మ్యాచ్‌లో విజయానికి 17 బంతుల్లో 21 పరుగులు కావాలి... చేతిలో 9 వికెట్లు ఉన్నాయి...ఇలాంటి స్థితిలో ఎంత బలహీన జట్టయినా గెలుపును అందుకుంటుంది. కానీ అలా చేయగలిగితే అది కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఎందుకవుతుంది.. గత మ్యాచ్‌లాగే పేలవ బ్యాటింగ్‌లో తడబడిన టీమ్ చివరకు 18 పరుగులు మాత్రమే చేసి ఓట మిని ఆహ్వానించింది. మరోసారి అతి జాగ్రత్తకు పోయిన కెప్టెన్ రాహుల్ క్రీజ్‌లో ఉన్నా, పంజా బ్‌కు పరాజయం తప్పలేదు. బ్యాటింగ్‌లో మెరుపు ప్రదర్శన కనబర్చిన కెప్టెన్ దినేశ్ కార్తీక్ కెప్టెన్సీలో కూడా ప్రత్యేకత కనబర్చడంతో నైట్‌రైడర్స్ చివరి క్షణాల్లో మరో విజయాన్ని అందుకుంది. మ్యాచ్ ఆఖరి బంతికి సిక్సర్ కొడితే స్కోరు సమమయ్యే అవకాశం ఉండగా మ్యాక్స్‌వెల్ కొట్టిన షాట్ బౌండరీకి రెండంగుళాలు ముందు పడి ఫోర్‌గా మారడంతో పంజాబ్‌కు ఓటమి తప్పలేదు.
అబుదాబి: వరుసగా రెండో మ్యాచ్‌లోనూ తక్కువ లక్ష్యాన్ని కాపాడుకుంటూ కోల్‌కతా నైట్‌రైడర్స్ సత్తా చాటింది. శనివారం పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 2 పరుగులతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 164 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కెప్టెన్ దినేశ్ కార్తీక్ (29 బంతుల్లో 58; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు అర్ధ సెంచరీ సాధించాడు. శుబ్‌మన్ గిల్ (47 బంతుల్లో 57; 5 ఫోర్లు) ఆకట్టుకున్నాడు. అనంతరం పంజాబ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 162 పరుగులు చేసి ఓడిపోయింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (58 బంతుల్లో 74; 6 ఫోర్లు), మయాంక్ (39 బంతుల్లో 56; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించారు.
సూపర్ కార్తీక్
పవర్ ప్లేలో 25/1... 10 ఓవర్లలో 60/2... 15 ఓవర్లకు 101/3. ఈ స్కోరు చూస్తే ఎవరికైనా కోల్‌కతా ఇన్నింగ్స్ ఎంత నెమ్మదిగా సాగిందో అర్థమవుతోంది. 150 పరుగులు దాటితే అదే గొప్ప అని భావించారంతా. కానీ కెప్టెన్ దినేశ్ కార్తీక్ ధాటికి చివరి 30 బంతుల్లో 63 పరుగులు సాధించిన కోల్‌కతా ప్రత్యర్థికి మంచి లక్ష్యాన్ని నిర్దేశించింది. కోల్‌కతా ఇన్నింగ్స్‌లో కార్తీక్ ఆటే హైలైట్. గత మ్యాచ్ హీరో రాహుల్ త్రిపాఠి (4), రాణా (2), మోర్గాన్ (23 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్), రసెల్ (5) వేగంగా పరుగులు చేయడంలో విఫలమైన వేళ.. కార్తీక్ స్వేచ్ఛగా ఆడాడు. జట్టు స్కోరు 63/3 వద్ద క్రీజులోకి వచ్చిన అతను... అప్పటికే క్రీజులో కుదురుకున్న గిల్‌కు అవకాశమిస్తూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాడు. ఈ క్రమంలో గిల్ 42 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. మరోవైపు అర్‡్షదీప్ వేసిన 16వ ఓవర్‌లో మూడు బౌండరీలతో కార్తీక్ దూకుడు పెంచాడు. అదే ఊపులో వరుసగా 4, 6, 4 బాది జోర్డాన్ బౌలింగ్‌లో 18 పరుగులు రాబట్టాడు. షమీ వేసిన మరుసటి ఓవర్‌లోనే వరుసగా రెండు ఫోర్లు బాదిన కార్తీక్ 22 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. వెంటనే గిల్ రనౌట్‌గా వెనుదిరగడంతో నాలుగో వికెట్‌కు 82 పరుగుల భాగస్వామ్యం ముగిసింది.
మారని తీరు...
మొదట్లో ప్రశాంతంగా సాగిన పంజాబ్ ఇన్నింగ్స్ చివర్లో బోల్తా కొట్టింది. ఎలాగైనా జట్టును గెలిపించేందుకు బరిలోకి దిగిన రాహుల్ రెండో ఓవర్‌లోనే ఔటయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్నాడు. దీన్ని సద్వినియోగం చేసుకున్న అతను అడపాదడపా బౌండరీలు బాదుతూ ఇన్నింగ్స్ నడిపించాడు. మరోవైపు మయాంక్ ధాటిగా ఆడాడు. ప్రసిధ్ బౌలింగ్‌లో సిక్స్‌తో సహా రెండు ఫోర్లు బాదిన మయాంక్... కమలేశ్ ఓవర్‌లో వరుసగా రెండు బౌండరీలతో జోరు పెంచాడు. కమిన్స్ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లతో రాహుల్ 42 బంతుల్లో అర్ధసెంచరీ అందుకోగా... మయాంక్ 33 బంతుల్లో ఈ ఫీట్‌ను సాధించాడు.తొలి వికెట్‌కు 115 పరుగుల్ని జోడించిన ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ పంజాబ్‌ను పటిష్ట స్థితిలో నిలిపారు. 34 బంతుల్లో 50 పరుగులు చేయాల్సిన స్థితిలో మయాంక్ ఔటయ్యాడు. చేతిలో ఇంకా 9 వికెట్లుండటంతో పంజాబ్ విజయం దాదాపు ఖాయంగానే తోచింది. కానీ తర్వాతే ఇన్నింగ్స్ తడబడింది. నరైన్ బంతికి పూరన్ (16) క్లీన్‌బౌల్డ్ కావడంతో పతనం ప్రారంభమైంది.
స్కోరు వివరాలు
కోల్‌కతా నైట్ రైడర్స్ ఇన్నింగ్స్: రాహుల్ త్రిపాఠి (బి) షమీ 4; గిల్ (రనౌట్) 57; రాణా (రనౌట్) 2; మోర్గాన్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) బిష్ణోయ్ 24; కార్తీక్ (రనౌట్) 58; రసెల్ (సి) ప్రభ్ సిమ్రన్ (బి) అర్‡్షదీప్ 5; కమిన్స్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 164.
వికెట్ల పతనం: 1–12, 2–14, 3–63, 4–145, 5–150, 6–164.
బౌలింగ్: షమీ 4–0–30–1, అర్‡్షదీప్ 4–1–25–1, జోర్డాన్ 4–0–37–0, ముజీబ్ 4–0–44–0, బిష్ణోయ్ 4–0–25–1.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: రాహుల్ (బి) ప్రసిధ్ 74; మయాంక్ (సి) గిల్ (బి) ప్రసి«ధ్ 56; పూరన్ (బి) నరైన్ 16; ప్రభ్ సిమ్రన్ (సి) రాణా (బి) ప్రసిధ్ 4; మ్యాక్స్‌వెల్ (నాటౌట్) 10; మన్‌దీప్ (సి) (సబ్) గ్రీన్ (బి) నరైన్ 0; జోర్డాన్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 162.
వికెట్ల పతనం: 1–115, 2–144, 3–149, 4–151, 5–158.
బౌలింగ్: కమిన్స్ 4–0–29–0, ప్రసి«ధ్ 4–0–29–3, కమలేశ్ 3–0–40–0, వరుణ్ 4–0–27–0, నరైన్ 4–0–28–2, రాణా 1–0–7–0.
నరైన్ బౌలింగ్‌పై సందేహాలు!
కోల్‌కతా జట్టుకు కొత్త సమస్య వచ్చి పడింది! పంజాబ్‌తో మ్యాచ్‌ను గెలిపించిన జట్టు స్పిన్నర్ సునీల్ నరైన్ బౌలింగ్ యాక్షన్‌పై ఫీల్డ్ అంపైర్లు సందేహం వ్యక్తం చేశారు. అతని బౌలింగ్ సందేహాస్పదంగా, నిబంధనలకు విరుద్ధంగా ఉందని వారు నివేదిక ఇచ్చారు. అయితే ప్రస్తుతానికి అతనిపై ఎలాంటి చర్య తీసుకోవడం లేదు. ఐపీఎల్‌లో నరైన్ బౌలింగ్‌ను కొనసాగించవచ్చని, మరో సారి యాక్షన్‌పై సందేహం వ్యక్తం చేస్తే సస్పెండ్ చేస్తామని గవర్నింగ్ కౌన్సిల్ ప్రకటించింది.
పరాజయం పిలిచింది...
Published Sun, Oct 11 2020 5:13 AM | Last Updated on Sun, Oct 11 2020 5:13 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment