విజయ్ శంకర్‌ను అవుట్ చేసిన ఆనందంలో అర్ష్‌దీప్
విజయలక్ష్యం 127 పరుగులు... స్కోరు 100/3... మరో 24 బంతుల్లో 27 పరుగులు చేస్తే చాలు... కానీ ఇలాంటి స్థితి నుంచి కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ పరాజయాన్ని వెతుక్కుంటూ వెళ్లింది. 23 బంతుల్లో మిగిలిన 7 వికెట్లు చేజార్చుకొని కుప్పకూలింది. కట్టుదిట్టమైన బౌలింగ్, చక్కటి ఫీల్డింగ్‌కు తోడు ఓటమిని అంగీకరించని తత్వం, పట్టుదలతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అనూహ్య విజయాన్ని అందుకుంది. ఈ సీజన్‌లో అనేక మ్యాచ్‌లలో చివరి క్షణం వరకు తీవ్ర ఉత్కంఠను అనుభవించిన రాహుల్ సేన కీలక సమయంలో ఒత్తిడిని తట్టుకొని సగర్వంగా నిలబడింది. ఓటమి ఖాయమైన మ్యాచ్‌ను గెలుచుకొని సత్తా చాటింది. తాజా ఫలితం సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలను బాగా దెబ్బ తీసింది.
దుబాయ్: ఐపీఎల్–2020లో మరో అనూహ్య ఫలితం... గెలవాల్సిన స్థితిలో ఉండి కూడా హైదరాబాద్ జట్టు చేజేతులా ఓటమిని ఆహ్వానించింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 12 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 126 పరుగులే చేయగలిగింది.
నికోలస్ పూరన్ (28 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రషీద్ ఖాన్ (2/14) కింగ్స్ ఎలెవన్ బ్యాట్స్‌మెన్ పని పట్టగా... హోల్డర్, సందీప్ కూడా చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ 19.5 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌటైంది. డేవిడ్ వార్నర్ (20 బంతుల్లో 35; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒక్కడే దూకుడుగా ఆడాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ క్రిస్ జోర్డాన్ (3/17), అర్‡్షదీప్ సింగ్ (3/23) పంజాబ్ గెలుపులో కీలక పాత్ర పోషించారు.
అందరూ అందరే...
తొలి బంతి నుంచి చివరి బంతి వరకు పంజాబ్ ఇన్నింగ్స్ పేలవంగా సాగింది. సన్‌రైజర్స్ కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు జట్టు బ్యాట్స్‌మెన్ తేలిపోయారు. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (27 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్), మన్‌దీప్ సింగ్ (17) దూకుడుగా ఆడటంలో విఫలమయ్యారు. ఫలితంగా ఈ జోడి తొలి వికెట్‌కు 30 బంతుల్లో 37 పరుగులే జోడించగలిగింది. సందీప్ బౌలింగ్‌లో మన్‌దీప్ వెనుదిరగ్గా, పవర్‌ప్లేలో స్కోరు 47 పరుగులకు చేరింది. అయితే 66 పరుగుల వద్ద పంజాబ్‌కు అసలు దెబ్బ పడింది.
వరుస బంతుల్లో గేల్ (20 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్), రాహుల్ అవుట్ కావడంతో జట్టు పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఎప్పటిలాగే మ్యాక్స్‌వెల్ (12) విఫలం కాగా, దీపక్ హుడా (0) నిలబడలేకపోయాడు. మరో ఎండ్‌లో ఉన్న పూరన్ మాత్రం కాస్త పోరాడే ప్రయత్నం చేసినా అతని బ్యాటింగ్‌లో కూడా ధాటి లోపించింది. తొలి పది ఓవర్లలో 66 పరుగులు చేసిన పంజాబ్, తర్వాతి పది ఓవర్లలో 60 పరుగులే చేయగలిగింది. జట్టు ఇన్నింగ్స్‌లో మొత్తం 7 ఫోర్లు, 2 సిక్సర్లు మాత్రమే ఉన్నాయి.
75 బంతులు... బౌండరీనే లేదు!
పంజాబ్ పస లేని బ్యాటింగ్‌కు ఇదో ఉదాహరణ. 120 బంతుల ఇన్నింగ్స్‌లో ఒకదశలో వరుసగా 75 బంతుల పాటు (12.3 ఓవర్లు) బ్యాట్స్‌మెన్ ఒక్క ఫోర్ కూడా కొట్టలేకపోయారు. హోల్డర్ వేసిన ఆరో ఓవర్ చివరి బంతికి గేల్ ఫోర్ కొట్టగా... ఖలీల్ వేసిన 19వ ఓవర్ మూడో బంతికి పూరన్ ఫోర్ కొట్టాడు. జట్టు ఇన్నింగ్స్‌లో ఒక్క పరుగు చేయని డాట్ బంతులు మొత్తం 48 ఉన్నాయి!
నాన్న చనిపోయినా...
పంజాబ్ ఓపెనర్ మన్‌దీప్ భారమైన హృదయంతో మ్యాచ్ ఆడాడు. అతని తండ్రి శుక్రవారమే చనిపోయారు. అయితే స్వస్థలం కూడా వెళ్లలేని స్థితిలో మన్‌దీప్ కొనసాగాడు. ఈ నేపథ్యంలో పంజాబ్ ఆటగాళ్లు నల్లరంగు రిబ్బన్లు ధరించి బరిలోకి దిగారు. గత మ్యాచ్‌లో గాయపడిన మయాంక్ స్థానంలో మన్‌దీప్ జట్టులోకి వచ్చాడు.
వార్నర్ జోరు...
స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వార్నర్, బెయిర్‌స్టో (20 బంతుల్లో 19; 4 ఫోర్లు) జట్టుకు శుభారంభం అందించారు. పంజాబ్‌తో ఆడిన గత 9 మ్యాచ్‌లలో వరుసగా ప్రతీసారి అర్ధ సెంచరీ చేసిన అద్భుత రికార్డు ఉన్న వార్నర్ ఇప్పుడు కూడా అదే జోరును ప్రదర్శించాడు. తొలి రెండు ఓవర్లలో ఒక్కో సిక్స్ కొట్టిన అతను, షమీ ఓవర్లో మరో రెండు ఫోర్లు బాదాడు. అయితే బిష్ణోయ్ బౌలింగ్‌లో రివర్స్‌స్వీప్‌కు ప్రయత్నించి కీపర్‌కు క్యాచ్ ఇవ్వడంతో అతను పదో హాఫ్ సెంచరీ అవకాశం కోల్పోయాడు. మరో రెండు పరుగులకే బెయిర్‌స్టో కూడా అవుట్ కాగా, సమద్ (7) విఫలమయ్యాడు. ఈ దశలో మనీశ్ పాండే (29 బంతుల్లో 15), విజయ్ శంకర్ (27 బంతుల్లో 26; 4 ఫోర్లు) కలిసి జట్టును విజయం దిశగా నడిపించారు. మరీ నెమ్మదిగా ఆడి 33 పరుగులు జోడించేందుకు 44 బంతు లు తీసుకున్నారు. గత మ్యాచ్‌లో చెలరేగిన పాండే అయితే ఒక్కో పరుగు కోసం తంటాలు పడ్డాడు. చివరకు భారీ షాట్‌కు యత్నించి అవుటయ్యాడు.
స్కోరు వివరాలు
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: రాహుల్ (బి) రషీద్ 27; మన్‌దీప్ (సి) రషీద్ (బి) సందీప్ 17; గేల్ (సి) వార్నర్ (బి) హోల్డర్ 20; పూరన్ (నాటౌట్) 32; మ్యాక్స్‌వెల్ (సి) వార్నర్ (బి) సందీప్ 12; దీపక్ హుడా (స్టంప్డ్) బెయిర్‌స్టో (బి) రషీద్ 0; జోర్డాన్ (సి) ఖలీల్ (బి) హోల్డర్ 7; మురుగన్ అశ్విన్ (రనౌట్) 4; రవి బిష్ణోయ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 126.
వికెట్ల పతనం: 1–37; 2–66; 3–66; 4–85; 5–88; 6–105; 7–110.
బౌలింగ్: సందీప్ శర్మ 4–0–29–2; ఖలీల్ 4–0–31–0; హోల్డర్ 4–0–27–2; రషీద్ ఖాన్ 4–0–14–2; నటరాజన్ 4–0–23–0.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) రాహుల్ (బి) బిష్ణోయ్ 35; బెయిర్‌స్టో (బి) అశ్విన్ 19; పాండే (సి) (సబ్) సుచిత్ (బి) జోర్డాన్ 15; సమద్ (సి) జోర్డాన్ (బి) షమీ 7; శంకర్ (సి) రాహుల్ (బి) అర్‡్షదీప్ 26; హోల్డర్ (సి) మన్‌దీప్ (బి) జోర్డాన్ 5; గార్గ్ (సి) జోర్డాన్ (బి) అర్‡్షదీప్ 3; రషీద్ (సి) పూరన్ (బి) జోర్డాన్ 0; సందీప్ (సి) అశ్విన్ (బి) అర్‡్షదీప్ 0; నటరాజన్ (నాటౌట్) 0; ఖలీల్ (రనౌట్) 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (19.5 ఓవర్లలో ఆలౌట్) 114.
వికెట్ల పతనం: 1–56; 2–58; 3–67; 4–100; 5–110; 6–112; 7–112; 8–114; 9–114; 10–114.
బౌలింగ్: షమీ 4–0–34–1; అర్‡్షదీప్ 3.5–0–23–3; అశ్విన్ 4–0–27–1; బిష్ణోయ్ 4–0–13–1; జోర్డాన్ 4–0–17–3.
టర్నింగ్ పాయింట్...
17వ ఓవర్ తొలి బంతికి జోర్డాన్ బౌలింగ్‌లో పాండే అవుట్ కావడంతో రైజర్స్ పతనం మొదలైంది. సబ్‌స్టిట్యూట్ సుచిత్ బౌండరీ లైన్ వద్ద గాల్లో లేచి అద్భుతంగా క్యాచ్ పట్టాడు. తర్వాతి ఓవర్లో శంకర్ వెనుదిరగ్గా, 19వ ఓవర్లో రెండు, 20వ ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయిన జట్టు ఓటమిని ఖాయం చేసుకుంది.
జోర్డాన్, బౌండరీ లైన్ వద్ద గాల్లోకి ఎగిరి పాండే క్యాచ్ పట్టిన సుచిత్
Comments
Please login to add a commentAdd a comment