హైదరాబాద్ చావోరేవో తేల్చుకుంది. రాజస్తాన్‌ను బంతితో ఉక్కిరి బిక్కిరి చేసింది. బ్యాట్‌తో చకచకా పరుగులు జతచేసింది. ముఖ్యంగా మనీశ్ పాండే ఆట నిజంగా హైలైట్సే! ఆరంభంలోనే స్టార్ ఓపెనర్ల (వార్నర్, బెయిర్‌స్టో)ను కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో ఉన్న దశలో మనీశ్ సిక్సర్లతో శివతాండవం చేశాడు. ఇన్నింగ్స్ ఆసాంతం అతని మెరుపులు...విజయ్ శంకర్‌తో కలిసి జోడించిన పరుగులు రాజస్తాన్‌ను చిత్తు చేశాయి.
దుబాయ్: ఓడితే ముందడుగు కష్టమయ్యే పరిస్థితుల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ శ్రమించింది. ముందు బౌలింగ్‌తో తర్వాత మెరుపు బ్యాటింగ్‌తో ప్రత్యర్థిని చిత్తు చేసింది. గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 8 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌పై జయభేరి మోగించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసింది. సంజూ సామ్సన్ (26 బంతుల్లో 36; 3 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడాడు.
హోల్డర్ 3 వికెట్లు తీశాడు. తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసి గెలిచింది. మనీశ్ పాండే (47 బంతుల్లో 83 నాటౌట్; 4 ఫోర్లు, 8 సిక్స్‌లు) సిక్సర్ల జడివాన కురిపించాడు. విజయ్ శంకర్ (51 బంతుల్లో 52 నాటౌట్; 6 ఫోర్లు) రాణించాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 93 బంతుల్లోనే అభేద్యంగా 140 పరుగులు జత చేశారు. సన్‌రైజర్స్ జట్టులో గాయపడిన కేన్ విలియమ్సన్, బాసిల్ తంపి స్థానాల్లో హోల్డర్, నదీమ్‌లను తీసుకుంది.
చప్పగా సాగిన రాజస్తాన్ ఇన్నింగ్స్
ఇకపై ఆడే మ్యాచ్‌లన్నీ గెలిచి తీరాల్సిన స్థితిలో రాజస్తాన్ రాయల్స్ బాధ్యత విస్మరించింది. ముందు బ్యాటింగ్‌కు దిగిన రాయల్స్ బ్యాట్స్‌మెన్‌లో ఆ నిర్లక్ష్యం కనబడింది. రెండు ఫోర్లు, ఓ సిక్స్ కొట్టిన ఓపెనర్ రాబిన్ ఉతప్ప (19) రనౌటయ్యాడు. మరో ఓపెనర్ స్టోక్స్ (32 బంతుల్లో 30; 2 ఫోర్లు) చేసిన పరుగుల కంటే ఆడిన బంతులే ఎక్కువ. ఇతను, సంజూ సామ్సన్ చాలా సేపే క్రీజులో ఉన్నా... అప్పటికీ చేతిలో 9 వికెట్లున్నా... పెద్దగా బ్యాట్‌కు పనిచెప్పలేదు.
దీంతో 8.1 ఓవర్ల పాటు క్రీజులో ఉన్న ఈ జోడీ కొట్టింది మూడే బౌండరీలు... సిక్సయితే ఒక్కటే! నింపాదిగా సాగిన వీరిద్దరి ఆట రాజస్తాన్ ఇన్నింగ్స్‌కు ఏమాత్రం అక్కరకు రాకుండా పోయింది. ఇదే అదనుగా కట్టుదిట్టమైన బౌలింగ్‌తో హైదరాబాద్ పట్టు బిగించింది. సామ్సన్‌ను హోల్డర్, స్టోక్స్‌ను రషీద్ ఖాన్ వరుస ఓవర్లలో పెవిలియన్ చేర్చారు. ఆ తర్వాత బట్లర్ (9), కెప్టెన్ స్మిత్ (19) వచ్చినా రాజస్తాన్ రాత మార్చలేకపోయారు. స్మిత్‌ను, కాస్తోకూస్తో మెరిపించిన రియాన్ పరాగ్ (12 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్)ను కూడా హోల్డరే ఔట్ చేశాడు. ఆఖర్లో ఆర్చర్ (7 బంతుల్లో 16 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) కొట్టిన సిక్స్ ఫోర్‌తో రాయల్స్ 150 పరుగులు దాటగలిగింది.
ఆరంభానికి ఆర్చర్ తూట్లు
ఏమంత కష్టసాధ్యం కానీ లక్ష్యమే అయినా... హైదరాబాద్ తడబడింది. రాయల్స్ పేసర్ ఆర్చర్ నిప్పులు చెరిగే బౌలింగ్‌తో సన్‌రైజర్స్ ఆరంభానికి తూట్లు పొడిచాడు. వరుస ఓవర్లలో డాషింగ్ ఓపెనర్లిద్దరినీ ఔట్ చేయడంతో హైదరాబాద్ ఆత్మరక్షణలో పడింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన ఆర్చర్ నాలుగో బంతికి వార్నర్ (4)ను అవుట్ చేశాడు. తన మరుసటి ఓవర్లో (ఇన్నింగ్స్ 3వ) బెయిర్‌స్టో (10)ను బౌల్డ్ చేశాడు. 16 పరుగులకే 2 వికెట్లు కోల్పోవడంతో రాజస్తాన్ శిబిరంలో ఉత్సాహం ఒక్కసారిగా ఉరకలెత్తింది.
భారీ భాగస్వామ్యం...
అయితే రాయల్స్ ఆనందం అంతలోనే ఆవిరైంది. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన మనీశ్‌పాండే ప్రత్యర్థి బౌలర్లపై సిక్సర పిడుగులతో చెలరేగాడు. కార్తీక్ త్యాగి తొలి ఓవర్లో రెండు బౌండరీలు బాదిన పాండే... స్టోక్స్ వేసిన వరుసటి ఓవర్లో డీప్ స్క్వేర్ లెగ్, మిడ్ వికెట్‌ల మీదుగా రెండు సిక్సర్లు కొట్టాడు. మరో ఎండ్‌లో విజయ్ శంకర్ నింపాదిగా అడుతూ పాండేకు అండగా నిలిచాడు. అంతటితో ఆగని మనీశ్... త్యాగి మళ్లీ బంతి బౌలింగ్‌కు దిగితే తను మళ్లీ భారీ షాట్లు బాదాడు. ఒక ఫోర్, 2 సిక్సర్లు కొట్టడంతో ఆ ఓవర్లో 18 పరుగులు వచ్చాయి.
5.4 ఓవర్లలో హైదరాబాద్ స్కోరు 50 దాటేసింది. తర్వాత కాసేపటికే శ్రేయస్ గోపాల్ ఓవర్లో పాండే మరో సిక్స్ బాదాడు. 28 బంతుల్లో తనూ ఫిఫ్టీ (3 ఫోర్లు, 5 సిక్సర్లు) పూర్తి చేసుకున్నాడు. విజయ్ శంకర్ కూడా అడపాదడపా బౌండరీలు కొట్టడంతో హైదరాబాద్ స్కోరు, జోరు ఏమాత్రం తగ్గలేదు. 12.3 ఓవర్లలోనే సన్ 100 పరుగులను చేరుకుంది. వీరిద్దరి భాగస్వామ్యం ఇలాగే దూసుకెళ్లడంతో సమీకరణం సులువైంది. ఆఖరి 30 బంతుల్లో 37 పరుగులే చేయాలి.
ఈ దశలో 16వ ఓవర్ వేసిన ఆర్చర్ బౌలింగ్‌లో శంకర్ వరుసగా మూడు ఫోర్లు కొట్టాడు. ఈ ఓవర్లో 13 పరుగులు రావడంతో మిగిలిన నాలుగు ఓవర్లలో బంతికో పరుగు చేసేలా మారిపోయింది. మనీశ్ ఓవర్‌కో సిక్స్ బాదడంతో 11 బంతులు మిగిలుండగానే హైదరాబాద్ గెలిచింది. పాండే, శంకర్ అబేధ్యమైన మూడో వికెట్‌కు 140 పరుగులు జోడించడం విశేషం. సన్‌రైజర్స్ తరఫున గతంలో పలు శతక భాగస్వామ్యాలు ఉన్నాయి. కానీ విదేశీ ఆటగాడి ప్రమేయం లేకుండా... ఇద్దరు భారత ఆటగాళ్లే కలిసి వంద పరుగులకు పైగా భాగస్వామ్యం నమోదు చేయడం మాత్రం ఇదే తొలిసారి.
స్కోరు వివరాలు
రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: ఉతప్ప (రనౌట్) 19; స్టోక్స్ (బి) రషీద్ ఖాన్ 30; సామ్సన్ (బి) హోల్డర్ 36; బట్లర్ (సి) నదీమ్ (బి) శంకర్ 9; స్మిత్ (సి) మనీశ్ పాండే (బి) హోల్డర్ 19; పరాగ్ (సి) వార్నర్ (బి) హోల్డర్ 20; తేవటియా (నాటౌట్) 2; ఆర్చర్ (నాటౌట్) 16; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 154.
వికెట్ల పతనం: 1–30, 2–86, 3–86, 4–110, 5–134, 6–135.
బౌలింగ్: సందీప్ శర్మ 4–0–31–0, హోల్డర్ 4–0–33–3, శంకర్ 3–0–15–1, నటరాజన్ 4–0–46–0, రషీద్ 4–0–20–1, నదీమ్ 1–0–9–0.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) స్టోక్స్ (బి) ఆర్చర్ 4; బెయిర్‌స్టో (బి) ఆర్చర్ 10; మనీశ్ పాండే (నాటౌట్) 83; విజయ్ శంకర్ (నాటౌట్) 52; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (18.1 ఓవర్లలో 2 వికెట్లకు) 156.
వికెట్ల పతనం: 1–4, 2–16.
బౌలింగ్: ఆర్చర్ 4–0–21–2, అంకిత్ రాజ్‌పుత్ 1–0–11–0, కార్తీక్ త్యాగి 3.1–0–42–0, స్టోక్స్ 2–0–24–0, గోపాల్ 4–0–32–0, తేవటియా 4–0–25–0.
హోల్డర్‌కు సహచరుల అభినందన
Comments
Please login to add a commentAdd a comment