ఆదివారం 449 పరుగులు, 29 సిక్సర్లు... సోమవారం 402 పరుగులు, 26 సిక్సర్లు... ఐపీఎల్‌లో రెండు రోజుల మోత తర్వాత మంగళవారం కాస్త ప్రశాంతత. పరుగులు చేయడమే కష్టంగా మారిన పిచ్‌పై సన్‌రైజర్స్ గెలుపు బోణీ చేసింది. బ్యాటింగ్‌లో సాధారణ ప్రదర్శనే చేసినా, తమ బలం బౌలింగ్‌ను నమ్ముకున్న హైదరాబాద్ జట్టు సీజన్‌లో మొదటి విజయాన్ని నమోదు చేసింది. బెయిర్‌స్టో, వార్నర్, విలియమ్సన్ బ్యాటింగ్‌లో జట్టుకు తగిన స్కోరునందిస్తే, ఆ తర్వాత రషీద్ ఖాన్ స్పిన్ పదును ముందు ఢిల్లీ నిలబడలేకపోయింది. ఎంతగా శ్రమించినా లక్ష్యాన్ని ఛేదించలేక ఢిల్లీ క్యాపిటల్స్ ఈ లీగ్‌లో తొలి పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో మొత్తం 309 పరుగులు మాత్రమే రాగా, 9 సిక్సర్లే నమోదయ్యాయి!
అబుదాబి: సమష్టి ప్రదర్శనతో ఐపీఎల్–2020 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మొదటి విజయం దక్కింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 15 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. జానీ బెయిర్‌స్టో (48 బంతుల్లో 53; 2 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ సాధించగా... కెప్టెన్ డేవిడ్ వార్నర్ (33 బంతుల్లో 45; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కేన్ విలియమ్సన్ (26 బంతుల్లో 41; 5 ఫోర్లు) రాణించారు. రబడ, అమిత్ మిశ్రా చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసి ఓడింది. శిఖర్ ధావన్ (31 బంతుల్లో 34; 4 ఫోర్లు), రిషభ్ పంత్ (27 బంతుల్లో 32; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మినహా అంతా విఫలమయ్యారు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రషీద్ ఖాన్ (3/14) చక్కటి బౌలింగ్‌తో ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. భువనేశ్వర్‌కు 2 వికెట్లు దక్కాయి.
ఓపెనర్లు రాణింపు...
సన్‌రైజర్స్‌కు ఓపెనర్లు వార్నర్, బెయిర్‌స్టో మెరుగ్గానే ఇన్నింగ్స్‌ను ఆరంభించినా, భారీ షాట్లు మాత్రం కనిపించలేదు. పిచ్ నెమ్మదిగా ఉండటం కూడా ఇందుకు ఒక కారణం. మిడిలార్డర్ బలహీనత బయటపడకుండా వీరిద్దరే జాగ్రత్తగా కనీసం సగం ఓవర్లు ఆడే ప్రయత్నం చేశారు. పవర్‌ప్లేలో రైజర్స్ 38 పరుగులే చేయగా, ఇందులో 2 ఫోర్లు, 1 సిక్స్ మాత్రమే ఉన్నాయిు. తొలి వికెట్‌కు 57 బంతుల్లో 77 పరుగులు జోడించిన తర్వాత మిశ్రా బౌలింగ్‌లో రివర్స్ స్వీప్‌నకు ప్రయత్నించి వార్నర్ అవుట్ కావడంతో హైదరాబాద్ తొలి వికెట్ కోల్పోయింది. మనీశ్ పాండే (5 బంతుల్లో 3) విఫలం కాగా, బెయిర్‌స్టో 44 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే వెనుదిరిగాడు. చివర్లో నోర్జే బౌలింగ్‌లో వరుసగా ఫోర్, సిక్స్ కొట్టిన అబ్దుల్ సమద్ (7 బంతుల్లో 12 నాటౌట్) స్కోరును 150 పరుగులు దాటించాడు.
సమష్టి వైఫల్యం...
సాధారణ లక్ష్యఛేదనలో ఢిల్లీ ఇన్నింగ్స్ కూడా తడబడుతూనే సాగింది. తొలి ఓవర్లోనే పృథ్వీ షా (2)ను భువనేశ్వర్ అవుట్ చేయగా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (21 బంతుల్లో 17; 2 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నంతసేపు ఇబ్బందిగా ఆడాడు. మరోవైపు ధావన్ మాత్రం తన అనుభవంతో ఇన్నింగ్స్‌ను జాగ్రత్తగా నడిపించే ప్రయత్నం చేశాడు. అయితే భారీ షాట్లు ఆడే ప్రయత్నంలో మాత్రం ఎవరూ సఫలం కాలేకపోయారు. వీరిద్దరిని రషీద్ వెనక్కి పంపడంతో రైజర్స్‌లో గెలుపు ఆశలు పెరిగాయి. ఈ దశలో పంత్, హెట్‌మైర్ (12 బంతుల్లో 21; 2 సిక్సర్లు) కాస్త దూకుడుగా ఆడే ప్రయత్నం చేశారు. అభిషేక్ బౌలింగ్‌లో పంత్, ఖలీల్ బౌలింగ్‌లో హెట్‌మైర్ వరుసగా రెండేసి సిక్సర్లు బాదారు. అయితే ఇదే జోరులో భువీ బౌలింగ్‌లో హెట్‌మైర్ అవుటయ్యాడు. 21 బంతుల్లో 46 పరుగులు చేయాల్సిన స్థితిలో ఢిల్లీ ఆశలన్నీ పంత్‌పైనే ఉండగా... రషీద్ ఖాన్ అతడిని డగౌట్ చేర్చడంతో రైజర్స్‌కు విజయావకాశం చిక్కింది. ఆపై స్టొయినిస్ (11) కూడా ఏమీ చేయలేకపోయాడు.
కేన్ క్లాస్...
న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ ఈ మ్యాచ్‌లో చక్కటి ఇన్నింగ్స్‌తో తన విలువేంటో చూపించాడు. గాయంతో తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన అతను నబీ స్థానంలో తుది జట్టులోకి వచ్చాడు. 157.69 స్ట్రయిక్ రేట్‌తో రైజర్స్ చెప్పుకోదగ్గ స్కోరు సాధించడంలో కేన్ కీలకపాత్ర పోషించాడు. తనదైన క్లాస్ శైలిలో అతను చూడచక్కటి ఐదు బౌండరీలు కొట్టాడు. నోర్జే బౌలింగ్‌లో వరుసగా రెండు, స్టొయినిస్ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన విలియమ్సన్... మిశ్రా బౌలింగ్‌లో కొట్టిన ఫ్లిక్ షాట్ బౌండరీ ఇన్నింగ్స్‌కే హైలైట్‌గా నిలిచింది. చివరి ఓవర్ మూడో బంతికి అతను అవుటయ్యాడు.
సమద్ అరంగేట్రం
సన్‌రైజర్స్ తుది జట్టులో 19 ఏళ్ల అబ్దుల్ సమద్‌కు అవకాశం లభించింది. జమ్మూ కశ్మీర్‌కు చెందిన ఈ కుర్రాడికి ఇదే తొలి ఐపీఎల్ మ్యాచ్. మ్యాచ్‌కు ముందు కెప్టెన్ వార్నర్ సమద్‌కు క్యాప్ అందించాడు. గతంలో కశ్మీర్‌కు చెందిన పర్వేజ్ రసూల్ ఐపీఎల్‌లో మూడు వేర్వేరు జట్లకు ప్రాతినిధ్యం వహించగా, రసిఖ్ సలామ్ గత ఏడాది ముంబై ఇండియన్స్ తరఫున ఒక మ్యాచ్ ఆడాడు. 2018లో మంజూర్ దార్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వేలంలో తీసుకున్నా... ఒక్క మ్యాచ్‌లో కూడా అవకాశం ఇవ్వలేదు.
స్కోరు వివరాలు
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) పంత్ (బి) మిశ్రా 45; బెయిర్‌స్టో (సి) నోర్జే (బి) రబడ 53; మనీశ్ పాండే (సి) రబడ (బి) మిశ్రా 3; విలియమ్సన్ (సి) అక్షర్ (బి) రబడ 41; సమద్ (నాటౌట్) 12; అభిషేక్ శర్మ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 164.
వికెట్ల పతనం: 1–77; 2–92; 3–144; 4–160.
బౌలింగ్: ఇషాంత్ శర్మ 3–0–26–0; రబడ 4–0–21–2; నోర్జే 4–0–40–0; స్టొయినిస్ 3–0–22–0; అమిత్ మిశ్రా 4–0–35–2; అక్షర్ పటేల్ 2–0–14–0.
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి) బెయిర్‌స్టో (బి) భువనేశ్వర్ 2; ధావన్ (సి) బెయిర్‌స్టో (బి) రషీద్ 34; అయ్యర్ (సి) సమద్ (బి) రషీద్ 17; పంత్ (సి) గార్గ్ (బి) రషీద్ 32; హెట్‌మైర్ (సి) పాండే (బి) భువనేశ్వర్ 21; స్టొయినిస్ (ఎల్బీ) (బి) నటరాజన్ 11; అక్షర్ (బి) ఖలీల్ 5; రబడ (నాటౌట్) 15; నోర్జే (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి) 147.
వికెట్ల పతనం: 1–2; 2–42; 3–62; 4–104; 5–117; 6–126; 7–138.
బౌలింగ్: భువనేశ్వర్ 4–0–25–2; ఖలీల్ 4–0–43–1; నటరాజన్ 4–0–29–1; అభిషేక్ 4–0–34–0; రషీద్ ఖాన్ 4–0–14–3.
Comments
Please login to add a commentAdd a comment