ఐపీఎల్‌లో అట్టడుగున నిలిచిన జట్టు పంజాబ్. గెలిచే మ్యాచ్‌ల్ని ఓడిన జట్టు కూడా పంజాబే! రెండొందల పైచిలుకు స్కోరు చేసినా పరాజయాన్ని పలకరించిన జట్టు కింగ్స్ ఎలెవనే. ఇలాంటి జట్టు ఈ మ్యాచ్‌కు ముందు వరకు ఏడింట ఒకే ఒక మ్యాచ్ గెలిచింది. అది బెంగళూరుపైనే! ఇప్పుడు కూడా ఐదు వరుస పరాజయాల తర్వాత మళ్లీ బెంగళూరుపైనే గెలిచి హమ్మయ్య గెలిచామనిపించింది. కింగ్స్ ఎలెవన్ అభిమానుల్ని ఊరటనిచ్చింది. లీగ్‌లో ముందడుగు వేసే అవకాశాల్ని సజీవంగా నిలుపుకుంది.
షార్జా: ఎట్టకేలకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మళ్లీ గెలిచింది. మరుగున పడిన ఆశలకు ఊపిరి పోసింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 8 వికెట్ల తేడాతో బెంగళూరుపై గెలుపొందింది. టాస్ నెగ్గి మొదట బ్యాటింగ్‌కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్లకు 171 పరుగులు చేసింది. కోహ్లి (39 బంతుల్లో 48; 3 ఫోర్లు) రాణించగా... మోరిస్ (8 బంతుల్లో 25 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్‌లు) మెరిపించాడు. తర్వాత కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రాహుల్ (49 బంతుల్లో 61 నాటౌట్; 1 ఫోర్, 5 సిక్సర్లు), గేల్ (45 బంతుల్లో 53; 1 ఫోర్ 5 సిక్స్‌లు), మయాంక్ అగర్వాల్ (25 బంతుల్లో 45; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా ఆడారు.
దూకుడుగా మొదలై...
మ్యాక్స్‌వెల్ తొలి ఓవర్లో లాంగ్ లెగ్‌లో భారీ సిక్సర్ బాదిన ఫించ్, షమీ రెండో ఓవర్లో ఫోర్ కొట్టాడు. కాస్త ఆలస్యంగా బ్యాట్‌కు పనిచెప్పిన దేవ్‌దత్ పడిక్కల్ త్వరగానే పెవిలియన్ చేరాడు. షమీ వేసిన నాలుగో ఓవర్లో డీప్ స్క్వేర్ లెగ్‌లో అతను సిక్స్ బాదాడు. 4 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు 38/0 స్కోరు చేసింది. కానీ ఆ తర్వాతి ఓవర్ తొలి బంతికే దేవ్‌దత్ చెత్త షాట్‌తో వికెట్ పారేసుకున్నాడు. కోహ్లి వస్తూనే రెండు వరుస బౌండరీలు కొట్టాడు. 5.2 ఓవర్లలో బెంగళూరు 50 పరుగులకు చేరింది. జట్టు కుదుటపడే సమయంలో ఫించ్‌కు (18 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్) మురుగన్ అశ్విన్ చెక్ పెట్టాడు.
ఏబీని కాదని...
ఈ దశలో లెగ్ స్పిన్‌ను ఏబీ డివిలియర్స్ సరిగా ఆడలేడనే ఆలోచనతో ఆర్‌సీబీ టీమ్ వాషింగ్టన్ సుందర్‌ను ముందుగా బ్యాటింగ్‌కు పంపింది. ఈ ఎత్తుగడ ఏ మాత్రం జట్టుకు లాభించలేదు. కోహ్లితో సుందర్ జోడీ కుదర్లేదు. 10 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు 2 వికెట్లకు 83 పరుగులు చేసింది. మరుసటి ఓవర్లో సుందర్ (13)ను మురుగన్ అశ్విన్ పెవిలియన్ పంపాడు. మళ్లీ బెంగళూరు చేసిన తప్పే మళ్లీ చేసింది. ఈ సారీ కూడా ఏబీని కాదని శివమ్ దూబేను పంపింది. 11 నుంచి 14 ఓవర్లదాకా స్కోరు వేగం పూర్తిగా తగ్గింది. నాలుగు ఓవర్లలో బెంగళూరు 19 పరుగులే చేసింది. బిష్ణోయ్ వేసిన 15వ ఓవర్లో 2 భారీ సిక్సర్లు బాదిన దూబే (19 బంతుల్లో 23; 2 సిక్స్‌లు)ను తర్వాతి ఓవర్లోనే జోర్డాన్ అవుట్ చేశాడు. 17వ ఓవర్లో బ్యాటింగ్‌కు వచ్చిన డివిలియర్స్ (2)ను షమీ 18వ ఓవర్లో పెవిలియన్ చేర్చాడు. రెండు బంతుల వ్యవధిలో కోహ్లి కూడా అవుటవడంతో డివిలియర్స్‌ను ఆపి ఆఖర్లో దించిన ఆర్‌సీబీ అంచనా తలకిందులైంది. షమీ వేసిన ఆఖరి ఓవర్లో మోరిస్ భారీషాట్లతో విరుచుకుపడటంతో ఆర్‌సీబీ ఇన్నింగ్స్‌లోనే అత్యధికంగా 24 పరుగులు వచ్చాయి.
ఓపెనర్ల శుభారంభం
మోరిస్ వేసిన తొలి ఓవర్‌లో ఒకే పరుగు చేయడంతో పంజాబ్ ఇన్నింగ్స్ మొదలైంది. తర్వాత బౌండరీలతో పుంజుకుంది. ఆ వెంటే సిక్సర్లతో హోరెత్తింది. రాహుల్ రెండో ఓవర్లో ఫోర్ కొట్టాడు. ఈ రెండు ఓవర్లు ముగిసినా... మయాంక్ అగర్వాల్ ఖాతానే తెరవలేదు. మూడో ఓవర్లో మళ్లీ రాహులే సిక్సర్‌తో మెరిపించాడు. 3 ఓవర్లలో పంజాబ్ స్కోరు 18/0. ఇక నాలుగో ఓవర్‌ను స్పిన్నర్ చహల్ బౌలింగ్ చేయగా... మయాంక్ బ్యాట్ ఝులిపించాడు. సిక్స్‌తో పాటు రెండు ఫోర్లు కొట్టాడు. ఈ ఓవర్లో 15 పరుగులు పిండుకున్నాడు. ఆ తర్వాత కూడా సిక్స్ లేదంటే ఫోర్‌తో ఓవర్లు సాగిపోయాయి. కింగ్స్ ఎలెవన్ జట్టు ఆరో ఓవర్లో 50 పరుగులకు చేరింది.
రాహుల్ ఫిఫ్టీ
పంజాబ్ ఓపెనర్లు కుదురుకోవడంతో పరుగుల వేగం పెరిగింది. రాహుల్ కంటే ధాటిగా ఆడుతున్న మయాంక్ (25 బంతుల్లో 45; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు)కు ఎట్టకేలకు చహల్ చెక్ పెట్టాడు. 8వ ఓవర్లో బౌలర్ తలమీదుగా సిక్స్‌కొట్టిన అగర్వాల్ ఆ తర్వాతి బంతికే బౌల్డయ్యాడు. దీంతో 78 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. సిరాజ్ వేసిన 12వ ఓవర్లో రాహుల్ వరుసగా 2 సిక్సర్లు బాదడంతో పంజాబ్ వంద పరుగులను అధిగమించింది. రాహుల్ 37 బంతుల్లో (1 ఫోర్, 4 సిక్స్‌లు) అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు.
గేల్ ధనాధన్
తొలి మ్యాచ్ ఆడుతున్న గేల్ తొలి 14 బంతుల్లో 6 పరుగులే చేసినా, సుందర్ ఓవర్లో భారీ సిక్సర్లతో టచ్‌లోకి వచ్చాడు. తర్వాత సిరాజ్ బౌలింగ్‌లో గేల్ 4, 6 కొడితే రాహుల్ మరో సిక్స్ బాదాడు. దీంతో ఆ ఓవర్లో ఏకంగా 20 పరుగులొచ్చాయి. 17వ ఓవర్లో గేల్ తనదైన శైలిలో లాంగాన్‌లో 2 సిక్సర్లను బాదేశాడు. దీంతోనే అతని అర్ధశతకం 36 బంతుల్లో పూర్తయ్యింది. 18 బంతుల్లో 11 పరుగులు చేయాల్సి వుండగా... మోరిస్ (18వ), ఉదాన (19వ) రెండు ఓవర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కేవలం 9 పరుగులే వచ్చాయి. ఆఖరి ఓవర్లో విజయానికి 2 పరుగులు అవసరం కాగా చహల్ కూడా పేసర్లలాగే వైవిధ్యమైన బంతులేశాడు. 4 బంతుల్లో పరుగు మాత్రమే ఇచ్చాడు. స్కోరు సమమైంది. ఐదో బంతికి గేల్ రనౌటయ్యాడు. ఆఖరి బంతికి పరుగు చేయాల్సిన సమయంలో ఉత్కంఠ రేగింది. కానీ పూరన్ భారీ సిక్సర్‌తో ఈ ఉత్కంఠను, లక్ష్యాన్ని ఛేదించాడు.
స్కోరు వివరాలు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: ఫించ్ (బి) మరుగున్ అశ్విన్ 20; పడిక్కల్ (సి) పూరన్ (బి) అర్‡్షదీప్ 18; కోహ్లి (సి) రాహుల్ (బి) షమీ 48; సుందర్ (సి) జోర్డాన్ (బి) అశ్విన్ 13; దూబే (సి) రాహుల్ (బి) జోర్డాన్ 23; డివిలియర్స్ (సి) హుడా (బి) షమీ 2; మోరిస్ (నాటౌట్) 25; ఉదాన (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 171.
వికెట్ల పతనం: 1–38, 2–62, 3–86, 4–127, 5–134, 6–136.
బౌలింగ్: మ్యాక్స్‌వెల్ 4–0–28–0, షమీ 4–0–45–2, అర్‡్షదీప్ 2–0–20–1, రవి బిష్ణోయ్ 3–0–29–0, మురుగన్ అశ్విన్ 4–0–23–2, జోర్డాన్ 3–0–20–1.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: రాహుల్ (నాటౌట్) 61; మయాంక్ (బి) చహల్ 45; గేల్ (రనౌట్) 53; పూరన్ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్లకు) 177.
వికెట్ల పతనం: 1–78, 2–171.
బౌలింగ్: మోరిస్ 4–0–22–0, సైనీ 4–0–21–0, చహల్ 3–0–35–1, ఉదాన 2–0–14–0, సిరాజ్ 3–0–44–0, సుందర్ 4–0–38–0.
కోహ్లి @ 200
మ్యాచ్‌ల్లో సెంచరీలు కొట్టే విరాట్... మ్యాచ్‌ల పరంగా డబుల్ సెంచరీ సాధించాడు. ఐపీఎల్ పుట్టినప్పటినుంచి ఆర్‌సీబీని వీడని కెప్టెన్ కోహ్లి ఈ జట్టు తరఫున గురువారం 200వ మ్యాచ్ ఆడాడు. ఇందులో 185 ఐపీఎల్‌లోనే ఆడగా... మిగతా 15 మ్యాచ్‌లు చాంపియన్స్ లీగ్ (రద్దయింది)లో ఆడాడు.
Comments
Please login to add a commentAdd a comment