరుద్ధంగా ముంబై ఇండియన్స్‌ వరుసగా ఐదో విజయం సాధించింది. ఐపీఎల్‌లో శుక్రవారం జరిగిన పోరులో రోహిత్‌ సేన 8 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చిత్తు చేసింది. టాస్‌ నెగ్గి మొదట బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. కమిన్స్‌ (36 బంతుల్లో 53 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించాడు. మోర్గాన్‌ (29 బంతుల్లో 38 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. స్పిన్నర్‌ రాహుల్‌ చహర్‌ 2 వికెట్లు తీశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్‌ 16.5 ఓవర్లలో 2 వికెట్లకు 149 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్‌ డికాక్‌ (44 బంతుల్లో 78 నాటౌట్‌; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగాడు. అతనికే ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ పురస్కారం దక్కింది. రోహిత్‌ శర్మ (36 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. కోల్‌కతా తమ తుదిజట్టులో రెండు మార్పులు చేసింది. టామ్‌ బాంటన్, కమలేశ్‌ నాగర్‌కోటి స్థానాల్లో క్రిస్‌ గ్రీన్, శివమ్‌ మావిలను తీసుకుంది. ముంబై జేమ్స్‌ ప్యాటిన్సన్‌పు పక్కనబెట్టి కూల్టర్‌నీల్‌ను తీసుకుంది.

టాప్‌–4 బ్యాట్లెత్తారు...
కోల్‌కతా టాపార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ వైఫల్యం ఇన్నింగ్స్‌ను వెంటాడింది. టాప్‌–4 బ్యాట్స్‌మెన్‌ రాహుల్‌ త్రిపాఠి (7), శుబ్‌మన్‌ గిల్‌ (21), నితీశ్‌ రాణా (5), దినేశ్‌ కార్తీక్‌ (4) ఎవరూ క్రీజులో నిలిచేందుకు ప్రయత్నించలేదు. చెత్తషాట్లకు భారీ మూల్యం చెల్లించుకున్నారు. మూడో ఓవర్లో రాహుల్‌ను బౌల్ట్‌ పెవిలియన్‌ చేర్చగా... కాసేపటికే నితీశ్‌ను కూల్టర్‌నీల్‌ ఔట్‌ చేశాడు. పవర్‌ ప్లే (6 ఓవర్లు)లో 33 పరుగులకే 2 కీలక వికెట్లను కోల్పోయింది. కోల్‌కతాకు ఈ కష్టాలు చాలవన్నట్లు స్పిన్నర్‌ రాహుల్‌ చహర్‌ రెండు వరుస బంతుల్లో శుబ్‌మన్, దినేశ్‌ కార్తీక్‌లను ఔట్‌ చేయడంతో కోల్‌కతా 42 పరుగులకే 4 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. హిట్టర్‌ రసెల్, కొత్త కెప్టెన్‌ మోర్గాన్‌ క్రీజులో ఉండగా... 9వ ఓవర్లో జట్టు స్కోరు 50 పరుగులకు చేరింది. ఓ సిక్స్, ఫోర్‌ కొట్టిన రసెల్‌ (12)కు బుమ్రా చెక్‌పెట్టాడు. దీంతో 11వ ఓవర్లోనే నైట్‌రైడర్స్‌ సగం వికెట్లను కోల్పోయింది. స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మన్‌ మోర్గాన్‌ ఒక్కడే మిగిలాడు.

ధాటిగా ఆడిన కమిన్స్‌...
అయితే ఆ స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మన్‌ ఇన్నింగ్స్‌ను నడిపించలేదు. కమిన్స్‌ మెరుపులతో కోల్‌కతా గాడిన పడింది. కూల్టర్‌నీల్‌ వేసిన 13వ ఓవర్లో కమిన్స్‌ డీప్‌ స్క్వేర్‌లో భారీ సిక్సర్‌ బాదాడు. మరో రెండు బౌండరీలు కూడా కొట్టడంతో 16 పరుగులు వచ్చాయి. స్పిన్నర్లు రాహుల్‌ చహర్, కృనాల్‌ బౌలింగ్‌కు దిగడంతో మళ్లీ పరుగుల రాక తగ్గిపోయింది. బౌల్ట్‌ వేసిన 17వ ఓవర్లో మోర్గాన్‌ ఫోర్‌తో కోల్‌కతా ఆలస్యంగా 100 పరుగులను అధిగమించింది. మరుసటి ఓవర్‌ వేసిన బుమ్రా కేవలం 5 పరుగులే ఇవ్వడంతో కోల్‌కతా 18 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లకు 113 పరుగులే చేసింది. బౌల్ట్‌ బౌలింగ్‌లో కమిన్స్‌ బ్యాట్‌ ఝులిపించాడు. వరుసగా 6, 4 బాదడంతో 14 పరుగులు వచ్చాయి. కూల్టర్‌నీల్‌ ఆఖరి ఓవర్లో బౌండరీతో కమిన్స్‌ అర్ధసెంచరీ (35 బంతుల్లో) పూర్తయ్యింది. మోర్గాన్‌ ఎట్టకేలకు బ్యాట్‌కు పనిచెప్పడంతో 2 భారీ సిక్సర్లు నమోదయ్యాయి. దీంతో 21 పరుగులు రావడంతో జట్టు స్కోరు 148 పరుగులకు చేరింది. 8వ ఓవర్లో క్రీజులోకి వచ్చిన మోర్గాన్‌ ఆఖరిదాకా అజేయంగా నిలిచినా 40 పరుగులైనా చేయలేకపోయాడు.

ఫోర్‌తో జోరు కొనసాగింపు...
ఏమంత కష్టసాధ్యంకాని లక్ష్యానికి ఓపెనర్లు రోహిత్‌ శర్మ, డికాక్‌ చక్కని ఆరంభమిచ్చారు. ఇన్నింగ్స్‌ తొలి బంతినే ఫోర్‌గా మలచిన రోహిత్‌ తర్వాత కూడా తన జోరు కొనసాగించాడు. మొదట్లో ‘హిట్‌మ్యాన్‌’ ధాటికి వెనుకబడిన డికాక్‌ దంచేందుకు ఎంతోసేపు పట్టలేదు. కమిన్స్, గ్రీన్‌ ఓవర్లలో చకచకా ఫోర్లు బాదేశాడు. ప్రత్యర్థి బౌలర్ల భరతం పట్టడంలో రోహిత్‌ను మించిపోయాడు. ముంబై 5.4 ఓవర్లలో 50 పరుగులకు చేరింది. తర్వాత ప్రసిధ్‌ కృష్ణ 7వ ఓవర్లో డికాక్‌ 2 బౌండరీలు, ఓ భారీ సిక్సర్‌ కొట్టాడు. రోహిత్‌ రెండు పదుల వద్దే తచ్చాడుతుంటే డికాక్‌ ఏకంగా 25 బంతుల్లోనే అర్ధశతకాన్ని  (8 ఫోర్లు, 2 సిక్సర్లు) సాధించాడు. కమిన్స్, రస్సెల్, ప్రసిధ్‌ కృష్ణ, గ్రీన్‌ ఇలా కోల్‌కతా కెప్టెన్‌ పదే పదే బౌలర్లను మార్చినా... డికాక్‌ జోరును ఏమార్చలేకపోయాడు. 10 ఓవర్లు ముగిసేసరికి ముంబై 9 పరుగుల రన్‌రేట్‌తో ముంబై 90 పరుగులు చేసింది. తర్వాతి ఓవర్లోనే ‘హిట్‌మ్యాన్‌’ అవుట్‌ కావడంతో 94 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యం ముగిసింది. శివమ్‌ మావి ఈ జోడీని విడగొట్టాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ (10)ను వరుణ్‌ పెవిలియన్‌ చేర్చాడు. స్వల్ప వ్యవధిలో 2 వికెట్లు పడినా... డికాక్, హార్దిక్‌ పాండ్యా (11 బంతుల్లో 21 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌) ధాటిగా ఆడటంతో ముంబై 17వ ఓవర్‌ పూర్తవకముందే లక్ష్యాన్ని ఛేదించింది.

స్కోరు వివరాలు
కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: త్రిపాఠి (సి) సూర్యకుమార్‌ (బి) బౌల్ట్‌ 7; గిల్‌ (సి) పొలార్డ్‌ (బి) రాహుల్‌ చహర్‌ 21; నితీశ్‌ రాణా (సి) డికాక్‌ (బి) కూల్టర్‌నీల్‌ 5; దినేశ్‌ కార్తీక్‌ (బి) రాహుల్‌ చహర్‌ 4; మోర్గాన్‌ (నాటౌట్‌) 39; రసెల్‌ (సి) డికాక్‌ (బి) బుమ్రా 12; కమిన్స్‌ (నాటౌట్‌) 53; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 148.  
వికెట్ల పతనం: 1–18, 2–33, 3–42, 4–42, 5–61.
బౌలింగ్‌: బౌల్ట్‌ 4–0–32–1, కూల్టర్‌నీల్‌ 4–0–51–1, బుమ్రా 4–0–22–1, కృనాల్‌ పాండ్యా 4–0–23–0, రాహుల్‌ చహర్‌ 4–0–18–2.  

ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ శర్మ (సి) దినేశ్‌ కార్తీక్‌ (బి) శివమ్‌ మావి 35; డికాక్‌ (నాటౌట్‌) 78; సూర్యకుమార్‌ యాదవ్‌ (బి) వరుణ్‌  10; హార్దిక్‌ పాండ్యా (నాటౌట్‌) 21; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (16.5 ఓవర్లలో 2 వికెట్లకు) 149.
వికెట్ల పతనం: 1–94, 2–111.
బౌలింగ్‌: క్రిస్‌ గ్రీన్‌ 2.5–0–24–0, కమిన్స్‌ 3–0–28–0, ప్రసిధ్‌ కృష్ణ 2–0–30–0, రసెల్‌ 2–0–15–0, వరుణ్‌ చక్రవర్తి 4–0–23–1, శివమ్‌ మావి 3–0–24–1.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement