అబుదాబి: ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఢిల్లీ చేతిలో ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆదివారం జరిగిన క్వాలిఫైయర్-2 లో 17 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రేయస్ అయ్యర్ సేన 20 ఓవర్లకు 189 పరుగులు చేయగా.. వార్నర్ దళం 172 పరుగుల వద్దే ఆగిపోయింది. అయితే, టోర్నీ మొదలైనప్పటి నుంచి కీలక ఆటగాళ్లు గాయాలతో వైదొలిగినా ఎస్‌ఆర్‌హెచ్ ఎక్కడా పోరాటాన్ని ఆపలేదని కెప్టెన్ డేవిడ్ వార్నర్ పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్‌లో చెప్పుకొచ్చాడు. జట్టు సమష్టి కృషి పట్ల గర్విస్తున్నానని పేర్కొన్నాడు.
‘ఐపీఎల్ 2020లో తొలి అర్థభాగం పూర్తయ్యే వరకు మా ప్రదర్శన మరీ అంత గొప్పగా ఏం లేదు. భువనేశ్వర్ కుమార్, మిచెల్ మార్ష్ గాయాలతో వెనుదిరగ్గా.. కేన్ విలియమ్సన్ టోర్నీప్రారంభంలో అందుబాటులో లేకపోవడంతో జట్టుకు కష్టాలు తప్పలేదు. ఇక గత మ్యాచ్‌లలో మెరుగ్గా రాణించిన వృద్ధిమాన్ సాహా కూడా గాయం కారణంగా క్వాలిఫైయర్-2 లో అందుబాటులో లేడు. తగినంత వనరులు లేకపోయినప్పటికీ.. సమష్టి ప్రదర్శనతోనే ఇక్కడిదాక రాగలిగాం. భువీ, మార్ష్ లేని సమయంలో నటరాజన్ తన అద్భుత బౌలింగ్‌తో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అతను మాకు దొరికిన గొప్ప బౌలర్. రషీద్ ఎప్పటిలానే మెరుగ్గా రాణించాడు. మూడో స్థానంలో రాణించి మనీష్ పాండే బ్యాటింగ్ లైనప్‌ను పటిష్టం చేశాడు. మాకు అండగా నిలిచిన సహాయక సిబ్బంది, మద్దతు తెలిపిన అభిమానులందరికీ కృతజ్ఞతలు’అని వార్నర్ తెలిపాడు.
(చదవండి: ఢిల్లీ వెళ్లింది ఫైనల్‌కు...)
కాగా, నిన్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు వార్నర్, ప్రియం గార్గ్‌తో పాటు, మనీష్ పాండే కూడా వెనుదిరగడంతో కష్టాలు మొదలయ్యాయి. అప్పటికీ జట్టు స్కోరు 5 ఓవర్లకు 44 మాత్రమే. అయినప్పటికీ మిగతా సభ్యులు జట్టును విజయ తీరాలకు చేర్చేందుకు తుదివరకూ పోరాడిన తీరు అభిమానుల హృదయాలను గెలుచుకుంది. ఇదిలాఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మంగళవారం జరగనుంది.
(చదవండి: వైరల్ : కూతుళ్లతో మురిసిపోతున్న ముంబై ఆటగాళ్లు)
Comments
Please login to add a commentAdd a comment