రాయల్స్‌ రైజింగ్‌.. | Rajasthan Royals beat Sunrisers Hyderabad by 5 wickets | Sakshi
Sakshi News home page

రాయల్స్‌ రైజింగ్‌..

Published Mon, Oct 12 2020 4:37 AM | Last Updated on Mon, Oct 12 2020 8:52 AM

Rajasthan Royals beat Sunrisers Hyderabad by 5 wickets - Sakshi

12 ఓవర్లు ముగిసేసరికి రాయల్స్‌ స్కోరు 78/5. మేటి బ్యాట్స్‌మెన్‌ అందరూ పెవిలియన్‌ చేరుకున్నారు. దాంతో రాజస్తాన్‌ ఓటమి ఖాయంగానే కనిపించింది. స్వల్ప లక్ష్యాల్ని కాచుకునే సన్‌రైజర్స్‌ బౌలింగ్‌ దళం ముందర మిగతా రాయల్స్‌ బ్యాట్స్‌మెన్‌ ఏం నిలుస్తారులే అనుకున్నారంతా. కానీ రాహుల్‌ తేవటియా, రియాన్‌ పరాగ్‌ అందరి అంచనాలను తల్లకిందులు చేశారు. సన్‌రైజర్స్‌ బౌలర్ల భరతంపట్టిన ఈ జోడీ రాయల్స్‌కు అద్భుత విజయం అందించింది. స్లో పిచ్‌పై రైజర్స్‌ బ్యాట్స్‌మెన్‌ శ్రమించిన చోటే వీరిద్దరూ సులువుగా పరుగులు సాధించారు. వచ్చిన ప్రతీ బౌలర్‌ పరుగులు సమర్పించుకోవడంతో మరో బంతి మిగిలి ఉండగానే రాజస్తాన్‌ విజయాన్నందుకుంది. వరుసగా నాలుగు పరాజయాల తర్వాత రాజస్తాన్‌ గెలుపు బాట పట్టగా... హైదరాబాద్‌ ఖాతాలో నాలుగో ఓటమి చేరింది.
   
దుబాయ్‌: రాజస్తాన్‌ రాయల్స్‌కు ఊరటనిచ్చే విజయం దక్కింది. ఆదివారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో రాయల్స్‌ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 158 పరుగులు చేసింది. మనీశ్‌ పాండే (44 బంతుల్లో 54; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీతో మెరిశాడు. కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ (38 బంతుల్లో 48; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకట్టుకున్నాడు. విలియమ్సన్‌ (12 బంతుల్లో 22 నాటౌట్‌; 2 సిక్సర్లు), ప్రియమ్‌ గార్గ్‌ (8 బంతుల్లో 15; 1 ఫోర్, 1 సిక్స్‌) వేగంగా ఆడారు. అనంతరం ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రాహుల్‌ తేవటియా (28 బంతుల్లో 45 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), రియాన్‌ పరాగ్‌ (26 బంతుల్లో 42; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో రాజస్తాన్‌ 19.5 ఓవర్లలో 5 వికెట్లకు 163 పరుగులు సాధించింది. వీరిద్దరూ అజేయంగా ఆరో వికెట్‌కు 85 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. ఖలీల్, రషీద్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు.

తొలుత తడబాటు...
159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌కు ఆరంభంలోనే దెబ్బ పడింది. రైజర్స్‌ బౌలర్లు చెలరేగడంతో బెన్‌ స్టోక్స్‌ (5), బట్లర్‌ (16), స్మిత్‌ (5) పవర్‌ప్లే లోపే పెవిలియన్‌ చేరారు. తర్వాత సంజూ సామ్సన్‌ (26; 3 ఫోర్లు), ఉతప్ప (18; 1 ఫోర్, 1 సిక్స్‌) కాస్త పోరాడినా రషీద్‌ఖాన్‌ ముందు వారి ఆటలు సాగలేదు. క్రీజులోకి రియాన్‌ పరాగ్, రాహుల్‌ తేవటియా వచ్చినప్పటికీ 15 ఓవర్లకు రాజస్తాన్‌ 94/5తో నిలిచింది. విజయానికి 30 బంతుల్లో 65 పరుగులు కావాలి. ఈదశలో సన్‌రైజర్స్‌ స్కోరు (96/2) కూడా దాదాపు అంతే.   

అలవోకగా పరుగులు...
అప్పటివరకు సింగిల్స్‌కే పరిమితమైన పరాగ్‌ 16వ ఓవర్‌ చివరి బంతికి సిక్స్‌తో జోరు పెంచాడు. సందీప్‌ శర్మ బౌలింగ్‌లో తేవటియా 6, పరాగ్‌ రెండు వరుస బౌండరీలు బాదడంతో 18 పరుగులు జతయ్యాయి. రషీద్‌ వేసిన 18వ ఓవర్‌లో వరుసగా మూడు ఫోర్లు బాదిన తేవటియా... నటరాజన్‌ తర్వాతి ఓవర్‌లో 4,6 దంచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. 6 బంతుల్లో 8 పరుగులు చేయాల్సి ఉండగా మొదటి నాలుగు బంతుల్లో 6 పరుగులు వచ్చాయి. ఐదో బంతికి సిక్సర్‌ బాదిన పరాగ్‌ జట్టుకు ఊరటనిచ్చే విజయాన్ని అందించాడు.

ఆకట్టుకున్న వార్నర్, మనీశ్‌..
ఆట ఆరంభంలో సన్‌రైజర్స్‌ అతి జాగ్రత్తకు పోయింది. నాలుగో ఓవర్‌లో వార్నర్‌ కొట్టిన ఫోర్‌తో బౌండరీల ఖాతా తెరచింది. ఆ తర్వాత  ఓ భారీ సిక్సర్‌ బాదిన బెయిర్‌స్టో (16) మరుసటి బంతికే ఔటయ్యాడు. పవర్‌ప్లేలో సన్‌రైజర్స్‌ స్కోరు 26/1. మనీశ్‌ వచ్చాక పరుగుల వేగం కాస్త పెరిగింది. ఏడో ఓవర్‌ తేవటియా బౌలింగ్‌లో మనీశ్, తర్వాతి ఓవర్‌లో వార్నర్‌ చెరో సిక్సర్‌తో అలరించారు. ఈ దశలో రాజస్తాన్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో 10–15 ఓవర్ల మధ్య వీరిద్దరు కలిసి కేవలం 2 సిక్సర్లు మాత్రమే బాదగలిగారు. బ్యాట్‌ ఝళిపించేందుకు సిద్ధమవుతున్న ఈ జంటను 15వ ఓవర్‌లో వార్నర్‌ను అవుట్‌ చేసి ఆర్చర్‌ విడదీశాడు. దీంతో రెండో వికెట్‌కు 73 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. 16వ ఓవర్‌లో 4, 6 బాదిన మనీశ్‌ 13 పరుగులు రాబట్టడంతో జట్టు స్కోరు 100 పరుగులు దాటింది. తర్వాత మనీశ్‌ పెవిలియన్‌ చేరినా... విలియమ్సన్‌ రెండు సిక్సర్లు బాదడంతో 19వ ఓవర్‌లో అత్యధికంగా 19 పరుగులు వచ్చాయి. చివరి ఓవర్‌లో 6,4 బాదిన ప్రియమ్‌ గార్గ్‌ జట్టు స్కోరును 150 పరుగులు దాటించాడు. చివరి 30 బంతుల్లో 62 పరుగులు సాధించింది.   

ఆ క్యాచ్‌ పట్టి ఉంటే...
అందివచ్చిన అవకాశాన్ని వదులుకుంటే ఒక్కోసారి భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌కు ఈ అనుభవం ఎదురైంది. ఖలీల్‌ అహ్మద్‌ వేసిన ఇన్నింగ్స్‌లో 16వ ఓవర్‌ మూడో బంతికి రియాన్‌ పరాగ్‌ భారీ షాట్‌ ఆడగా బంతి గాల్లోకి లేచింది. డీప్‌ మిడ్‌వికెట్‌లో ప్రియమ్‌ గార్గ్‌ క్యాచ్‌ను వదిలేశాడు. దాంతో పరాగ్‌ బతికిపోయాడు. అప్పటికి పరాగ్‌ 12 పరుగులతో ఉన్నాడు. ఒకవేళ పరాగ్‌ క్యాచ్‌ను గార్గ్‌ పట్టిఉంటే సన్‌రైజర్స్‌కు తుది ఫలితం మరోలా ఉండేదేమో.

స్కోరు వివరాలు
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: వార్నర్‌ (బి) ఆర్చర్‌ 48; బెయిర్‌స్టో (సి) సామ్సన్‌ (బి) త్యాగి 16; మనీశ్‌ (సి) తేవటియా (బి) ఉనాద్కట్‌ 54; విలియమ్సన్‌ (నాటౌట్‌) 22; ప్రియమ్‌ గార్గ్‌ (రనౌట్‌) 15; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 158. 

వికెట్ల పతనం: 1–23, 2–96, 3–122, 4–158.

బౌలింగ్‌: ఆర్చర్‌ 4–0–25–1, శ్రేయస్‌ గోపాల్‌ 4–0–31–0, కార్తీక్‌ త్యాగి 3–0–29–1, ఉనాద్కట్‌ 4–0–31–1, తేవటియా 4–0–35–0, బెన్‌స్టోక్స్‌ 1–0–7–0.  

రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: స్టోక్స్‌ (బి) ఖలీల్‌ అహ్మద్‌ 5; బట్లర్‌ (సి) బెయిర్‌స్టో (బి) ఖలీల్‌ అహ్మద్‌ 16; స్మిత్‌ (రనౌట్‌) 5; సంజూ సామ్సన్‌ (సి) బెయిర్‌స్టో (బి) రషీద్‌ ఖాన్‌ 26; ఉతప్ప (ఎల్బీడబ్ల్యూ) (బి) రషీద్‌ ఖాన్‌ 18; రియాన్‌ పరాగ్‌ (నాటౌట్‌) 42; రాహుల్‌ తేవటియా (నాటౌట్‌) 45; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (19.5 ఓవర్లలో 5 వికెట్లకు) 163.

వికెట్ల పతనం: 1–7, 2–25, 3–26, 4–63, 5–78.

బౌలింగ్‌: సందీప్‌ 4–0–32–0, అహ్మద్‌ 3.5–0–37–2, నటరాజన్‌ 4–1–32–0, అభిషేక్‌ శర్మ 1–0–11–0, రషీద్‌ ఖాన్‌ 4–0–25–2, విజయ్‌ శంకర్‌ 3–0–22–0.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement