సాక్షి, ముంబై: సెంట్రల్, హార్బర్, వెస్టర్న్ రైల్వే మార్గాలపై ఆదివారం మెగాబ్లాక్ నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం నాలుగు గంటల వరకు మెగాబ్లాక్ కొనసాగనుంది. రైల్వే ట్రాక్‌లు, ఓవర్ హెడ్ వైర్ల మరమ్మతులు, నిర్వహణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో సెలవు దినమైన ఆదివారం మెగాబ్లాక్ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఈ ఆదివారం నిర్వహించే మెగాబ్లాక్ కారణంగా పలు లోకల్ రైళ్లను రద్దు చేయగా, మరికొన్నింటిని ఇతర మార్గాల మీదుగా మళ్లించనున్నారు. అలాగే కొన్ని ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు సెంట్రల్, వెస్టర్న్ రైల్వే పీఆర్వోలు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
సెంట్రల్‌లో...
భైకళా-విద్యావిహార్‌ల మధ్య డౌన్ స్లో ట్రాక్‌పై ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3.21 గంటల వరకు మెగాబ్లాక్ నిర్వహించనున్నారు. డౌన్ స్లో ట్రాక్‌పై నడిచే లోకల్ రైళ్లను ఫాస్ట్ ట్రాక్‌పై మళ్లిస్తారు. దీంతో భైకళా అనంతరం పరెల్, దాదర్, మాటుంగా, సైన్ కూర్లా స్టేషన్లలో మాత్రమే హాల్ట్ అవుతాయి. అనంతరం విద్యావిహార్ నుంచి స్లో మార్గంపైకి మళ్లించి నడపనున్నారు.
మరోవైపు ఠాణే నుంచి అప్ ఫాస్ట్ ట్రాక్‌పై నడిచే రైళ్లు ఉదయం 11.21 గంటల నుంచి మధ్యాహ్నం 3.25 గంటల వరకు ములూండ్, భాండూప్, విక్రోలి, ఘాట్కోపర్, కుర్లాలో నిలుపనున్నారు. మరోవైపు ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్‌టీ) నుంచి ఫాస్ట్ లోకల్ రైళ్లన్నీ ఉదయం 11.15 గంటల నుంచి మధ్యాహ్నం 2.51 గంటల వరకు ఘాట్కోపర్ అనంతరం విక్రోలి, భాండూప్, ములూండ్‌లలో కూడా నిలపుతారు.
హార్బర్‌లో...
హార్బర్ మార్గంలో కుర్లా-సీఎస్‌టీల మధ్య అప్ మార్గం, వాడాలా-మాహీంల మధ్య అప్ డౌన్ మార్గాలపై ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు మెగాబ్లాక్ నిర్వహించనున్నారు. దీంతో డౌన్ హార్బర్ మార్గంలో బాంద్రా/అంధేరి- సీఎస్‌టీల మధ్య ఇరు మార్గాలపై నడిచే లోకల్ రైళ్లను మెగాబ్లాక్ నిర్వహించే సమయంలో రద్దు చేశారు. మరోవైపు అప్ హార్బర్ మార్గంలో కుర్లా-సీఎస్‌టీల మధ్య నడిచే లోకల్ రైళ్లన్నీ ఉదయం 11.08 గంటల నుంచి మధ్యాహ్నం 3.20 గంటల వరకు ప్రధాన మార్గం మీదుగా నడపనున్నారు. ఈ లోకల్ రైళ్లను కరీ రోడ్డు, చించ్‌పోక్లీ స్టేషన్లలో కూడా నిలుపనున్నారు.
పశ్చిమ రైల్వేలో..
పశ్చిమ రైల్వే మార్గంలోని మరీన్ లైన్స్ నుంచి మాహీంల మధ్య డౌన్ స్లో ట్రాక్‌పై మెగాబ్లాక్ నిర్వహించనున్నారు. దీంతో సదరు స్టేషన్ల మధ్య నడిచే లోకల్ రైళ్లను ఫాస్ట్ ట్రాక్‌పై మళ్లిస్తారు. ఈ క్రమంలో మహాలక్ష్మి, ఎల్ఫిన్‌స్టన్ రోడ్, మాటుంగా రోడ్ స్టేషన్లలో ఈ రైళ్లకు హాల్ట్‌లు ఉండవని రైల్వే ప్రకటించింది. దీంతోపాటు కొన్ని లోకల్ రైళ్లను రద్దు కూడా చేశారు.
నేడు రైల్వే మార్గాలపై మెగాబ్లాక్
Published Sat, Jan 4 2014 11:35 PM | Last Updated on Sat, Sep 2 2017 2:17 AM
Advertisement
Advertisement