నేడు రైల్వే మెగా బ్లాక్
♦ పలు రైళ్లు రద్దు,దారి మళ్లింపు
♦ ఆలస్యంగా నడవనున్న మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు
♦ సాయంత్రం 4 గంటలకు జరగనున్న మెగా బ్లాక్
సాక్షి, ముంబై : సెంట్రల్ రైల్వే, హార్బర్ రైల్వే మార్గాలపై ఆదివారం మెగా బ్లాక్ నిర్వహించనున్నారు. దీని పరిణామంగా పలు లోకల్ రైళ్లు రద్దు చేయగా మరికొన్నింటిని ఇతర మార్గాల మీదుగా మళ్లించి నడపనున్నారు. హార్బర్ లైన్ అప్, డౌన్ మార్గంలో మసీద్-చూనాబట్టి రైల్వేస్టేషన్‌ల మధ్య, వడాలా-మహీం రైల్వేస్టేషన్ల మధ్య అప్, డౌన్ మార్గాల్లో కూడా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మెగా బ్లాక్ నిర్వహించనున్నారు.
ఈ సమయంలో ఛత్రపతి శివాజీ టర్మినస్ (సీఎస్‌టీ)-వాషి, బేలాపూర్, పన్వెల్‌ల మధ్య నడిచే లోకల్ రైళ్లన్నింటిని మెగా బ్లాక్ సమయంలో రద్దు చేశారు. మెగా బ్లాక్ సమయలో ప్రత్యేకంగా కుర్లా-పన్వెల్‌ల మధ్య లోకల్ రైళ్లు నడపనున్నారు. సీఎస్‌టీ-బాంద్రా, అంధేరి మధ్య నడిచే లోకల్ రైళ్లన్నింటినీ మెగా బ్లాక్ సమయంలో రద్దు చేశారు. ఈ మార్గంపై ప్రయాణించే వారంతా సెంట్రల్ రైల్వే ప్రధాన మార్గం, వెస్టర్న్ రైల్వే మార్గంపై తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చు.
సెంట్రల్ ప్రధాన మార్గంలో..
సెంట్రల్ ప్రధాన మార్గంలో థానే-కల్యాణ్ రైల్వేస్టేషన్ల మధ్య డౌన్ ఫాస్ట్‌ట్రాక్‌పై ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు మెగా బ్లాక్ జరగనుంది. దీంతో ఛత్రపతి శివాజీ టర్మినస్ (సీఎస్‌టీ)లో ఉదయం 9.37 గంటల నుంచి మధ్యాహ్నం 2.25 గంటల మధ్య ఫాస్ట్‌ట్రాక్ మీదుగా నడిచే రైళ్లన్నింటినిథానే-కల్యాణ్ రైల్వేస్టేషన్ల మధ్య స్లోట్రాక్ మీదుగా మళ్లించనున్నారు. అలాగే ఈ సమయంలో థానే-కల్యాణ్ మధ్య ఉన్న రైల్వే స్టేషన్లన్నింటిలో ఫాస్ట్ లోకల్ రైళ్లను నిలపనున్నట్లు అధికారులు తెలిపారు.
మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు..
మెగా బ్లాక్ నేపథ్యంలో దూరప్రాంతాలకు నడిచే మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లపై కూడా ప్రభావం పడనుంది. లోకమాన్య తిలక్ టర్మినస్ (ఎల్‌టీటీ- కుర్లా) నుంచి ఉదయం 11.40 గంటలకు బయలుదేరాల్సిన 16345 డౌన్ నేత్రవతి ఎక్స్‌ప్రెస్ రైలు మెగా బ్లాక్ కారణంగా మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరనుంది. అలాగే థానే, కల్యాణ్ రైల్వేస్టేషన్ల మధ్య దూరప్రాంతాలకు వెళ్లే రైళ్లన్నింటిని స్లోమార్గంపై మళ్లించనున్నట్లు సెంట్రల్ రైల్వే పేర్కొంది.
వెస్టర్న్ మార్గంలో..
వెస్టర్న్ రైల్వేమార్గంలో బాంద్రా నుంచి అంధేరీల మధ్య డౌన్ స్లో మార్గంపై ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మెగాబ్లాక్ నిర్వహించనున్నారు. పరిణామ క్రమంలో చర్చిగేట్ నుంచి నడిచే అంధేరి, బోరివలి, విరార్ తదితర లోకల్ రైళ్లన్నింటిని బాంద్రా-అంధేరీ రైల్వేస్టేషన్ల మధ్య డౌన్ హార్బర్ మార్గంపై మళ్లించి నడపనున్నారని వెస్టర్న్ రైల్వే తెలిపింది.