పంజాబ్ జట్టు సారథి కేఎల్ రాహుల్(ట్విటర్ ఫొటో)
న్యూఢిల్లీ: ఐపీఎల్ 2020 సీజన్‌లో భాగంగా తొలిసారిగా కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన కేఎల్ రాహుల్ తన బాధ్యతను సమర్థవంతంగా నెరవేర్చాడు. తొలుత వరుస వైఫల్యాలతో డీలా పడిన జట్టును.. ప్లే ఆఫ్స్ దిశగా దూసుకుపోయేలా ముందుండి నడిపించాడు. అయితే చివరి రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలు కావడంతో పంజాబ్ లీగ్ దశలోనే వెనుదిరిగినప్పటికీ అభిమానుల మనసు గెలుచుకుంది. సీజన్ మొదటి అర్ధభాగంలో కేవలం ఒకే ఒక్క విజయం సాధించిన పంజాబ్ జట్టు.. ఊహించలేని విధంగా వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో గెలిచి సత్తా చాటింది. ఈ నేపథ్యంలో వ్యక్తిగతంగా అద్భుత ప్రదర్శన కనబరిచిన కేఎల్ రాహుల్ .. సారథిగానూ మంచి మార్కులే కొట్టేశాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. (చదవండి: కోట్లు పెట్టి కొన్నాం, వదిలించుకోక తప్పదు!)
అదే విధంగా ఈ సీజన్‌లో 14 మ్యాచుల్లో 55.83 సగటుతో 670 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్‌ను గెల్చుకున్న ఈ కర్ణాటక బ్యాటర్‌పై ప్రశంసలు వెల్లువెత్తాయి. కాగా టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా మాత్రం కేఎల్ రాహుల్ పూర్తిస్థాయిలో తన సామర్థ్యాన్ని వినియోగించుకోలేదని అభిప్రాయపడ్డాడు. కెప్టెన్‌గా అతడికి పదికి ఏడున్నర మార్కులు వేస్తానని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కెప్టెన్ కేఎల్ రాహుల్ నాయకత్వ లక్షణాలపై తన యూట్యూబ్ చానెల్ వేదికగా స్పందిస్తూ.. ‘‘రాహుల్ కెప్టెన్సీ అద్భుతమని చెప్పలేను. అలాగని మరీ అంత బాగాలేదని చెప్పలేను. 50-50గా ఉంది.
జట్టు వైఫల్యాలకు కెప్టెన్ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. మెరుగైన ప్రదర్శన కనబరిచే జట్టు(పదకొండు మందిని)ను ఎంచుకోవడంలో అతడు తడబడ్డాడు. ఎంపికలో యాజమాన్య నిర్ణయం కూడా ఉంటుందని తెలుసు. అయితే రాహుల్ కూడా తన మార్కు చూపాల్సింది. ఏదేమైనా ఈ సీజన్‌లో రాహుల్ బాగానే ఆకట్టుకున్నాడు. అయితే సారథిగా తను ఇంకొంత మెరుగవ్వాల్సి ఉందనేది నా అభిప్రాయం. ఈ విషయంలో అతడికి నేను 10కి 7.5 మార్కులు ఇస్తున్నా’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.(కోహ్లిపై ట్రోలింగ్.. ఆర్సీబీ వివరణ)
Comments
Please login to add a commentAdd a comment