కోల్‌కతాకు చెన్నై దెబ్బ | Chennai Super Kings beat Kolkata Knight Riders by 6 wickets | Sakshi
Sakshi News home page

కోల్‌కతాకు చెన్నై దెబ్బ

Published Fri, Oct 30 2020 5:06 AM | Last Updated on Fri, Oct 30 2020 5:12 AM

Chennai Super Kings beat Kolkata Knight Riders by 6 wickets - Sakshi

చెన్నై సూపర్‌ కింగ్స్‌ పోతూ పోతూ కోల్‌కతానూ లీగ్‌ నుంచే తీసుకెళ్లనుంది. మిగిలున్న రెండు మ్యాచ్‌ల్ని తప్పనిసరిగా గెలిచినా... అంతంత మాత్రమే ప్లే ఆఫ్స్‌ అవకాశాలున్న నైట్‌రైడర్స్‌పై సూపర్‌కింగ్స్‌ దెబ్బ వేసింది. ఈ మ్యాచ్‌లో రుతురాజ్‌ గైక్వాడ్‌ వీరోచితంగా పోరాడగా... జడేజా మెరుపు బ్యాటింగ్‌తో ఉత్కంఠను విజయం వైపు మార్చేశాడు. 30 పరుగులు చేయాల్సిన సమయంలో జడేజా ఒక్కడే 29 పరుగులు బాది గెలిపించాడు.  

దుబాయ్‌: ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి తప్పుకున్నాక చెన్నై ఇప్పుడు వరుసగా గెలుస్తోంది. గత మ్యాచ్‌లో బెంగళూరును చిత్తు చేసిన సూపర్‌కింగ్స్‌... తాజాగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను కోలుకోలేని దెబ్బతీసింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 172 పరుగులు చేసింది. నితీశ్‌ రాణా (61 బంతుల్లో 87; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) రాణించాడు. ఇన్‌గిడి 2 వికెట్లు తీశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన చెన్నై సూపర్‌కింగ్స్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 178 పరుగులు చేసి గెలిచింది.  ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రుతురాజ్‌ గైక్వాడ్‌ (53 బంతుల్లో 72; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెన్నై గెలిచేందుకు అవసరమైన ఇన్నింగ్స్‌ ఆడేయగా... జడేజా ఆఖర్లో సిక్సర్లతో జట్టును గెలిపించాడు. రాయుడు (20 బంతుల్లో 38; 5 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుగ్గా ఆడాడు.

రఫ్ఫాడించిన రాణా
తొలి బంతి పడగానే శుబ్‌మన్‌ గిల్‌ బౌండరీతో కోల్‌కతాకు మంచి ఆరంభమిచ్చాడు. ఆ మరుసటి బంతి కూడా లైన్‌ దాటింది. నితీశ్‌ రాణా కూడా ఓ ఫోర్‌ కొట్టడంతో ఆ ఓవర్లో 13 పరుగులొచ్చాయి. అయితే సామ్‌ కరన్, ఇన్‌గిడి కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో తర్వాత 4 ఓవర్లలో 20 పరుగులే వచ్చాయి. ఇక ఆరో ఓవర్‌ను రాణా రఫ్ఫాడించాడు. సాన్‌ట్నర్‌ బౌలింగ్‌లో వరుసగా 4, 4, 6తో 15 పరుగులు పిండుకున్నాడు. తర్వాత స్వల్ప వ్యవధిలో గిల్‌ (17 బంతుల్లో 26; 4 ఫోర్లు), సునీల్‌ నరైన్‌ (7) అవుట్‌ కావడంతో రన్‌రేట్‌ మందగించింది. కాసేపు నితీశ్‌తో జతకలిసిన రింకూ సింగ్‌ (11 బంతుల్లో 11; 1 ఫోర్‌) కూడా ఎక్కువ సేపు నిలువకపోయినా... ఉన్నంతసేపయినా ధాటిగా ఆడలేకపోయాడు. దీంతో కాస్త చూసుకొని ఆడిన నితీశ్‌ రాణా 44 బంతుల్లో (7 ఫోర్లు, 1 సిక్స్‌) ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు.  

భారీ సిక్సర్లతో...
కోల్‌కతా చేతిలో వికెట్లున్న స్కోరు ఆశించినంత వేగం అందుకోలేకపోయింది. తొలి 50 పరుగుల్ని 6.2 ఓవర్లలో చేసిన కోల్‌కతా రెండో 50 (100) పరుగులు చేసేందుకు మరో 8 ఓవర్లు పట్టింది. ఇలా ఆలస్యంగా... 15వ ఓవర్లో మూడంకెల స్కోరును అధిగమించిది. అప్పటిదాకా నింపాదిగా ఆడుతున్న నితీశ్‌ తర్వాత ఒక్కసారిగా చెలరేగాడు. చెన్నై స్పిన్నర్‌ కరణ్‌ శర్మపై భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. అతను వేసిన 16వ ఓవర్లో డీప్‌ మిడ్‌వికెట్, డీప్‌ స్క్వేర్‌లెగ్, లాంగాన్‌ల మీదుగా వరుసగా మూడు సిక్సర్లు బాదేశాడు. దీంతో ఆ ఓవర్లోనే కోల్‌కతా ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 19 పరుగులు వచ్చాయి. మరుసటి ఓవర్లోనూ రాణా దూకుడు కొనసాగింది. చెన్నై సారథి ధోని వెంటనే పేసర్‌ దీపక్‌ చహర్‌కు బంతిని అప్పగించగా... 17వ ఓవర్లో రాణా రెండు బౌండరీలు కొట్టాడు. ఇతని జోరుకు 18వ ఓవర్లో ఇన్‌గిడి బ్రేకువేయగా... ఆఖరి ఓవర్లలో  మోర్గాన్‌ (15), దినేశ్‌ కార్తీక్‌ ( 10 బంతుల్లో 21 నాటౌట్‌; 3 ఫోర్లు) బౌండరీలతో స్కోరు పెంచారు. మొదటి 15 ఓవర్లు ఆడి 106/3 స్కోరు చేసిన నైట్‌రైడర్స్‌ చివరి 5 ఓవర్లలో 66 పరుగులు చేసింది.

నడిపించిన రుతురాజ్‌
లక్ష్యఛేదనకు దిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ తొలి ఓవర్లో పరుగులు చేసేందుకు ఇబ్బందిపడ్డా... రెండో ఓవర్‌ నుంచి సిక్స్, మూడో ఓవర్లో బౌండరీలతో జోరందుకుంది. వాట్సన్‌ స్క్వేర్‌లెగ్‌ మీదుగా సిక్సర్‌ బాదగా... తర్వాత ఓవర్లో రుతురాజ్, వాట్సన్‌ చెరో ఫోర్‌ కొట్టారు. వరుణ్‌ చక్రవర్తి వేసిన ఆరో ఓవర్లో రుతురాజ్‌ లాంగాఫ్‌లో భారీ సిక్సర్‌ బాదేశాడు. పవర్‌ ప్లేలో వికెట్‌ కోల్పోకుండా చెన్నై 44 పరుగులు చేసింది. జట్టు స్కోరు 8వ ఓవర్లో 50 పరుగులకు చేరగా... అదే ఓవర్లో వాట్సన్‌ (14)ను చక్రవర్తి పెవిలియన్‌కు పంపాడు. రుతురాజ్‌కు రాయుడు జతయ్యాడు. నితీశ్‌ రాణా వేసిన పదో ఓవర్లో వరుసగా రాయుడు వరుసగా మూడు ఫోర్లు కొట్టాడు. 16 పరుగులు రావడంతో జోరు తగ్గిన చెన్నైలో జోష్‌ నింపాడు. ఆ తర్వాత ఓవర్‌ను రుతురాజ్‌ తన వంతుగా బాదేశాడు. ఫెర్గూసన్‌ బౌలింగ్‌లో 4, 6 కొట్టాడు. 37 బంతుల్లో (4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రుతురాజ్‌ ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. 12వ ఓవర్లో రాయుడు కూడా కవర్స్‌ మీదుగా భారీ సిక్సర్‌ బాదాడు. చెన్నై 100 పరుగులకు చేరుకుంది. ఇలా మెరుపులతో సాగిపోతున్న చెన్నై స్వల్పవ్యవధిలో కష్టాలెదురయ్యాయి. మొదట రాయుడు, ఆరు బంతుల తేడాతో కెప్టెన్‌ ధోని ఔటయ్యారు. చెన్నై విజయానికి 32 బంతుల్లో ఇంకా 52 పరుగులు కావాలి.

గెలిపించిన జడేజా
ఓవర్‌కు పది పరుగులు చేయాల్సిన పరిస్థితి చెన్నైది. ఇలాంటి దశలో సూపర్‌కింగ్స్‌కు వెన్నెముకగా నిలిచిన రుతురాజ్‌ గైక్వాడ్‌ కూడా ఔట్‌ కావడంతో చెన్నై శిబిరంలో కలవరం మొదలైంది. రవీంద్ర జడేజా క్రీజులోకి రాగా ఆఖరి 12 బంతుల్లో 30 పరుగులు చేయాలి. 19వ ఓవర్‌ వేసిన ఫెర్గూసన్‌ లయతప్పాడు. దీన్ని అనువుగా మలచుకున్న జడేజా రెచ్చిపోయాడు. 4, 3, 6, 4 చకచకా పరుగులు జతచేశాడు. వైడ్, నోబాల్‌తోకలిపి ఫెర్గూసన్‌ 20 పరుగులిచ్చాడు. ఆట ఆఖరి ఓవర్‌కు చేరింది. చెన్నై 10 పరుగులు చేయాల్సివుండగా... కమలేశ్‌ నాగర్‌కోటి 0, 2, 1, 0 డాట్‌ బాల్స్‌తో ఒత్తిడి పెంచాడు. 2 బంతుల్లో 7 పరుగులు చేయాల్సిన దశలో కాస్త ఉత్కంఠ రేగినా... జడేజా డీప్‌ మిడ్‌ వికెట్‌ మీదుగా సిక్స్‌ బాదేశాడు. ఇక బంతి మిగలగా పరుగు చేస్తే సరిపోతుంది. కానీ దీన్ని కూడా జడేజా లాంగాన్‌ మీదుగా సిక్సర్‌ బాదేయడంతో చెన్నై గెలిచి కోల్‌కతాను ముంచింది. తాజా ఫలితంతో ఇప్పుడు అధికారికంగా ముంబై ఇండియన్స్‌ ‘ప్లే ఆఫ్స్‌’కు చేరింది. మరోవైపు కోల్‌కతా ప్లే ఆఫ్స్‌ అవకాశాలు దాదాపుగా కోల్పోయినట్లే!  

స్కోరు వివరాలు
కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: గిల్‌ (బి) కరణ్‌ శర్మ 26; నితీశ్‌ రాణా (సి) స్యామ్‌ కరన్‌ (బి) ఇన్‌గిడి 87; నరైన్‌ (సి) జడేజా (బి) సాన్‌ట్నర్‌ 7; రింకూ సింగ్‌ (సి) రాయుడు (బి) జడేజా 11; మోర్గాన్‌ (సి) రుతురాజ్‌ (బి) ఇన్‌గిడి 15; దినేశ్‌ కార్తీక్‌ (నాటౌట్‌) 21; రాహుల్‌ త్రిపాఠి (నాటౌట్‌) 3; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 172.
వికెట్ల పతనం: 1–53, 2–60, 3–93, 4–137, 5–167.
బౌలింగ్‌: దీపక్‌ చహర్‌ 3–0–31–0, స్యామ్‌ కరన్‌ 3–0–21–0, ఇన్‌గిడి 4–0–34–2, సాన్‌ట్నర్‌ 3–0–30–1, జడేజా 3–0–20–1, కరణ్‌ శర్మ 4–0–35–1.  

చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: వాట్సన్‌ (సి) రింకూ (బి) వరుణ్‌ 14; రుతురాజ్‌ (బి) కమిన్స్‌ 72; రాయుడు (సి) నరైన్‌ (బి) కమిన్స్‌ 38; ధోని (బి) వరుణ్‌ 1; స్యామ్‌ కరన్‌ (నాటౌ ట్‌) 13; జడేజా (నాటౌట్‌) 31; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 178.  
వికెట్ల పతనం: 1–50, 2–118, 3–121, 4–140. 
బౌలింగ్‌: కమిన్స్‌ 4–0–31–2, నాగర్‌కోటి 3–0–34–0, నరైన్‌ 4–0–23–0, ఫెర్గూసన్‌ 4–0–54–0, వరుణ్‌ 4–0–20–2, నితీశ్‌ రాణా 1–0–16–0.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement